ఫ్యాన్స్‌ కేరింతలు.. ఆలోపే మృత్యువు
కేప్‌టౌన్‌ :

అభిమానుల కేరింతల మధ్య బ్యాక్‌ ఫ్లిప్‌(జిమ్నాస్టిక్‌ స్టంట్‌) చేయబోయి దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ బాడీ బిల్డర్‌ సిఫిసో లున్జెలో తబేత్‌(23) మృతిచెందాడు. స్టంట్‌ చేస్తుండగా జరిగిన చిన్న తప్పిదంతో తబేత్‌ ప్రాణాలు కోల్పోవాల్సివచ్చింది. అప్పటి వరకు అభిమానుల కేరింతలతో హుషారుగా ఉన్న స్టేడియం ప్రాంగణం తబేత్‌ చలనంలేకుండా పడిపోవడంతో ఒక్కసారిగా మూగబోయింది. తబేత్ స్వస్థలం దక్షిణాఫ్రికాలోని ఎమ్లాంజీలో జరిగిన బాడీ బిల్డింగ్‌ పోటీల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.జిమ్నాస్టిక్‌ స్టేడియంలో మ్యాట్‌ మధ్యలోకి వెళ్లి వెనకవైపు నుంచి గాల్లోకి ఎగిరి ల్యాండ్‌ అయ్యే సందర్భంలో తబేత్‌ సరిగా బ్యాలెన్స్ చేయలేకపోయాడు. దీంతో అతని బరువు మొత్తం ఒకే సారి మెడ భాగంలో పడటంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఎలాంటి చలనం లేకుండా పడి ఉన్నతబేత్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.75 కిలోల కేటగిరీలో ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్ ఆఫ్‌ బాడీ బిల్డింగ్ అండ్‌ ఫిట్‌నెస్‌(ఐఎఫ్‌బీబీ) జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌గా తబేత్‌ నిలవడమే కాకుండా, ఇటీవలే జరిగిన అండర్‌23, 75 కిలోల కేటగిరీలో ఐఎఫ్‌బీబీ మజిల్‌ ములీషా గ్రాండ్‌ ఫ్రిక్స్‌ విజేతగా నిలిచాడు.

Back to Top