‘ఆర్‌సీఎస్‌’లోకి తెలంగాణ

‘ఆర్‌సీఎస్‌’లోకి తెలంగాణ


కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు, కేటీఆర్‌ సమక్షంలో ఎంఓయూ



సాక్షి, న్యూఢిల్లీ:
ప్రజలకు విమానయానాన్ని చేరువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్‌సీఎస్‌)లో తెలంగాణ ప్రభుత్వం చేరింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు, రాష్ట్ర ఐటీ మంత్రి కె. తారక రామారావు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ పథకంలో చేరడం వల్ల సమీప భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో ప్రధాన ప్రాంతీయ ప్రాంతాలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు మాట్లాడుతూ.. ప్రజలకు విమాన సేవలు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రవేశ పెట్టిన ప్రాంతీయ అనుసంధాన పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరడం అభినందనీ యమన్నారు.



దేశీయంగా రూ. 5 వేల కోట్ల విలువైన విమానయాన సేవలను అందించా లని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో కొత్తగా 50 విమానా శ్రయాల నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక శాఖ నిధులు సమకూర్చడానికి అంగీకరించిం దన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రాంతీయ విమానయాన అనుసంధానం దేశానికి చాలా అవసరమని, ప్రజలకు విమాన సేవలు చేరువ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంతోనే ఈ పథకంలో చేరామన్నారు. కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు సాంకేతికపరమైన అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి కేటీఆర్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అకాడమీని ఏర్పాటు చేయడానికి వీలుగా బేగంపేట ఎయిర్‌పోర్టులో ఉన్న నాలుగు హ్యాంగర్స్‌ను లీజుకు ఇవ్వాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.



ఆదిలాబాద్‌ సిమెంట్‌ ప్లాంట్‌ను తెరిపించండి

ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్లాంటును తెరిపించేందుకు కృషి చేయాలని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి‡ అనంత్‌ గీతేను మంత్రులు కేటీఆర్, జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యే బాపురావు కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్లాంటు మూతపడటం వల్ల కార్మికులు రోడ్డున పడ్డారని వివరించారు. ప్లాంటును పునరుద్ధరించి కార్మికులకు జీవనోపాధి కల్పించాలని కోరారు. అలాగే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిందని, ఫ్యాక్టరీకి నిధులు సమకూర్చేం దుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి వివరించారు.



మార్చిలో టెక్స్‌టైల్‌ సమ్మిట్‌

హైదరాబాద్‌ వేదికగా మార్చిలో నేషనల్‌ టెక్స్‌టైల్‌ సమ్మిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయిన కేటీఆర్‌ ఈ సదస్సు ఏర్పాటుపై చర్చించారు. దీనికి పూర్తి మద్దతు ఇవ్వడంతోపాటు సదస్సుకు హాజరవుతానని స్మృతి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబట్టడానికి పలు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించనున్నట్టు ఆయన తెలిపారు. వరంగల్‌లో నెలకొల్పనున్న టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరినట్టు ఆయన తెలిపారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటును రానున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశ పెట్టాల్సిందిగా ఆర్థిక శాఖకు ప్రతిపాదిం చాలని కేటీఆర్‌ కోరారు. చేనేత వస్త్రాలు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపును స్మృతి ఇరానీ మెచ్చుకున్నట్టు వివరించారు. నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్‌ లావాసాతోనూ భేటీ అయిన కేటీఆర్‌ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top