వృద్ధుడి హత్య కేసులో ముమ్మర దర్యాప్తు


బంజారాహిల్స్, న్యూస్‌లైన్: సంచలనం సృష్టించిన మాసం వ్యాపారి ఈశ్వర్ హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఆదివారం ఉదయం ఈశ్వర్ స్కూటీపై చింతల్‌బస్తీలోని మటన్ షాప్‌కు వెళ్తుండగా అగంతకులు దారికాచి కత్తులతో దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు కారణాలపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డునెం.13లో పట్టపగలు ఈ హత్య జరగడంతో నగర పోలీస్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. తమ తండ్రిని కొందరు రౌడీలు హతమార్చి ఉంటారని కొడుకులు, కూతుళ్లు ఆరోపించిన నేపథ్యంలో స్థానికంగా రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లుగా నమోదై ఉన్నవారిని సోమవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. 

 

జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో రౌడీషీటర్లు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, కె.లక్ష్మణ్, అర్జున్‌యాదవ్, దుర్గాప్రసాద్, వి.రమేష్‌యాదవ్ తదితరులతో పాటు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 42 మంది రౌడీషీటర్లను పిలిపించి పెరేడ్ నిర్వహించారు. వారు ఎక్కడ ఉంటున్నారు?  ఏం చేస్తున్నారు అనే అంశాలపై ఆరా తీశారు. ఇదిలాఉండగా, మృతుడి సెల్‌ఫోన్ కాల్‌డేటాతో పాటు బంజారాహిల్స్ రోడ్డునెం.1/12 చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని  పరిశీలించారు. ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య చౌరస్తా నుంచి వెళ్లిన వాహనాల నెంబర్లతో జాబితాను తయారు చేసి, ఆ వాహనాల అడ్రస్‌లను పరిశీలిస్తున్నారు. హతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

 

ఇప్పటికే నలుగురు అనుమానితులను ప్రశ్నించారు.  ఆదివారం ఉదయాన్నే హతుడి ఈశ్వర్‌కు ఫోన్ చేసిన సురేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతుడు చీటీల వ్యాపారం కూడా నిర్వహిస్తాడని తెలియడంతో ఆ దిశలో కేసు దర్యాప్తుచేస్తున్నారు. కుటుంబ నేపథ్యం, స్థల వివాదం, ఫైనాన్స్ గొడవల కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఈ కేసు మిస్టరీ ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.

 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top