పేదల ‘బువ్వ’కు ఎసరు

పేదల ‘బువ్వ’కు ఎసరు

పక్కదారి పడుతున్న రేషన్‌ బియ్యం 

- 3.02 కోట్ల నుంచి 2.75 కోట్లకు రేషన్‌ లబ్ధిదారుల తగ్గింపు

 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత జనాభా సరాసరి 4 కోట్ల మంది. రాష్ట్రం ఏర్పడ్డాక రేషన్‌ లబ్ధిదారులు ఏకంగా 3.02 కోట్లు. ఇంత మొత్తంలో కార్డులు ఉన్నాయంటే వీరంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారన్న మాట. కొందరు రేషన్‌ డీలర్లు, మిల్లర్లు, అధికారులు, కొందరు నేతల వల్లే ఇంత పెద్ద సంఖ్యలో రేషన్‌ లబ్ధిదారుల సంఖ్య ఉందన్న విమర్శలున్నాయి. తద్వారా బియ్యం సరఫరా పేరుతో అక్రమ ఆదాయా న్ని పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారుల చర్యలతో వీటిని 2.75 కోట్లకు తగ్గించారు. అయితే ఇందులో కూడా ఇంకా దాదాపు 75 లక్షల మంది బోగస్‌ లబ్ధిదారులే ఉంటారని చెబుతున్నారు. వీరిని తొలగించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందన్న ఉద్దేశంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయమూ ఉంది.

 

ప్రభుత్వ ఖర్చు ఇదీ..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17,200 రేషన్‌ దుకాణాల ద్వా రా ప్రతి నెలా 1.75 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రజా పంపిణీ విధానం ద్వారా పేదలకు ప్రభుత్వం అందిస్తోంది. 85 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ఏటా ఏకంగా 2,200 కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. అనర్హులైన లబ్ధిదారుల పేరు ప్రతినెలా రూ.4.5 కోట్ల విలువైన బియ్యం ప్రభుత్వ గోదాముల నుంచి బహిరంగ మార్కెట్‌కు వెళుతున్నాయి. ఏటా ఈ మొత్తం ఏకంగా 50 కోట్ల దాకా ఉంది. ప్రతినెలా కనీసం 45 వేల టన్నుల బియ్యం రేషన్‌ మాఫియా చేతుల్లో పడుతోందని అంచనా. 

 

పక్కదారి పట్టేదిలా!

రేషన్‌ బియ్యం లబ్ధిదారులే కిలో బియ్యాన్ని రూ.10 నుంచి రూ.12కు విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని వ్యాన్లు, లారీల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. ఇటీవల రైల్వే ద్వారా మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు తరలి స్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. పేదలకు దక్కాల్సిన రేషన్‌ బియ్యం వారి నోటికి అందకుండానే సరిహద్దులు దాటుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు

► రేషన్‌ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న వ్యాపారులపై తొలిసారిగా పీడీ యాక్టు కింద  కేసులు నమోదు చేశారు.

► ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని పటిష్టం చేశారు. రిటైర్డ్‌ ఎస్పీల నేతృత్వంలో 24 మంది సిబ్బందితో 5 బృందాల ఏర్పాటు

► బియ్యం రవాణా చేసే 1,300 వాహనాలకు జీపీఎస్‌ పరికరాలు అమర్చడం

► జీహెచ్‌ఎంసీ పరిధిలోని 1,525 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు

► అక్రమ కార్డుల వినియోగాన్ని తగ్గించడం కోసం ఇప్పటి దాకా 6వేల రేషన్‌ దుకాణాల్లో ఈృపాస్‌ యంత్రాలను అమర్చారు. 

► మొత్తం లావాదేవీలన్నీ కంప్యూటరీకరించడం, ఈ అంశాలన్నింటినీ పర్యవేక్షించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

 

సాంకేతికతతోనే అక్రమాలకు చెక్‌

‘పౌర సరఫరాల శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా అక్రమాలకు చెక్‌ పెడుతున్నాం. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు, పీడీ యాక్టు కింద కేసులు తదితర చర్యల వల్ల కాకినాడ పోర్టుకు సరుకు వెళ్లడం ఆగిపోయింది. ఈృపాస్‌ యంత్రాలను ఇప్పటికే 6 వేల రేషన్‌ దుకాణాల్లో అమర్చాం. వచ్చే నెలాఖరుకు 10 వేల దుకాణాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. అక్రమాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టడం ద్వారా ఇప్పటికే శాఖకు రూ.1,100 కోట్లు ఆదా చేయగలిగాం’

- సీవీ ఆనంద్, పౌర సరఫరాల కమిషనర్‌
Back to Top