విలీన గ్రామాల్లో పన్నులు యథాతథం

Taxes continue to merge villages - Sakshi

మున్సిపాలిటీల్లో కలిపే గ్రామాలపై మంత్రి కేటీఆర్‌

రెండు, మూడేళ్లు కొనసాగేలా చర్యలు చేపడతాం

సీఎంతో చర్చించాక ప్రకటిస్తామని వెల్లడి

కొత్త చట్టంలో కొత్త రిజర్వేషన్ల అమలు: జూపల్లి

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపాలిటీల్లో విలీనమయ్యే గ్రామాల్లో పన్నులను ప్రస్తుతమున్న స్థాయిలో యథాతథంగా కొనసాగించే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. గురువారం శాసనమండలిలో మున్సిపాలిటీల చట్ట సవరణ, పంచాయతీ, ప్రైవేటు యూనివర్సిటీల బిల్లులపై చర్చించి ఆమోదించారు.

ఇందులో మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడం వల్ల ఉపాధి హామీ పని కోల్పోతామని, పన్నులు పెరుగుతాయని ప్రజ లు భావిస్తున్నారని టీఆర్‌ఎస్‌ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ సభ్యుడు రామచందర్‌రావు పేర్కొన్నారు.

దీనిపై మంత్రి కేటీఆర్‌ సమాధానమిస్తూ మున్సిపాలిటీల్లో గ్రామాలు విలీనమైతే పన్నులు పెరుగుతాయని..  రోడ్లు, పారిశుధ్యం వంటి సదుపాయాలు మెరుగుపడతాయి కాబట్టి దీనిని ప్రజలు సమ్మతిస్తారని పేర్కొన్నారు. ప్రజలు పన్నులు చెల్లించకపోతే అభివృద్ధి అసాధ్యమని చెప్పారు. ఇక ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాక, ఉట్నూరులను మున్సిపాలిటీలుగా చేయాలంటే రాష్ట్రప తి ఆమోదం అవసరమని, ఈ మేరకు గవర్నర్‌కు ప్రతిపాదన పంపిస్తున్నామని తెలిపారు.

అభివృద్ధి కోసమే..: ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసమే మున్సిపాలిటీల్లో గ్రామాలను విలీనం చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే ఆయా విలీన గ్రామాల్లో పట్టణీకరణ నెలకొందని, ప్రణాళిక లేకుండా విచ్చలవిడిగా నిర్మాణాలు సాగుతు న్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 36–38 శాతం పట్టణీకరణ జరిగితే.. తాజా నిర్ణయంతో అది 42–47 శాతానికి చేరిం దని చెప్పారు. కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో వికేంద్రీకరణ ప్రక్రియ సంపూర్ణమవుతున్నట్టేనని అభివర్ణించారు. భవిష్యత్తులో నగర పంచాయతీలనేవి ఉండబోవని, అన్నీ మున్సిపాలిటీలేనని చెప్పారు.

ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ను పరిశీలిస్తాం: కడియం
మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం మాట్లాడుతూ ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు కాదని, కానీ నిబంధనలను రూపొందించేప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

దీనిపై మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ జోక్యం చేసు కొంటూ ప్రైవేటు వర్సిటీల్లో స్థానికులకు 25 శా తం రిజర్వేషన్‌ కల్పిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు ఇస్తారా అని ప్రశ్నించారు. దీంతో ఈ అంశాన్ని పరిశీలిస్తామని కడియం చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ సభ్యుడు రామచంద్రరావు వాకౌట్‌ చేశారు. ఎంఐఎం సభ్యుడు ఎహసాన్‌ జాఫ్రీ ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.

శాసన మండలిలో అసెంబ్లీ స్పీకర్‌!
మండలి సమావేశం జరుగుతున్న సమయంలో శాసన సభ స్పీకర్‌ మధుసూదనాచారి అక్కడికి వచ్చారు. దాదాపు గంట సేపు వీఐపీ గ్యాలరీలో కూర్చొని సమావేశాల తీరును పరిశీలించారు.

కొత్త చట్టంతో కొత్త రిజర్వేషన్‌: జూపల్లి
కొత్త పంచాయతీ చట్టంతో కొత్త రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మండలిలో పంచాయతీల బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 4 వేలకు పైగా పంచాయతీలు ఏర్పాటవుతున్నట్టు తెలిపారు.

పంచాయతీలకు నిధుల కొరత లేకుండా చేస్తామని, ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంచాయతీల్లో కో–ఆప్షన్‌గా నియమించేవారిలో మహిళా సంఘాల అధ్యక్షులు ఒకరు, మరొకరు దాత ఉంటారని చెప్పారు. తండాలను పంచాయతీలుగా చేసిన సీఎం కేసీఆర్‌ తెలంగాణ మహాత్మాగాంధీ అని టీఆర్‌ఎస్‌ సభ్యుడు రాములునాయక్‌ అభివర్ణించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top