ఇటలీలో భారతీయులపై దాడి

Attack on Indians in Italy

మిలన్‌ నగరంలో విద్యార్థులపై వరుస దాడులు 

ఆందోళన అవసరంలేదు: సుష్మా

మిలన్‌/న్యూఢిల్లీ: ఇటలీలోని మిలన్‌లో భారతీయ విద్యార్థులపై గతకొన్ని రోజుల్లో వరుస దాడులు జరిగాయని ఆ నగరంలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ వెల్లడించింది. అయితే ఈ దాడులు జాతి వివక్షతో జరిగాయా మరేదైనా ఉద్దేశంతోనా అనే విషయాన్ని కాన్సులేట్‌ వివరించలేదు. దాడుల అంశాన్ని మిలన్‌లోని ఇటలీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామనీ, భారతీయ విద్యార్థులెవరూ భయపడవద్దని కాన్సులేట్‌ జనరల్‌ ట్విటర్‌లో పేర్కొంది.

భారతీయ విద్యార్థులు ఒంటరిగా బయటకు వెళ్లకూడదనీ, దాడులు జరిగిన ప్రదేశాల గురించి విద్యార్థులందరూ పరస్పరం సమాచారం అందించుకోవాలని కాన్సులేట్‌ ఓ ప్రకటనలో కోరింది. విద్యార్థులు బయటకు వెళ్లినప్పుడు ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుకుంటూ ఉండాలని కాన్సులేట్‌ సూచించింది.

అక్కడి విద్యార్థుల కోసం ఓ హెల్ప్‌లైన్‌ నంబరును కూడా కాన్సులేట్‌ ప్రకటించింది. మరోవైపు ఇటలీలో దాడుల ఘటనలకు సంబంధించి తనకు  నివేదికలు అందాయని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విటర్‌లో తెలిపారు. పరిస్థితిని  స్వయంగా పర్యవేక్షిస్తున్నాననీ,  భయాందోళనలకు గురి కావద్దని సుష్మ భరోసానిచ్చారు. ఓ బాధితుడితో మాట్లాడాననీ, దోపిడీలో భాగంగా దాడి జరిగిందని అతను చెప్పినట్లు సుష్మ వెల్లడించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top