బిల్లు కట్టలేక.. ఏం చేయాలో పాలుపోక..

Tragedy of Jubilee Hills accident victims - Sakshi

జూబ్లీహిల్స్‌ ప్రమాద బాధిత కుటుంబాల దయనీయ స్థితి 

రూ.వేలల్లో ఇద్దరు క్షతగాత్రుల హాస్పిటల్‌ బిల్లులు 

ఆ మొత్తం చెల్లిస్తే కానీ డిశ్చార్జ్‌ చేయని పరిస్థితి 

తమ వల్ల కాదంటున్న ‘అనూష’ కుటుంబీకులు 

తలలు పట్టుకుంటున్న పోలీసు అధికారులు 

హైదరాబాద్‌: ఆ ముగ్గురూ దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. వీరిలో ఇద్దరికి తల్లిదండ్రులు సైతం లేకపోవడంతో సంరక్షకులే దిక్కయ్యారు. వీరంతా బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చిన వారే. ఆదివారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో జరిగిన ప్రమాదంలో మస్తానీ మరణించగా... అనూషరెడ్డి, అనూష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆస్పత్రి బిల్లులు ఇప్పటికే రూ.వేలల్లో ఉండటంతో చెల్లించడం తమ వల్ల కాదంటూ క్షతగాత్రుల సంబంధీకులు వాపోతున్నారు. స్వస్థలాలకు తీసుకెళ్లి, తాహతుకు తగిన ఆస్పత్రిలో చేరుస్తామని వీరంటుంటే... బిల్లు కట్టనిదే డిశ్చార్జ్‌ చేయలేమని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పోలీసులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.  

భర్తకు దూరమైన అనూషరెడ్డి... 
కోమాలో ఉన్న అనూషరెడ్డి పరిస్థితి మరీ దారుణం. రాజమండ్రికి చెందిన ఈమె చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోగా... అన్న వరుసయ్యే వ్యక్తి చేరదీశారు. కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. తన ఇద్దరు పిల్లల్నీ సమీప బంధువుల వద్ద ఉంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జూనియర్‌ ఆర్టిస్టుగా పని చేస్తోంది. ఈమె చికిత్స ఖర్చు ఇప్పటికే రూ.లక్ష దాటిందని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సాయంత్రం వరకు సంబంధీకులు ఎవరూ రాకపోవడంతో స్నేహితులే ఆమె దగ్గరున్నారు. దీంతో పోలీసులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. సోమవారం సాయంత్రం ఆమె సమీప బంధువు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రూ.లక్షల్లో బిల్లు చెల్లించలేనని, డిశ్చార్జ్‌ చేస్తే తమ స్వస్థలానికి తీసుకెళ్లి వైద్యం చేయించుకుంటామని చెప్తున్నారు.  

ఉద్యోగం కోసం వచ్చిన అనూష... 
రాజమండ్రికి చెందిన అనూష సైతం చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయింది. పిన్ని వద్ద ఉంటూ ఇంటర్‌ వరకు చదివింది. ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ప్రమాదానికి గురైంది. సోమవారం నాటికి ఈమె వైద్య ఖర్చుల బిల్లు రూ.40 వేలు అయింది. అతికష్టంమ్మీద ఆ బిల్లు చెల్లించిన ఆమె బంధువులు.. అనూషను తమ వెంట తీసుకువెళ్లారు. 

బిల్లు చేతిలో పెట్టారు... 
జూనియర్‌ ఆర్టిస్ట్‌ మస్తానీ భర్త సురేశ్‌ తాడేపల్లిగూడెంలో ఓ చిన్న ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. భార్య మృతి విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం ఆస్పత్రికి చేరుకున్నారు. మస్తానీ ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయినా, ఆస్పత్రి వర్గాలు మాత్రం రూ.9,800 చెల్లించమంటూ బిల్లు చేతిలో పెట్టారు. అతికష్టంమ్మీద సోమవారం సురేశ్‌ బిల్లు చెల్లించి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లారు. 

‘బీమా’ కూడా రాదు... 
బిల్లులపై పోలీసులు ఆస్పత్రి వర్గాలను సంప్రదించగా, కొంత మొత్తం తగ్గించగలమని, పూర్తిగా రద్దు చేయలేమన్నారు. ప్రమాదానికి కారకుడైన విష్ణువర్దన్‌ జైల్లో ఉండటంతో అతడినీ సంప్రదించే ఆస్కారం లేకుండా పోయింది. మద్యం మత్తులో యాక్సిడెంట్‌ చేశారు కాబట్టి వాహన ఇన్సూరెన్స్‌ సైతం క్లైమ్‌ అయ్యే పరిస్థితి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. అనూషరెడ్డి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. విష్ణువర్దన్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు రెండు వారాల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. సిటీలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులుగా మారుతున్న అనేక మంది పరిస్థితులూ ఇలానే ఉంటున్నాయని, తమ తప్పు లేకపోయినా వారే శిక్ష అనుభవించాల్సి వస్తోందని పోలీసులు చెప్తున్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top