ప్రైవేటు’లోనూ కేసీఆర్‌ కిట్‌!

key change in the KCR kit  scheme - Sakshi

ప్రైవేటు వైద్య కాలేజీల ఆస్పత్రుల్లోనూ  

పథకం అమలుకు సర్కారు యోచన

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకంలో కీలక మార్పులకు వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టనుంది. ప్రైవేటు వైద్య కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆస్పత్రుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వైద్య విద్యార్థులకు కాన్పు చికిత్సలపై పూర్తిస్థాయిలో అవగాహన, పరిపూర్ణత కల్పించడం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టనుంది. ప్రైవేటు వైద్య కాలేజీల్లోనూ సహజ కాన్పులకే ప్రాధాన్యత ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు ప్రభుత్వ ఆమోదం అనంతరం అన్ని ప్రైవేటు వైద్య కాలేజీల్లోనూ పథకం అమలు కానుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 22 వైద్య కాలేజీలు ఉండగా వాటిలో ఆరు ప్రభుత్వ, ఒకటి ఈఎస్‌ఐ, మూడు ప్రైవేటు మైనారిటీ, 12 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కలిపి 3,200 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఆరు ప్రభుత్వ కాలేజీల్లో కలిపి వెయ్యి ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా మిగిలిన సీట్లన్నీ ప్రైవేటు కాలేజీలవే. ఎక్కువ మంది ప్రైవేటు కాలేజీల్లోనే వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ వైద్య కాలేజీల ఆస్పతుల్లో కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని అమలు చేస్తుండటంతో ఈ కాలేజీల్లోని విద్యార్థులకు కాన్పు చికిత్సలు, శస్త్ర చికిత్సలపై అవగాహన ఉంటోంది. మరోవైపు ఈ పథకం అమల్లో ప్రైవేటు వైద్య కాలేజీల ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య బాగా తగ్గింది.

ఇది వైద్య విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతోంది. భవిష్యత్తులో వైద్య సేవలపై ఇది ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యశాఖ భావిస్తోంది. వైద్య విద్యార్థులకు అన్ని రకాల వైద్య సేవలు, శస్త్ర చికిత్సలపై పూర్తి అవగాహన అవసరమనే ఉద్దేశంతో కేసీఆర్‌ కిట్‌లను ప్రైవేటు వైద్య కాలేజీలకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, ఇతర పరికరాలు కలిపి సహజ కాన్పు అయితే రూ. 2 వేలు, సిజేరియన్‌ అయితే రూ. 5 వేల ఖర్చవుతోంది. ప్రైవేటు వైద్య కాలేజీల ఆస్పత్రుల్లో కేసీఆర్‌ కిట్లకు అనుమతిస్తే సిజేరియన్లను నియంత్రించొచ్చని ప్రదిపాదనల్లో పేర్కొన్నారు. ప్రైవేటు వైద్య విద్య కాలేజీల్లో జరిగే ప్రతి కాన్పుకు రూ.3 వేల చొప్పున చెల్లించాలని ప్రతిపాదించారు.

కేసీఆర్‌ కిట్‌ పథకం అమల్లోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు...
జూన్‌            22,074
జూలై            26,698
ఆగస్ట్‌            26,837
సెప్టెంబర్‌       26,838
అక్టోబర్‌         27,426
నవంబర్‌        26,841
డిసెంబర్‌        27,107
మొత్తం       1,83,821

ప్రభుత్వ ఆస్పత్రులపై తగ్గనున్న ఒత్తిడి
కేసీఆర్‌ కిట్‌ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి రూ. 12 వేలు, అదే కాన్పులో ఆడపిల్ల పుడితే రూ. 13 వేల చొప్పున సర్కారు చెల్లిస్తోంది. నాలుగు దశలుగా ఈ సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు జరిగిన వెంటనే శిశువు సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కిట్‌ను అందిస్తున్నారు.

రాష్ట్రంలో ఏటా 6.50 లక్షల కాన్పులు జరుగుతుండగా కేసీఆర్‌ కిట్‌ పథకం అమలుకు ముందు ఏడాదిలో కేవలం 2 లక్షల కాన్పులే ప్రభుత్వాస్పత్రుల్లో జరిగేవి. తాజాగా ఈ పరిస్థితి మారింది. 2017 జూన్‌ 2న ప్రారంభమైన కేసీఆర్‌ కిట్‌ పథకంతో ఏడు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 1.83 లక్షల కాన్పులు ప్రభుత్వాస్పత్రుల్లో జరిగాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఏటా దాదాపు 4.50 లక్షల కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెరుగుతుండటం వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. వైద్య పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైనా మరో ఏడాది వరకు పూర్తిస్థాయిలో సిబ్బంది అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు బోధన ఆస్పత్రుల్లోనూ కేసీఆర్‌ కిట్‌ పథకం అమలును వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top