ఉప ఎన్నికలు నిర్వహిస్తే సత్తా చూపుతాం: లక్ష్మణ్‌

ఉప ఎన్నికలు నిర్వహిస్తే సత్తా చూపుతాం: లక్ష్మణ్‌


సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీ సత్తా చూపుతుందని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చెప్పారు. ఉపఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో రాజకీయ పరిణామాల సరళి, బీజేపీ అనుకూల పవనాలు స్పష్టంగా బయటపడతాయన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 22, 23,24 తేదీల్లో నల్లగొండ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.


గతంలో ఉపఎన్నికలు, బహిరంగసభలంటూ హడావుడి చేసిన కేసీఆర్‌ ఇప్పుడెందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ప్రధాని మోదీ ప్రభంజనంతో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఆరునెలలకు ముందే అభ్యర్థులను, మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లకు వచ్చి బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ ముఖ్యనాయకులు కాళ్లపై పడుతున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు నిరాధార ఆరోపణలన్నారు.

Back to Top