ప్రముఖ సినీ రచయిత వేణుగోపాలాచార్యులు కన్నుమూత

ప్రముఖ సినీ రచయిత వేణుగోపాలాచార్యులు కన్నుమూత


♦ పట్నంలో శాలిబండ, పదవే పోదాము గౌరీ పాటలతో కీర్తి ప్రతిష్టలు

♦ బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు

 

 హైదరాబాద్: ప్రముఖ సినీ రచయిత ఆచ్చి వేణుగోపాలాచార్యులు(91) గురువారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని మాధవ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. పట్నంలో శాలిబండ, పదవే పోదాము గౌరీ, జయజయజయ శ్రీ వేంకటేశ, నమో వేంకటేశ.. నమో తిరుమలేశా తదితరపాటల ద్వారా వేణుగోపాలాచార్యులు తెలుగువారికి సుపరిచితులు. ఆధ్యాత్మిక వేత్తగా.. వేద పండితులుగా.. సినీ రచయితగా ఎంతో కీర్తి ప్రతిష్టలను ఆయన సొంతం చేసుకున్నారు. వేణుపాలాచార్యులు నగరంలోని పురానాపూల్‌లో జన్మించారు.



చిక్కడపల్లి వివేక్‌నగర్‌లో నివాసముంటున్న ఆయనకు భార్య కమలాదేవి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రవీణులైన వేణుగోపాలాచార్యులు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ప్రవృత్తిరీత్యా రచయిత. సంధ్యాదీపం, పచ్చని సంసారం, భాగ్యవంతుడు, అమరుడు తదితర మంచి చిత్రాల్లో పాటలను రాసి ఎంతో కీర్తి గడించారు వేణుగోపాలాచార్యులు. ఆయన రాసిన పాటలన్నీ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. శ్రీ వేంకటేశ్వర వైభవం చిత్రంలో వేణుగోపాలాచార్యులు రాసిన.. ఘంటసాల ఆలపించిన నమో వెంకటేశా.. నమో తిరుమలేశా పాట నేటికి తిరుమలతో పాటు తెలుగు వారి ఇంట వినిపిస్తూనే ఉంటుంది.



తెలుగుతో పాటు హిందీ చిత్రం నాసిక్‌లో కూడా ఆయన పాటలు రాశారు. మాజీ ఎమ్మెల్సీ నర్సింహా చారి, ప్రముఖ గాయకుడు అమలాపురం కన్నారావు, చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ వంశీయుడు రాజేంద్రనాథ్ గౌడ్ సతీమణి సువర్ణలత, ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ మురళీప్రసాద్ తదితరులు వేణుగోపాలాచార్యులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి.. ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో శుక్రవారం వేణుగోపాలాచార్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top