ఆధార్‌లో అక్రమాలకు కళ్లెం!

Irregularities in Aadhaar enrollment - Sakshi

కార్డుల జారీ, నమోదులో ప్రైవేటు పెత్తనానికి అడ్డుకట్ట

సీఎస్‌సీ సేవలకు మంగళం పాడిన కేంద్ర ప్రభుత్వం

అగ్రిమెంట్‌ పునరుద్ధరణకు నిరాకరణ

ఆధార్‌ నమోదు, కార్డుల జారీలో అక్రమాల నేపథ్యంలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఆధార్‌.. దేశంలోని ప్రతి పౌరునికీ భారత ప్రభుత్వం ఇస్తున్న విశిష్ట గుర్తింపు సంఖ్య. ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియలో ఇప్పటివరకూ కీలకంగా వ్యవహరిస్తున్న సీఎస్‌సీ–ఈగవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ సేవలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. క్షేత్రస్థాయిలో పౌరుల నుంచి ఆధార్‌ నమోదు, వివరాల్లో మార్పుచేర్పులు తదితర బాధ్యతల్ని సీఎస్‌సీ నిర్వహిస్తూ వచ్చింది.

అయితే వివరాల నమోదు, మార్పుచేర్పులు చేసే క్రమంలో సీఎస్‌సీ నిర్వాహకులు భారీగా అక్రమాలకు పాల్పడుతుండటం, ఆధార్‌ నిబంధనలకు విరుద్ధంగా వివరాల నమోదు ప్రక్రియను చేపడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మూడు రోజుల క్రితం కమ్యునికేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆధార్‌ నమోదు కేంద్రాలుగా కొనసాగుతున్న దాదాపు 600లకుపైగా కేంద్రాల్లో సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. వాస్తవానికి విడతలవారీగా ఈ కేంద్రాల్లో సేవలు నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినప్పటికీ అన్ని కేంద్రాల్లో ఒకేసారి సేవలు నిలిచిపోయాయి.

కొన్ని కేంద్రాల్లో అక్రమాలు..
ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియలో వివరాల నమోదే కీలకం. ఈ బాధ్యతలు అక్కడక్కడా ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నప్పటికీ సరిపడా మానవ వనరులు లేక ప్రైవేటు సంస్థను కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం చేసింది. ఈ క్రమంలో సీఎస్‌సీ–ఈగవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సదరు సంస్థ మండల కేంద్రాలు, టౌన్‌లు, మేజర్‌ గ్రామ పంచాయతీల పరిధిలో సీఎస్‌సీ(కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌) పేరిట కేంద్రాలను తెరిచింది.

కొన్నిచోట్ల మీసేవా నిర్వాహకులకే ఈ బాధ్యతల్ని అప్పగించింది. అంతేకాకుండా ఆధార్‌ కిట్లు సైతం పంపిణీ చేయడంతో పౌరులకు కార్డుల జారీ సులభతరమైంది. ఈ నేపథ్యంలో కొన్ని కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు తెరలేపారు. వివరాల నమోదుకు భారీ మొత్తాన్ని వసూలు చేయడంతో పాటు సవరణల కోసం వచ్చే వారి నుంచి సైతం అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డారు. మరికొన్ని చోట్ల ఏకంగా తప్పుడు వివరాలను సమర్పించి యంత్రాంగాన్నే తప్పుదోవ పట్టించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

‘మీసేవ’లు ఉన్నప్పటికీ..
ఆధార్‌ కార్డుకు సంబంధించి వివరాల నమోదు, మార్పుచేర్పుల కోసం సమాచార సాంకేతిక శాఖ మండల స్థాయిలో కేంద్రాలకు అనుమతిచ్చింది. ఎంపిక చేసిన మీసేవ కేంద్రాల్లో ఈ సౌకర్యం ఉంది. కానీ ఆయా కేంద్రాల్లో ఉన్న సాంకేతిక పరికరాలు పాతవి కావడంతో.. చాలాచోట్ల నమోదు ప్రక్రియ నెమ్మదించింది. సీఎస్‌సీ కేంద్రాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు పరికరాల పంపిణీ, హార్డ్‌వేర్‌ వసతులు మెరుగ్గా ఉండటంతో అక్కడ నమోదు అధికంగా ఉండేది.

సీఎస్‌సీ కేంద్రాల్లో నమోదు నిలిచిపోవడంతో తిరిగి మీసేవ కేంద్రాల్లో సంప్రదించాల్సి వస్తోంది. కొత్తగా ఆధార్‌ కార్డులు పొందే వారితో పాటు ఇప్పటికే కార్డులున్న పౌరులు ప్రతి ఐదేళ్లకోసారి వారి వేలిముద్రలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆధార్‌ నమోదు, మార్పుచేర్పులనేది నిరంతర ప్రక్రియ. ఆధార్‌ కేంద్రాలకు జనాల తాకిడి ఎప్పుడూ ఉండేదే. కానీ ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆధార్‌ సౌకర్యం ఉన్న మీసేవ కేంద్రాలకు తాకిడి పెరుగుతోంది. అయితే అక్కడ వసతులు లేకపోవడంతో పౌరులు ఇబ్బందులు పడుతున్నారు.

యథేచ్ఛగా వసూళ్ల దందా..
కొన్ని కేంద్రాల నిర్వాహకులు ఒక్కో వ్యక్తి నుంచి ఆధార్‌ నమోదుకు గరిష్టంగా రూ.2 వేల వరకు వసూలు చేశారు. వివరాల మార్పునకు రూ.వెయ్యి చొప్పున డిమాండ్‌ చేశారు. మొత్తంగా ఈ వ్యవహారాన్ని వసూళ్ల దందాగా మార్చేశారు. ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులు పరిస్థితిని గమనించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ క్రమంలో ప్రైవేటు వ్యక్తుల ఆగడాలను కట్టడి చేయాలని భావించిన ప్రభుత్వం సీఎస్‌సీ సేవలకు మంగళం పాడింది. ఆగమేఘాల మీద తీసుకున్న ఈ నిర్ణయంతో అక్రమాలకు అడ్డుకట్ట పడినప్పటికీ పౌరులకు వెతలు మొదలవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఆధార్‌ కేంద్రాలుగా ఉండటంతో అక్కడికి వెళ్లిన పౌరులకు చుక్కెదురవుతోంది. కొత్త కేంద్రాల చిరునామా కోసం సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top