గత పాలకులే చెరువుల్ని మింగేశారు

గత పాలకులే చెరువుల్ని మింగేశారు

నిజాంపేటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

 

హైదరాబాద్‌: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చెరువులు కనుమరుగయ్యా యని, చెరువులు, శిఖం భూములను కబ్జా చేసి లేఅవుట్‌లు, అపార్టుమెంట్లను నిర్మించారని, దీంతో వర్షం పడ్డ ప్రతిసారి అపార్టుమెంట్‌లు జలమయం అవుతున్నాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. నిజాంపేట భండారి లేఅవుట్‌లోని రూ. 30.5 లక్షలతో తుర్క చెరువు అభివృద్ధి పనులకు సహచర మంత్రి మహేందర్‌రెడ్డితో కలసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తుర్క చెరువు నుంచి పాపయ్యకుంట వరకు 60 నుంచి 70 క్యూసెక్కుల నీళ్లు వెళ్లే విధంగా ఓపెన్‌ నాలాను నిర్మించాలని, ఇందు కోసం రూ. 28 లక్షలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.పాపయ్యకుంట నుంచి అంబీర్‌ చెరువు మధ్యలో రెండు అపార్టుమెంట్లు వెలిశాయని, పలు ప్రహరీ నిర్మించారని ఇంజనీర్‌ ప్రసాద్‌ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆర్డీఓ, ఇరిగేషన్, గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం షాపూర్‌నగర్‌ రైతు బజారులో రూ. 36 లక్షలతో నిర్మించనున్న షెడ్ల పనులను మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డిలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే వివేకానంద్, ఎంపీపీ సన్న కవిత, జడ్పీ వైస్‌ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ శెనిగల ప్రమీల, కొలన్‌ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, జగన్‌ తదితరులు ఉన్నారు.  
Back to Top