పుట్టినరోజునే దొరికిన ఆచూకీ!

పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యం - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: స్కూలుకని వెళ్లిన కూతురు నలభై రోజులైనా తిరిగి రాలేదు. కనిపించిన వారందరినీ కుమార్తె ఆచూకీ గురించి అడుగుతూ, పోలీసులను వేడుకొంటూ... ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. జూన్‌ 7న అదృశ్యమైన పదో తరగతి విద్యార్థిని పూర్ణిమాసాయి తల్లిదండ్రుల పరిస్థితి ఇది. ఆదివారం పూర్ణిమ పుట్టినరోజు కూడా కావడంతో పదే పదే గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అదే సమయంలో ముంబైలోని బోయివాడ పోలీసుల నుంచి వారికో ఫోన్‌ కాల్‌... ‘మీ అమ్మాయి పూర్ణిమ మా వద్ద ఉంది’ అని. ఆ తీపి కబురుతో ఒక్కసారిగా వారి మోములు పట్టరాని ఆనందంతో వికసించాయి.



బాలిక ఆచూకీ లభించిందిలా...

కూకట్‌పల్లి నిజాంపేటకు చెందిన నాగరాజు, విజయకుమారిల కుమార్తె పూర్ణిమాసాయి నిజాంపేటలోని భాష్యం స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. గత నెల 7న ఇంట్లో రూ.వెయ్యి  తీసుకుని స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి, సికింద్రాబా ద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ముంబై ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి బయలుదేరింది. మరుసటి రోజు ముంబై లోని దాదర్‌ రైల్వే స్టేషన్‌లో దిగింది.



ఎక్కడకు వెళ్లాలో తెలియక, చివరకు సమీపంలోని బోయివాడ పోలీసు స్టేషన్‌కు వచ్చింది. వారికి తన పేరు అనికశ్రీ అని, తల్లిదండ్రులు లేని అనాథనని, సికింద్రాబాద్‌లోని తుకారంగేట్‌ సాయిశ్రీ ఆశ్రమం నుంచి వచ్చానంటూ తెలిపింది. దీంతో బాలికను వారు బాలసుధార్‌ గృహ్‌కు తరలించారు. అప్పటికే సైబరాబాద్‌ పోలీసులు పంపిన ఫొటోలు బోయివాడ పోలీసుల వద్ద ఉన్నాయి. దీంతో వారు ఈ అమ్మాయిపై సందేహం వచ్చి, తుకారాం గేట్‌ పోలీసులకు తెలిపారు. వారు బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, పూర్ణిమ తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి వాకబు చేశారు. బోయివాడ పోలీసులు పంపిన ఫొటో తమ కుమార్తెదేనని వారు గుర్తించారు.



ముంబైకి ప్రత్యేక బృందం...

పూర్ణిమను తెచ్చేందుకు పోలీసుల బృందం, ఆమె తల్లిదండ్రులు ముంబై బయలుదేరారు. సోమవా రం బాలిక నగరానికి వస్తుందని పోలీసులు తెలిపారు. అయితే సినీ రంగంలో రాణించాలనే ఆసక్తి ఉన్న పూర్ణిమ... ఓ ప్రముఖ చానల్‌లో ప్రసారమయ్యే ఓ సీరియల్‌కు చెందిన వారితో ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా రాత్రివేళల్లో సంభాషిస్తుండేది. ఇదే క్రమంలోనే ఆమె ఇంట్లో నుంచి వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top