'ఆర్కే బీచ్‌లోని పరిస్థితులు చూస్తే బాధేస్తోంది'

'ఆర్కే బీచ్‌లోని పరిస్థితులు చూస్తే బాధేస్తోంది'


ఆంధ్రప్రదేశ్ లో మాటలకు చేతలకు పొంతన లేదు'

గడిచిన 20 నెలల్లో ఏ రంగంలోనూ ఆశించిన ప్రగతి కనిపించట్లేదు

అమాత్యుల తీరుతో సర్కారీ విద్యకు ముప్పు ఏర్పడింది

రైతులకు సరిపోను విద్యుత్ లేదు.. మద్దతు ధర అసలే లేదు

విశాఖ సదస్సులో జరిగిన ఎంవోయూలన్నీ అమలయ్యే పరిస్థితి లేదు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో సీఎంఎస్ చైర్మన్ ఎన్.భాస్కరరావు


 

సాక్షి, హైదరాబాద్: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవ పరిస్థితులకు.. ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి పొంతన కుదరట్లేదు. రాష్ట్రంలో కొత్తప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా ఏ రంగంలోనూ ఆశించిన ప్రగతి కనిపించట్లేదు. వారి పంథా ఇలానే కొనసాగితే మున్ముందు అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం లేకుండా పోతోంది’’ అని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(సీఎంఎస్) చైర్మన్ ఎన్.భాస్కరరావు వ్యాఖ్యానించారు. ఏపీలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇటీవల సీఎంఎస్ పలు జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని సమీక్షించిన నేపథ్యంలో ఆయన తమ అనుభవాల్ని ‘సాక్షి’తో ఆదివారం పంచుకున్నారు.



ఏపీలో మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, అక్కడి రైతులకు సరఫరాను తొమ్మిది గంటలకు బదులు ఏడుగంటలే ఇస్తోందని, దీంతో విద్యుత్ ఆధారంగా వ్యవసాయం చేస్తున్న రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు. కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇప్పించటంలోనూ ప్రభుత్వం విఫలమైందంటూ.. కృష్ణా, చిత్తూరు జిల్లాల పర్యటనలో ఈ విషయం తమ దృష్టికొచ్చిందని తెలిపారు. వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలివీ...

 

సర్కారీ విద్యకు ముప్పు..

ఏపీలో సర్కారీ విద్యకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. మంత్రులే ప్రైవేటు విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన లేకుండా పోయింది. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీని మరిచిపోయారు.



ఇక ‘స్వచ్ఛ భారత్’ పేరుతో భారీగా కార్యక్రమాలు చేస్తూ.. ప్రచార పటాటోపం చేస్తున్నప్పటికి వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. విశాఖ అనగానే అందరికీ గుర్తొచ్చే రామకృష్ణ బీచ్‌లోనే పరిస్థితులు చూస్తే బాధేస్తోంది. అక్కడ కిలోమీటరున్నర దూరంలో రెండు టాయ్‌లెట్స్ మాత్రమే ఉన్నాయి. కనీసం తాగునీరు అందుబాటులో లేదు. చెత్తకుండీలు సైతం లేవు.

 

కాంట్రాక్టర్ల పర్వం నడుస్తోంది..

ప్రపంచంలోనే తొలి డిజిటల్ క్యాపిటల్‌ను నిర్మాణం చేసే అవకాశం చంద్రబాబుకు లభించింది. అయినప్పటికీ ఆయన ఆసక్తి చూపలేదు. ప్రతి ఇంటికీ హైబ్రాండ్ కనెక్టివిటీ ఉంటే సిటీజనులకు పారదర్శక పాలన అందేందుకు ఆస్కారముండేది. రాష్ట్రంలో ఏ పనులు చూసుకున్నా కాంట్రాక్టర్ల పర్వమే నడుస్తోంది.

 

ఆ ఎంవోయూలన్నీ అమలయ్యే పరిస్థితి లేదు..

ఇటీవల విశాఖలో ఘనంగా నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో భారీఎత్తున పెట్టుబడులొస్తాయని ప్రకటించినా.. వాటిలో అమలయ్యేది చాలాతక్కువ. అసాధ్యమైన ఒప్పందాలన్నీ చేసుకోవడంతో ప్రసార సాధనాల్లో విస్తృత ప్రచారం వచ్చింది. ఇలా చేయడంవల్ల కృత్రిమ ప్రగతి కనిపిస్తుంది తప్పితే, వాస్తవ ప్రగతి జరగదు. ఏపీలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ రంగాల ప్రముఖులతో కూడిన మా జాతీయస్థాయి ప్యానల్ ప్రజల వద్దకెళ్లి తెలుసుకుంటుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top