నింగీ నేలా కాంతులే!


సాక్షి, సిటీబ్యూరో: ఆనంద డోలికల్లో ఊగించే వెలుగుల పండుగ దీపావళిని పురస్కరించుకుని మహా నగరం వింతకాంతులీనడానికి ముస్తాబైంది. గతంతో పోలిస్తే ఈసారి కాస్త ఆలస్యంగానే సందడి మొదలైంది. కొన్ని ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా.. పండుగ సమీపించే సరికి సందడి ఒక్కసారిగా మొదలైంది. దీపావళి వేళ బాణసంచాదే ప్రత్యేకత. ఇందులో ఎన్నెన్నో వెరైటీలు..



అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి 30 శాతం మేర ధరలు పెరిగాయి. తమిళనాడులోని శివకాశిలో అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈసారి ఉత్పత్తి తగ్గడం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బాణసంచా ఉత్పత్తి క్షేత్రమైన శివకాశిలోనే 10 శాతం మేర ధరలు పెరగగా, ఇక్కడికి వచ్చాక మరో 20 శాతం లాభం వేసుకొని మొత్తంగా 30 శాతం మేర ధరల పెరుగుదలను వ్యాపారులు చూపిస్తున్నారు. ప్రస్తుతం నగర మార్కెట్లో రూ.10 మొదలుకొని రూ.12 వేల విలువైన వివిధ రకాల పేలుడు సామగ్రి అందుబాటులో ఉంది.

 

ఎక్కడికక్కడ విక్రయాలు



 నగరంలో బాణసంచా విక్రయ దుకాణాలు పలుచోట్ల వెలిశాయి. ఆర్టీసీ బస్‌భవన్ పక్కన ‘హాకా’ 12 స్టాళ్లను ఏర్పాటు చేయగా సనత్‌నగర్, జింఖానా గ్రౌండ్స్, మలక్‌పేట, ఉస్మాన్‌గంజ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో హోల్‌సేల్ వ్యాపారులు రెండ్రోజుల క్రితమే దుకాణాలను తెరిచారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా,  మూసాపేట తదితర ప్రాంతాల్లోనూ భారీ విక్రయశాలలు ఏర్పాటు చేశారు. నగరంలోని 50 మంది హోల్‌సేల్ ట్రేడర్స్ శివకాశి నుంచి నేరుగా సరుకు దిగుమతి చేసుకొని రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తుంటారు.



కనీసం 15 రోజుల ముందు నుంచే చిల్లర వ్యాపారులు కొనుగోళ్లు జరపడం పరిపాటి. గత ఏడాది హైదరాబాద్‌లో రూ.70-80 కోట్ల మేర క్రాకర్స్ వ్యాపారం జరిగింది. ఈ ఏడాది రూ.100 కోట్లకుపైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, విక్రయాలు ప్రారంభం కాాకముందే సనత్‌నగర్ క్రాకర్స్ అసోసియేషన్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. వ్యాపారులు ఇప్పటికే రూ.65-70 కోట్ల విలువైన బాణసంచాను నగరానికి తెప్పించారు. కాగా శుక్రవారం నగరంలో తారస్థాయిలో బాణసంచా విక్రయాలు జరిగాయి.



రూ.120 కోట్ల మేర వ్యాపారం!



 ఈ ఏడాది దీపావళి వేడుకల్లో కొత్త కాంతులు ఆవిష్కరించేందుకు విభిన్నమై వెరైటీస్‌ను మార్కెట్లో పరిచయం చేస్తున్నట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి ప్రత్యేక ఉత్పత్తులుగా 20 రకాల ర్యాకెట్లు, చిచ్చుబుడ్లు ఇతర పేలుడు పదార్థాలు మార్కెట్లోకి వచ్చాయని సనత్‌నగర్ క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అయితే, గత ఏడాదితో పోలిస్తే ధరలు మాత్రం 30 శాతం మేర ధరలు పెరిగాయని వివరించారు. ఈ ఏడాది నగరంలో రూ.120 కోట్లకుపైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఆర్టీసీ బస్‌భవన్ పక్కన ‘హాకా’ స్టాల్స్‌లో దుకాణాలు ఏర్పాటు చేసిన వ్యాపారులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది రూ.100 కోట్ల వరకు వ్యాపారం జరిగిందని, ఈసారి దాన్ని అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

 

 ఈ ఏడాది కొత్త వెరైటీలు ఇవే..

 ప్రస్తుతం నగర మార్కెట్లో రూ.10 మొదలుకొని రూ.12 వేల వరకు విలువైన వెరైటీలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రధానంగా గోల్డెన్ విజిల్, కార్గిల్ బుల్లెట్, గోల్డెన్ డ్రాప్స్, గోల్డ్ రష్, రెయిన్‌బో, జాక్‌పాట్,  చెన్నై బ్యూటీ, కేరళ బ్యూటీ, ముంబయ్ బ్యూటీ, బుల్లెట్ రెయిన్, సిం గింగ్ బర్డ్స్, హో... లా ల్లా, గ్రీన్‌పార్క్, పనోరమా, స్నాజీ జిమ్నా, యమ్నీ.. యమ్నీ, జాగ్ బజర్, రా పవర్, నయగరా ఫాల్స్, ఆడి, బెంజ్, బీఎం డబ్ల్యూ, స్కోడా, కిక్ షాట్స్, హాట్ గర్ల్,  హాట్ మిర్చి, సిటీ నైట్,  2000 బగ్స్, 100 షాట్స్, ప్యారడైజ్-250 షాట్స్, పీఎస్‌ఎల్‌లీ.. ఇలా వివిధ పేర్లతో రాకెట్లు, చిచ్చుబుడ్లు, ఇతర పేలుడు పదార్థాలు, భూచక్రాలు, కాకరవత్తులు అందుబాటులో ఉన్నాయి.   

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top