రాష్ట్రానికి వచ్చేందుకు ఉచిత టికెట్‌

Free ticket to get back to the state - Sakshi

కువైట్‌లో చిక్కుకున్న వారికి మంత్రి కేటీఆర్‌ హామీ

అవసరమైతే కేంద్ర మంత్రి సుష్మ సహకారం కోరతామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కువైట్‌లో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న విదేశీయులు సొంత దేశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష (అమ్నెస్టీ) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో అక్రమంగా నివసిస్తున్న తెలంగాణవాసులను రాష్ట్రానికి తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎన్‌ఆర్‌ఐ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. క్షమాభిక్ష కార్యక్రమంలో భాగంగా దేశానికి రావాల్సిన వారు ఇప్పటికే అక్కడి భారత ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నారని, అయితే కొంత మందికి కనీసం విమాన టిక్కెట్టుకు సైతం డబ్బులు లేని పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.

మానవతా దృక్పథంతో ఇలాంటి వారందరి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ మేరకు ఎంత మందికి టిక్కెట్లు అవసరమవుతాయి, తిరిగి వస్తున్న కార్మికుల సంఖ్య ఎంత.. తదితర వివరాలను తెలుసుకోవాలని అధికారులను అదేశించారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం అంచనా సమర్పించాలని, ప్రభుత్వం నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కువైట్‌ నుంచి తిరిగి వస్తున్న వారికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించాలని ఎన్నారై శాఖ అధికారులను ఆదేశించారు.

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని అక్కడ చిక్కుకున్న తెలంగాణవాసులకు సహాయం చేయాలని సూచించారు. మరోవైపు భారత ఎంబసీ అధికారులతో తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులు ఆదివారం సంప్రదింపులు జరిపి అక్కడ చిక్కుకున్న రాష్ట్ర కార్మికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సుష్మ సహకారం కోరతాం
తెలంగాణవాసులను తిరిగి రప్పించే విషయంలో అవసరమైతే విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ సహకారం కోరతామని కేటీఆర్‌ తెలిపారు. కువైట్‌లోని తెలంగాణ పౌరులు ఎన్నారై శాఖను సంప్రదించేందుకు సోషల్‌ మీడియా, వెబ్‌సైట్‌ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు కావాల్సిన చర్యలను ఒకటీ రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ఎన్నారై శాఖకు సంబంధించిన అధికారి మొబైల్‌ నంబర్‌ 9440854433ను కానీ, శాఖ ఈమెయిల్‌  sonri@telangana.gov.in లోగాని తమ వివరాలు అందించాలని సూచించారు.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top