పీఆర్‌టీయూ ఎన్నికలు.. ఇక రసవత్తరం!

పీఆర్‌టీయూ ఎన్నికలు.. ఇక రసవత్తరం!

- 11 ఏళ్ల తరువాత రెండు ప్యానెళ్ల మధ్య పోటీ

ఈనెల 24న రాష్ట్ర కౌన్సిల్, నామినేషన్లు... 25న ఎన్నికలు

 

సాక్షి, హైదరాబాద్‌: పీఆర్‌టీయూ–టీఎస్‌ ఎన్నికలు ఈసారి ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లలో పెద్దఎత్తున చర్చకు తెరలేపాయి. సాధారణంగా రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. కానీ, గతానికి భిన్నంగా 11 ఏళ్ల తరువాత ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 2006లో అప్పటి మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల అధ్యక్షులు పి.వెంకట్‌రెడ్డి, రవికిరణ్‌ ప్యానెల్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా గెలిచారు. ఈసారి ఎన్నికలకుగాను ఈ నెల 24 రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి నామినేషన్లు స్వీకరించనున్నారు. 25న ఎన్నికలు జరగనున్నాయి. ఒక ప్యానెల్‌కు మాజీ ఎమ్మెల్సీ, మరో ప్యానెల్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్సీల సహకారం ఉన్నట్లు తెలిసింది. ఈ ఎన్నికలపై అధికార పార్టీకి చెందిన కీలకనేత ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈసారి పీఆర్‌టీయూలో పోటీ అనివార్యమైనట్లు ఆ సంఘం వర్గాలు భావిస్తున్నాయి. 

 

సరోత్తంరెడ్డి, శ్రీపాల్‌రెడ్డిల మధ్య పోటీ

పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, పీఆర్‌టీయూ వరంగల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. సరోత్తంరెడ్డి ప్యానెల్‌ నుంచి ప్రధాన కార్యదర్శి పదవికి ప్రస్తుతం పీఆర్‌టీయూ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా ఉన్న పి.సత్యనారాయణ పోటీకి సిద్ధం కాగా, శ్రీపాల్‌రెడ్డి ప్యానెల్‌ నుంచి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి పోటీకి దిగుతున్నారు. చెన్నకేశవరెడ్డి 9 నెలల్లో రిటైర్‌ కానున్నారు. ఆయన రిటైర్‌మెంట్‌ తరువాత నిజమాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కమలాకర్‌ను ప్రధాన కార్యదర్శి పదవిలోకి తేవాలన్నది వారి ఆలోచన. ప్రస్తుతం జిల్లాల్లో కొత్త కమిటీల నియామకాలు జరగుతున్నాయి. ఆ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కరీంనగర్, వరంగల్, నిజమాబాద్‌ల్లో పోటీ తప్పలేదు. 

 

ఏకగ్రీవమే కావచ్చు

ఈసారి పోటీలో నిలిచేందుకు కొంతమంది సిద్ధం అవుతున్నా, చివరకు ఏకగ్రీవమవుతుం దని అనుకుంటున్నా. పోటీ ఉండకపోవచ్చు. ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం.

– సరోత్తంరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు

 

పోటీలో ఉంటాం

యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో ఈసారి పోటీ చేస్తున్నాం. మా ప్యానల్‌ నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను పోటీ చేస్తున్నా. గెలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం.  

– శ్రీపాల్‌రెడ్డి, వరంగల్‌ రూరల్‌ అధ్యక్షుడు
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top