ఎస్సీలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

Gaddar at the Ou Convention - Sakshi

ఓయూ సదస్సులో గద్దర్‌

హైదరాబాద్‌: ఎస్సీ ఉపకులాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. మంగళవారం ఓయూ క్యాంపస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎమ్మార్పీఎస్‌–టీఎస్, ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ అధ్యక్షత వహించగా గద్దర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్సీలు అంటే మాల, మాదిగలే కాదని, అందులో 57 కులాల వారు ఉన్నారని, ఆ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని గద్దర్‌ కోరారు.

దీనిపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు చెప్పారు. జాతీయ అధ్యక్షుడు సుంకపాక దేవయ్యమాదిగ, ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్యమాదిగ రాష్ట్ర అధ్యక్షుడు యాతకుల భాస్కర్‌మాదిగ మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్‌లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, తెలుగు రాష్ట్రాల సీఎంలు వర్గీకరణకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు కేటాయించాలని, ఎంఆర్‌వో ద్వారా కులం సర్టిఫికెట్లు జారీ చేయాలని తెలిపారు.

జిల్లాకు ఒక గురుకుల పాఠశాలను ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, రాజకీయ రంగంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక అధ్యక్షుడు చింతల మల్లికార్జున్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ చంద్రగిరి రాజమౌళి, ఎమ్మార్పీఎస్‌ జాతీయ గౌరవ అధ్యక్షుడు సండ్రవల్లి వెంకటయ్య, బేడబుడగ జంగా హక్కుల దండు వ్యవస్థాపక అధ్యక్షుడు తూర్పాటి హనుమంతు, హోళిదాసరి పోరాట సమితి అధ్యక్షుడు తమటం వీరేశం, డక్కలి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బాణాల మంగేశ్, మాస్టిన్‌ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నాగిళ్ల కిష్టయ్య, బైండ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేణికుంట్ల మురళి, మోచీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రవీందర్, చిందు హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గడ్డం సమ్మయ్య చిందు తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top