అయిననూ పోయి రావలె..

Huge public are going to there home towns - Sakshi

     భారీ రద్దీ మధ్య సొంతూళ్లకు సిటీజనులు 

     సంక్రాంతికి తరలిన 20 లక్షల మంది  

సాక్షి, హైదరాబాద్‌: మహానగరం పల్లెకు తరలింది. సంక్రాంతి సందర్భంగా సిటీజనులు సొంత ఊళ్లకు తరలివెళ్లారు. శనివారం కూడా నగరంలోని ప్రధాన బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. నగర శివార్ల నుంచి సైతంజనం భారీ సంఖ్యలో తరలివెళ్లారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరిన రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. సికింద్రాబాద్‌ నుంచి ప్రతి రోజు రాకపోకలు సాగించే 80 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 100 ప్యాసింజర్‌ రైళ్లతో పాటు మరో పది రైళ్లు అదనంగా వివిధ ప్రాంతాలకు బయలుదేరాయి.

ఎలాగైనా సరే సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లి రావాలనే పట్టుదలతో నగరవాసులు అనేక ఇబ్బందుల నడుమ ప్రయాణం చేశారు. గత నాలుగు రోజులుగా ఆర్టీసీ 3,000లకు పైగా ప్రత్యేక బస్సులను నడిపింది. శనివారం ఒక్కరోజే 1,000 బస్సులు అదనంగా బయలుదేరాయి. శనివారం ఒక్క రోజే 5 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు వెళ్లారు. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా గత వారం రోజుల్లో 20 లక్షల మందికి పైగా నగర వాసులు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. ఉప్పల్, ఎల్బీనగర్‌ వంటి నగర శివారు ప్రాంతాలు ఒకవైపు ప్రయాణికుల రద్దీతో, మరోవైపు వాహనాలతో స్తంభించాయి. గంటల తరబడి ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. సికింద్రాబాద్, నాంపల్లి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, బాలానగర్, మెహిదీపట్నం, జేబీఎస్, కూకట్‌పల్లి, మియాపూర్, తదితర ప్రాంతాలలో రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక రైళ్లతో పాటు ప్రైవేట్‌ ట్రావెల్స్‌లోనూ 20 నుంచి 50 శాతం వరకూ చార్జీలు పెంచి వసూలు చేశారు. కాగా చౌటుప్పల్, భువనగిరి, తదితర ప్రాంతాల్లోని టోల్‌గేట్ల వద్ద రద్దీ పట్టపగలు చుక్కలు చూపించింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది.  

నగరం ఖాళీ.. 
గత నాలుగైదు రోజులుగా పెద్ద సంఖ్యలో నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్లడంతో శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు రద్దీగా కనిపించిన రహదారులు ఆ తరువాత ఖాళీ అయ్యాయి. ఒకవైపు సంక్రాంతి, మరోవైపు వీకెండ్‌ సెలవులు కావడంతో నగరవాసులు సైతం పెద్దగా ఇళ్ల నుంచి బయటకు రాలేదు. మరోవైపు 20 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు తరలి వెళ్లడంతో రోడ్లపై జనం చాలా తక్కువగా కనిపించారు. 

Back to Top