'రాష్ట్రం సీఎం జాగీరు కాదు'

'రాష్ట్రం సీఎం జాగీరు కాదు' - Sakshi


-ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చుచేస్తారా?

- జలవిధానం ప్రజా ఉపయోగంగా ఉండాలి




సాక్షి, హైదరాబాద్: ఎవరు అరిచి గీపెట్టినా ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తామనడానికి రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ జాగీరు కాదని, ప్రజాస్వామ్యంలో నియంతలాగా వ్యవహరించడం తగదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాలు, ఇష్టాయిష్టాలకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తామంటే కుదరదన్నారు. ఇది రాజరిక వ్యవస్థ, జమీందారీ కాలం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని సీఎం కేసీఆర్ మర్చిపోయి, నియంతలాగా మాట్లాడటం కాదన్నారు. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉందన్నారు. పథకాల్లో, ప్రాజెక్టుల్లో మార్పులు చేయాలనుకుంటే ప్రతిపక్షాలని కలుపుకుని పోయి నిర్ణయాలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. 32 ప్రాజెక్టులకు 40 వేలకోట్లు ఖర్చు పెట్టిన తర్వాత రీడిజైన్ అంటే ప్రజాధనం వృథా అవుతుందన్నారు.



సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, పద్మారావు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ తుగ్లక్ పాలనను రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువుతో రైతులు అన్నమో రామచంద్రా అంటున్నా పరామర్శించిన పాపాన పోవడం లేదని విమర్శించారు. వ్యవసాయాన్ని, రైతాంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శించారు. కుంటిసాకులు చూపిస్తూ ప్రాజెక్టుల డిజైన్ల మార్పు, కొన్ని ప్రాజెక్టులను కట్టకుండా తప్పించుకునే కుట్ర కనిపిస్తున్నదన్నారు. తోటపల్లి రిజర్వాయరును ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల డిజైన్లు మార్చాలనుకుంటే ప్రతిపక్షాలను, నిపుణులను ఒప్పించాలని పొన్నం సూచించారు. జలవిధానం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరారు. లేకుంటే ప్రజల ప్రయోజనంకోసం ఎన్ని పోరాటాలకైనా సిద్దంగా ఉన్నామని పొన్నం హెచ్చరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top