మాయదారి ‘మైత్రి’..


  • ప్లాంటేషన్, హార్టికల్చర్‌ పేరిట భారీ దోపిడీ

  • డిపాజిట్లు సేకరించి బిచాణా ఎత్తేసిన కంపెనీ

  • సాక్షి, హైదరాబాద్‌: ‘‘లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే ఖమ్మంలో రెండు గుంటల భూమి.. నెలకు రూ.4 వేల వడ్డీ ఇస్తాం.. ఏడాది కల్లా డిపాజిట్‌ చేసిన లక్ష రూపాయలు తిరిగి ఇస్తాం..’’ఇలా మాయమాటలతో భారీ దోపి డీకి పాల్పడింది మైత్రి ప్లాంటేషన్, హార్టికల్చర్‌ సంస్థ. ప్లాంటేషన్, హార్టికల్చర్‌ పేరుతో కంపెనీ తెరిచి.. చెట్ల పెంపకం, వ్యవసాయం పేరుతో ఏజెంట్లను నియమించుకుని.. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలుపెట్టి 450 మందికిపైగా ఖాతాదారులను ముంచేసింది.



    ఇదీ అసలు సంగతి..

    ఒంగోలుకు చెందిన లక్కు మాల్యాద్రిరెడ్డి, లక్కు మాధవరెడ్డి, లక్కు కొండారెడ్డి, కొల్ల పూడి బర్మారెడ్డి మైత్రి ప్లాంటేషన్, హార్టికల్చర్‌ పేరుతో 2007లో కంపెనీ స్థాపించారు. దీనికి తోడు నక్షత్ర బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కూడా స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో 20కిపైగా బ్రాం చ్‌లు తెరిచారు.  ఏజెంట్లను ఉద్యోగులుగా నియమించుకుని.. రూ.లక్ష డిపాజిట్‌ చేస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద రెండు గుంటల భూమితోపాటు నెలకు రూ.4 వేల వడ్డీ ఇస్తామని చెప్పి ఏజెంట్ల ద్వారా డిపాజిట్లు స్వీక రించారు. ఇలా పెద్దపల్లి జిల్లాలో ఏడాదిన్నర నుంచి రూ.15 కోట్ల వరకు వసూలు చేశారు.  6 నెలల కిందటి నుంచి కంపెనీ కార్యాలయం తెరవకపోవడం, డైరెక్టర్లుగా ఉన్న వ్యక్తుల ఫోన్లు స్విచ్చాఫ్‌ రావడంతో నష్టపోయిన పెద్దపల్లిలోని పిన్‌రెడ్డి నర్సింహారెడ్డి సీఐడీని ఆశ్రయించారు.



    రూ.15 కోట్లకుపైగా కంపెనీ వసూలు చేసిందని, తాను రూ.15 లక్షల వరకు డిపాజిట్‌ చేశానని, కంపెనీ ఎత్తేయడంతో 450 మందికి పైగా ఖాతాదారులు రోడ్డున పడ్డారని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. ప్రాథమి కంగా విచారణ జరిపి మైత్రి ప్లాంటేషన్, హార్టికల్చర్‌ ఓ దోపిడీ అని, ఒంగోలు కార్యాలయం పేరుతో డిపాజిట్లు సేకరించి మరో అగ్రిగోల్డ్‌ కంపెనీలా మారిందని పేర్కొన్నారు. 37–1–44, మొదటి అంతస్థు, ట్రంక్‌ రోడ్, ఒంగోలు పేరు మీద మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌లో 12 కంపెనీలు రిజిస్ట్రేషన్‌ చేసి ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మైత్రి ప్లాంటేషన్, హార్టికల్చర్‌ కంపెనీ నడు పుతున్న లక్కు మాల్యాద్రిరెడ్డి, లక్కు మాధవ రెడ్డి పేర్ల మీద ఇదే అడ్రస్‌తో మైత్రి రియల్డర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, శ్రీనక్షత్రా గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శ్రీనక్షత్రా ఫార్మసీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమెటెడ్‌.. తదితర కంపెనీలు నమోదై ఉన్నాయి.



    మరో అగ్రిగోల్డ్‌ కాబోతోందా?

    మనీ డిపాజిట్, సర్క్యూలేషన్‌ ఆరోపణలతో అగ్రిగోల్డ్‌ కేసు రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇదే రీతిలో మైత్రి కూడా ఉండే అవకాశం ఉందని సీఐడీ అనుమానిస్తోంది. 20కిపైగా బ్రాంచీలు తెలంగాణలోనే ఉంటే, ఏపీలో మరిన్ని బ్రాంచ్‌లు ఉన్నాయని, కేరళ, తమిళనాడులోనూ బ్రాంచ్‌లున్నాయని గుర్తించామని అధికారులు తెలిపారు. పెద్దపల్లిలోనే రూ.15 కోట్లకుపైగా సేకరిస్తే.. మిగతా బ్రాంచ్‌ల్లో ఎంత సేకరించారో విచారించాల్సి ఉందని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top