కాళేశ్వరం ప్రమాదంపై హరీశ్‌ దిగ్భ్రాంతి

కాళేశ్వరం ప్రమాదంపై హరీశ్‌ దిగ్భ్రాంతి - Sakshi

విచారణకు ఆదేశాలు.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ

 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీ–10 పంప్‌హౌజ్‌ డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ పైకప్పు కూలిన ఘటనపై ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని కాంట్రాక్టు ఏజెన్సీ ప్రకటించినట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో హరీశ్‌ తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీనిచ్చారు. ఈ ఘటన సమాచారం తెలియగానే ఆయన ప్యాకేజీ–10 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఆనంద్‌తో ఫోన్‌లో మాట్లాడారు.



ప్రమాదంలో ఏడుగురు మరణించినట్టు మంత్రికి ఈఈ సమాచారమిచ్చారు. మృతుల్లో ఆరుగురు జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారని, ఒకరు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చెందిన వారని తెలిపారు. గాయపడ్డవారికి అందుతున్న సాయంపై మంత్రి జలసౌధ నుంచి రాజన్న సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కార్మికులు భోజన విరామానికి బయటికి వస్తున్న సమయంలో డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ పైకప్పులోని ఎయిర్‌ ప్యాకెట్స్‌లో అనూహ్యంగా పేలుడు సంభవించడంతో సుమారు ఐదు టన్నుల బరువున్న గ్రానైట్‌ రాయి కూలిందని ఇరిగేషన్‌ ఈఎన్‌సీ మురళీధర్‌ మంత్రికి తెలిపారు. కొందరు కార్మికులు అక్కడ చిక్కుకుపోవడం వల్ల ప్రమాదానికి గురయ్యారని వివరణ ఇచ్చారు. జరిగిన ఘటనపై విచారణ నివేదిక అందిన తర్వాత నిపుణుల సూచనలు, సలహాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఈఎన్‌సీ చెప్పారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top