అడిగినంత ఫీజు పెంచాల్సిందే..

అడిగినంత ఫీజు పెంచాల్సిందే..


- పీజీ సీట్ల ఫీజుపై మెట్టు దిగని ప్రైవేటు మెడికల్‌ యాజమాన్యాలు

- ఏపీ ప్రభుత్వం ఎంత పెంచితే అంతేనంటున్న తెలంగాణ




సాక్షి, హైదరాబాద్‌: పీజీ వైద్య సీట్ల ఫీజు పెంపుపై ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు మెట్టు దిగడంలేదు. తాము కోరిన విధంగా ఫీజు పెంచాల్సిందేనని లేకుంటే పీజీ సీట్లను తమ కాలేజీల నుంచి ఉపసంహరించుకుంటామని ఇటీవల ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. మరోవైపు పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం పూర్తయింది. ఇక కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంది.



ఇప్పటికీ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలు పంతం వీడకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేటు పీజీ వైద్య ఫీజు ఎంత పెంచితే తాము అంతే పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం తెలి పింది. ఆ ఫీజులు తమకు ఆమోదయోగ్యంగా ఉంటేనే అంగీకరిస్తామని, లేకుంటే తాము కోరి నట్లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు  ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు ‘సాక్షి’కి చెప్పారు.



ఎన్‌ఆర్‌ఐ కోటాకు రూ.60 లక్షలు

ప్రస్తుతం క్లినికల్‌ కన్వీనర్‌ కోటా సీటుకు రూ.3.2 లక్షల ఫీజుండగా, దాన్ని రూ.12 లక్షలకు పెంచా లని కాలేజీలు డిమాండ్‌ చేశాయి. ప్రస్తుతం యాజ మాన్య కోటా సీట్లకు ఫీజు రూ.5.80 లక్షలున్న సంగతి తెలిసిందే. వీటిని విభజించి బీ కేటగిరీ సీట్లకు రూ.25 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు రూ.50 నుంచి 60 లక్షల వరకు పెంచాలని కోరా యి. ఆ లెక్క ప్రకారం ఎన్‌ఆర్‌ఐ కోటా సీటు ఫీజు ప్రస్తుతమున్న దానితో పోలిస్తే 10 రెట్ల వరకు పెం చాలని కోరుతున్నాయి. కన్వీనర్‌ కోటా, బీ కేటగిరీ సీట్లను ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసుకోవా లని, 25 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను సొంతంగా భర్తీ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరా యి. అలాగే అన్ని ఫీజులను పెంచాలని కోరాయి.



సర్టిఫికెట్ల పరిశీలనలో 4,302 మంది అర్హత

పీజీ వైద్య సీట్ల భర్తీకి నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనలో 4,302 మంది అర్హత సాధించారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 4,634 మంది రిజిస్టర్‌ చేసుకోగా, 4,303 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అర్హత సాధించిన వారిలో 4,021 మంది నాన్‌ సర్వీసు విద్యార్థులు, 281 మంది సర్వీసు విద్యార్థులున్నారని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top