ఇళ్లు కడుతున్నాం.. పెళ్లిళ్లు చేయిస్తున్నాం..

slum free hyderabad : ktr - Sakshi

పేదల జీవిత లక్ష్యాలను నెరవేరుస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

స్లమ్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను మార్చడమే లక్ష్యం

ఏడాదిలో నగరంలో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం

కంటోన్మెంట్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు శంకుస్థాపన

పాల్గొన్న డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, తలసాని

హైదరాబాద్‌: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’అనే నానుడి ప్రతి సామాన్యుడి జీవిత లక్ష్యాలను సూచిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు లక్ష్యాలను నెరవేరుస్తూ పేదల పక్షాన నిలుస్తోందని మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శనివారం కంటోన్మెంట్‌ నియోజకవర్గంలోని గాంధీనగర్‌–శ్రీరామ్‌నగర్, పాతమారేడ్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్థానిక ఎమ్మెల్యే సాయన్న, ఎంపీ మల్లారెడ్డితో కలసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.  

ఒక్క రూపాయి భారం మోపకుండా..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వాలేవీ చేయలేని రీతిలో లబ్ధిదారులపై ఒక్క రూపాయి భారం మోపకుండా రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.70 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు లక్ష్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే అధిక మొత్తం నిధులను పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తున్నామని చెప్పారు.

మన రాష్ట్రంలో రూ.18 వేల కోట్ల నిధులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నామన్నారు. నగరంలో 1,491 నోటి ఫైడ్‌ స్లమ్స్‌తో పాటు మరో 500 నాన్‌ నోటిఫైడ్‌ స్లమ్స్‌ రూపురేఖలు మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రేటర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఇప్పటికే 87 వేల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైందని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం, కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ పథకాల అమలులో ఎలాంటి రాజీలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరంలో లక్ష మందికి పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

కంటోన్మెంట్‌లో ఏఎఫ్‌ఎంసీకి కృషి
కంటోన్మెంట్‌ ప్రాంతంలోని రామన్న కుంట ప్రక్షాళనకు రూ.2.5 కోట్లు మంజూరు చేశామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. కంటోన్మెంట్‌ పరిధిలోని పరేడ్‌గ్రౌండ్‌–బొల్లారం, ప్యారడైజ్‌–సుచిత్ర వరకు నిర్మించనున్న స్కైవేల కోసం స్థలమివ్వాల్సిందిగా ఇటీవలే రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి విజ్ఞప్తి చేయగా, ఆమె సానుకూలంగా స్పందించారని చెప్పారు.

కంటోన్మెంట్‌ ప్రాంతంలోని రక్షణ స్థలాల్లో కొనసాగుతున్న బస్తీలకు బదులుగా ప్రత్యామ్నాయ స్థలాల్ని ఇచ్చి, పేదలకు పట్టాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కంటోన్మెంట్‌లో పుణేలో మాదిరిగా ఏఎఫ్‌ఎంసీ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, సికింద్రాబాద్‌ ఆర్డీవో చంద్రకళ, కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top