డాక్టరేట్‌పైనా అబద్ధాలే!

డాక్టరేట్‌పైనా అబద్ధాలే! - Sakshi


గౌరవ డాక్టరేట్ విషయంలోనూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు

♦ ప్రఖ్యాత షికాగో యూనివర్సిటీ ఇస్తున్నట్లు ట్వీటర్‌లో వ్యాఖ్యలు

♦ కానీ గౌరవ డాక్టరేట్ ఇస్తున్నది షికాగో స్టేట్ యూనివర్సిటీ

♦ ప్రతి ఏటా గుర్తింపు పునరుద్ధరణకు తంటాలు పడుతున్న సంస్థ

♦ దానికే పచ్చ పత్రికలు, తెలుగు తమ్ముళ్ల ప్రచార హంగామా

 

 సాక్షి, హైదరాబాద్: తాను విలువలున్న రాజకీయాలే చేస్తాననీ, 30 ఏళ్లుగా మచ్చలేకుండా రాజకీయం చేశాననీ నిత్యం చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల్లోని నిజమెంతో మరోసారి బట్టబయలైంది. గతంలో ఎన్నో యూనివర్సిటీలు తనకు డాక్టరేట్ ఇవ్వడానికి ముందుకొచ్చినా తిరస్కరించాననీ, ప్రపంచ ప్రఖ్యాత షికాగో విశ్వవిద్యాలయానికున్న చరిత్ర చూసి అంగీకరించానని చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. ఏపీ అభివృద్ధికోసం కృషి చేస్తున్నందుకుగాను షికాగో యూనివర్సిటీ తనకు డాక్టరేట్ ఇస్తున్నట్లు ట్వీటర్ సాక్షిగా ప్రకటించారు. ఇదే అదనుగా పచ్చ పత్రికలు చంద్రబాబు ఘనత గురించి కథనాలు వండాయి. బ్రాండ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ నైపుణ్యాలు పుష్కలంగా ఉన్న పచ్చ తమ్ముళ్లు తమ ప్రచారానికి పదును పెట్టారు.



షికాగో విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రతిపాదించడమే చంద్రబాబు పాలన దక్షతకు ఇదే నిదర్శనమని, అసలా యూనివర్సిటీ చరిత్రలోనే ఒక విదేశీ రాజకీయ వేత్తకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం ఇదే ప్రథమమని బాకాలూదారు. అయితే తెలుగుదేశం అధిపతి, ఆ పార్టీ నేతలు, వారి అనుచరులు ప్రచారం చేస్తున్నట్లు చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రతిపాదించింది ప్రపంచ ప్రఖ్యాత ‘షికాగో యూనివర్సిటీ’ కాదు.. అనామక ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’.



 గంపెడు ఆరోపణలున్న వర్సిటీ...

 అమెరికాలో నాణ్యతాపరంగా పేరున్న యూనివర్సిటీల పేర్లకు దగ్గరగా మరికొన్ని సాధారణ యూనివర్సిటీల పేర్లుంటాయి. అలాగే ఇల్లినాయిస్‌లో ‘యూనివర్సిటీ ఆఫ్ షికాగో’, ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’ పేరిట రెండు విశ్వవిద్యాలయాలున్నాయి. విద్యా ప్రమాణాల్లో ఈ రెండింటికీ మధ్య నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వీటిలో చంద్రబాబుకు డాక్టరేట్ ప్రతిపాదించిన ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’పై నిధులు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల దుర్వినియోగం వంటి ఆరోపణలున్నాయి. దీంతో 2009 నుంచి అమెరికా ప్రభుత్వ హయ్యర్ లెర్నింగ్ సెంటర్ ఇచ్చే గుర్తింపు పునరుద్ధరణకు నానా తంటాలు పడుతోంది.



ఈ పరిస్థితులనుంచి గట్టెక్కేందుకు ఏపీలో వర్సిటీని స్థాపించి భారీగా ప్రోత్సాహకాలు పొందాలని ఆ యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు రావు ఆచంట, దేవిశ్రీ పొట్లూరి ప్రణాళిక రచించారు. వీరిలో రావు ఆచంటకు ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. ఈ సాన్నిహిత్యంతోనే పరస్పర ప్రయోజనాలు చేకూర్చుకునే పథకంలో భాగంగానే చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా దొడ్డిదారిన సంపాదించిన డాక్టరేట్‌కు ఏదో ఘనత సాధించినట్లుగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు, ఆయన అనుయాయులకే చెల్లిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రచారం కోసం పవిత్రమైన విద్యాసంస్థల పేర్లను సైతం వాడుకోవడం గర్హనీయమని ప్రముఖ విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.





 గుర్తింపే ముఖ్యం

 షికాగో స్టేట్ యూనివర్సిటీ (చంద్రబాబుకు డాక్టరేట్ ప్రతిపాదించిన యూనివర్సిటీ)కి అక్కడ సరైన గుర్తింపు లేదు. గుర్తింపు పొందిన పూర్వ విద్యార్థులు కూడా లేరు. ఇలా ప్రాభవం కోల్పోతున్న యూనివర్సిటీలు అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం అనుసరించే వ్యూహాల్లో భాగంగా ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటాయి.

 - ప్రొఫెసర్. వై. వెంకటరామిరెడ్డి, యూపీఎస్‌సీ మాజీ సభ్యులు, జేఎన్‌టీయూ-హెచ్ మాజీ ప్రొఫెసర్



 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top