పవన్‌ ఓ ఎనిగ్మా! రేవంత్‌ ఎవరు?

Harrish rao is a persistent leader - Sakshi

ట్విట్టరియన్స్‌తో సంభాషణలో ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభుత్వం, రాజకీయాలు, వ్యక్తిగత అభిరుచులు, ఇతర అంశాలపై ప్రశ్నలకు సమాధానం

సాక్షి, హైదరాబాద్‌: శారీరకంగా, మానసికంగా ‘ఫిట్‌’గా ఉండటమే తన నూతన సంవత్సర తీర్మానమని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. దేవుడిని కాకుండా కర్మను నమ్ముతానని చెప్పారు. గురువారం ఆయన ట్వీటర్‌లో నెటిజన్లతో సంభాషించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయాలు, వ్యక్తిగత అభిరుచులు, పవన్‌ కల్యాణ్‌.. ఇలా చాలా అంశాలపై నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు.

వారంటే ఎంతో అభిమానం.. : మీకు ఎవరెవరంటే అభిమానమంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నించగా.. రాహుల్‌ ద్రవిడ్, కోహ్లీ, రోహిత్‌ అభిమాన క్రికెటర్లని కేటీఆర్‌ తెలిపారు. షారూక్‌ఖాన్‌ తన అభిమాన బాలీవుడ్‌ నటుడన్నారు. కేసీఆర్‌ కాకుండా తాను అధికంగా ఇష్టపడే రాజకీయ నాయకుడు బరాక్‌ ఒబామా అని చెప్పారు.

పీకే అర్థంకారు : ఇక వెండితెర పవర్‌స్టార్‌, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను కేటీఆర్‌.. ఎనిగ్మా (ఏమాత్రం అర్థంకానివ్యక్తి)గా అభివర్ణించారు. పవన్‌ రాజకీయాలను ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పవన్‌ నటించిన కొమురం పులి, కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాలు వివాదాస్పదం కావడం, వాటికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనలు చేపట్టడం తెలిసిందే.

రేవంత్‌ ఎవరు?: ఇండియన్‌ చైనీస్‌ వంటలు తనకు ఇష్టమైన ఆహారమని, అమెరికాలో ఉన్నప్పుడు వంట చేసుకునే వాడినని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ తమ సోదర రాష్ట్రమన్నారు. అక్కడ ఎవరికి ఓటేస్తారని అడిగితే.. తనకు అక్కడ ఓటు లేనందున టీడీపీకా, వైసీపీకా అనేది చెప్పలేనని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి గురించి ఒక్క మాట చెప్పమంటే.. ఆయన ఎవరు? అని ప్రశ్నించారు. మెట్రో రైలు ప్రారంభం, జీఈఎస్‌ సమావేశం రెండూ ఒకే రోజు జరగడం ఈ ఏడాది గుర్తుండిపోయే రోజని చెప్పారు.

సమ్మిళిత అభివృద్ధి దిశగా చర్యలు : రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ కేంద్రీకృతంగా మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాలు, రంగాలను కలుపుకొంటూ సమ్మిళిత అభివృద్ధి దిశగా వెళుతోందని చెప్పారు. రక్షణ భూముల సేకరణ కష్టంగా ఉన్నందున స్కైవేల నిర్మాణం ఆలస్యం అవుతోందని.. పాతబస్తీకి కచ్చితంగా మెట్రోరైలు వస్తుందని తెలిపారు. నగరంలో డీజిల్‌ బస్సుల వల్ల కాలుష్యం పెరుగుతోందన్నారు. సీఎన్జీ, ఎల్పీజీ బస్సుల వినియోగం పెంచవచ్చు కదాని అడిగితే.. ఎలక్ట్రిక్‌ వాహనాలే సరైన పరిష్కారమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకే ఎకరాకు రూ. 4 వేల ఆర్థికసాయం, రైతు సమితులు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.

టాస్క్‌ మాస్టర్‌.. సీఎం కేసీఆర్‌ : ముఖ్యమంత్రి గురించి ఒక్కమాటలో చెప్పాలని నెటిజన్లు కోరగా.. ‘సానుకూల ఫలితాలు సాధించే టాస్క్‌ మాస్టర్‌’అని కేటీఆర్‌ బదులిచ్చారు. సోనియానా, మోదీనా అని అడిగితే.. దేశంలో రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే లేదంటూ సోనియా రిటైరైన విషయాన్ని గుర్తుచేశారు.

ఒకటి ఎప్పటికీ రెండు కాదు : చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావడం లేదెందుకంటే... ప్రభుత్వం, ప్రజలు వేరన్న భావన ఉందని, నిజానికి రెండూ కలిస్తేనే ప్రజాస్వామ్యమని వివరించారు. వచ్చే ఎన్నికల్లో విజయం మీదేనంటూ ఓ ఏపీ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ఎన్నికల గురించి వర్రీ లేదని సమాధానమిచ్చారు. రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు ఎన్నటికీ కాదన్నారు. కేంద్ర కేబినెట్‌లో చేరుతారా అని ప్రశ్నించగా.. ఉన్న దాంతోనే సంతోషంగా ఉన్నానని చెప్పారు.

కేటీఆర్‌ ఇచ్చిన కొన్ని  సమాధానాలివీ..
మంత్రి హరీశ్‌రావు మొండి పట్టుదల కలిగిన హార్డ్‌ వర్కింగ్‌ నాయకుడు
కాంగ్రెస్‌ అభివృద్ధికి వ్యతిరేక పదం. అలాంటి పార్టీలో ఎవరినైనా ఎలా ఇష్టపడతాం?
ఇండియన్, చైనీస్‌ ఆహారం ఇష్టం
అల్లు అర్జున్‌ ఎనర్జీ, స్టైల్, స్వాగ్‌.. మహేశ్‌బాబు సూపర్‌స్టార్, ప్రభాస్‌ బాహుబలి, జూనియర్‌ ఎన్‌టీఆర్‌ ఒక పెర్ఫార్మర్, సచిన్‌ ఒక లెజెండ్‌

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top