కాల్వల పనుల్లో కక్కుర్తి..!

frauds in channals moderaization - Sakshi

‘సాగర్‌’ కాల్వల ఆధునీకరణ పనుల్లో ఇష్టారాజ్యం

కాసులకోసం లైనింగ్‌ పనులు తగ్గించి మట్టి పని పెంచారు

కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ చేయకుండానే చేసినట్లుగా రికార్డులు

పది మంది ఇంజనీర్ల పాత్ర ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణ  

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ కాల్వల ఆధునీకరణ పనుల్లో ఇంజనీర్ల అక్రమాల తతంగం తాజాగా బయటికొచ్చింది. కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టేందుకు చేసిన యత్నాలు బయటపడ్డాయి. కొన్ని చోట్ల ఎలాంటి పనులు చేయకుండానే చేసినట్లుగాను, మరికొన్ని చోట్ల ఉద్దేశ పూర్వకంగా మట్టిపని పెంచిన వైనం వెలుగులోకి వచ్చింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పిల్లాయిపల్లి, బునియాదిగని, ధర్మారెడ్డిపల్లి కాల్వల పరిధిలో అడ్డగోలు అంచనాలతో కోట్లు దండు కున్నట్లు వెలుగులోకి వచ్చిన విషయం మరువకముందే ప్రస్తుతం సాగర్‌ ఆధునీకరణ పనుల్లో రూ.25కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథ మికంగా నిర్ధారణ కావడం కలవరం రేపుతోంది.  

చేయని పనులు చేసినట్లుగా..
కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌కు వచ్చిన జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రాజెక్టు కింద పూర్తి ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో ఆయకట్టు ఆధునీకరణ పనులకు 2008లో శ్రీకారం చుట్టారు. పనులను రూ.4,444.41 కోట్ల అంచనాలతో ఆరంభించారు. కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలను ఆధునీకరించడం ద్వారా నీటి విడుదల సేవలను మెరుగుపరచడం, సాగునీటి వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, సంస్థాగత సామర్థ్యాన్ని పటిష్టపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రాజెక్టు వ్యయంలో తెలంగాణ వాటా కింద రూ.1,611 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ వాటాకింద రూ.2,833 కోట్లు కేటాయించారు. రాష్ట్ర నిధులతో తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఎడమ కాలువ, డిస్ట్రిబ్యూటరీల ఆధునీకరణ పనులను చేపట్టారు. ఇందులో భాగంగానే డిస్ట్రిబ్యూటరీ కమిటీ–8 (డీసీ–8) ముచ్చాల బ్రాంచ్‌ కెనాల్‌ కింద మొత్తంగా 10 కాల్వల పనులు చేపట్టారు. ఇందులో కోదాడ, హుజూర్‌నగర్‌ కింద చేపట్టిన కాల్వల పనుల్లో ప్రస్తుతం అక్రమాలు బయటపడ్డాయి. ఇక్కడ మొత్తంగా రూ.24.37 కోట్లతో 2010లో కాల్వల పనులు చేపట్టారు.

ఇందులో 2016 నాటికి కేవలం 2.97 కోట్ల మేర పనులు (మొత్తంగా 13శాతం) పూర్తి చేశారు. అనంతరం మళ్లీ మొదలుపెట్టగా ప్రస్తుతానికి 93 శాతం పనులు అయినట్లు ఇంజనీర్లు చూపారు. అయితే ఇటీవల ఈ కాల్వలకు సంబంధించి ఆయకట్టు పరిరక్షణ కమిటీ ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇరిగేషన్‌ శాఖ సాంకేతిక సలహాదారు విజయ్‌ ప్రకాశ్‌ నేతృత్వంలోని బృందం అక్కడ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కాల్వల పనులు ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని గుర్తించింది. ముఖ్యంగా కాల్వల పనుల్లో లైనింగ్‌ పనులు తగ్గించి మట్టి పనిని పెంచారు.

సిమెంట్, కాంక్రీట్, స్కిల్డ్‌ లేబర్‌తో ముడిపడి ఉన్న లైనింగ్‌ పనులు అంత లాభదాయకం కాదన్న ఉద్దేశ్యంతోనే ఇంజనీర్లు సులభమైన మట్టిపనిని పెంచారు. ఇక కాల్వలను పునరాకృతిలోకి తీసుకురావడానికి చేసిన పనులను నాణ్యతగా చేయలేదు. చేసిన మట్టి పనిలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. మొత్తంగా 3 కిలోమీటర్ల పనుల్లో ఇలాంటి అవకతవకలు జరిగాయి. కొన్ని చోట్ల బండరాళ్ల తొలగింపునకు కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ చేసినట్లు రికార్డుల్లో చూపినా అలాంటి పనులేవీ చేసిన దాఖలాలు లేవు.

ఈ తతంగంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నుంచి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వరకు నలుగురైదుగురు ఇంజనీర్ల ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే డీసీ–8 పరిధిలోని మరో కాల్వ పరిధి పనుల్లోనూ అక్రమాలను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గుర్తించింది. ఇక్కడ చేయని పనులు చేసినట్లుగా అధికారులు చూపినట్లుగా పేర్కొంటూ నివేదిక ఇచ్చింది. దీనికి బాధ్యులుగా మరో 5 మంది ఇంజనీర్లను గుర్తించినట్లుగా తెలిసింది. ఈ అక్రమాలకు పాల్పడ్డ ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలకు నీటి పారుదల శాఖ సిద్ధమైనట్లుగా సమాచారం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top