పంట రుణాలేవీ?

పంట రుణాలేవీ?

  • రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకుల నిర్లక్ష్యం

  • ఏడాదికేడాది తగ్గుతున్న వైనం

  • సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకులు రైతులను కనికరించడంలేదు. లక్ష్యాల మేరకు పంట రుణాలు ఇవ్వకుండా రైతులకు మొండిచెయ్యి చూపిస్తున్నాయి. గత మూడేళ్లలో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బ్యాంకులు పట్టించుకోకపోవడంతో రైతులు ప్రైవేటు అప్పుల వైపు మరలిపోతున్నారు. ఫలితంగా వ్యాపారుల వద్ద అప్పులు పేరుకుపోవడం.. మరోవైపు పంటలు పండక దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.



    115 నుంచి 74 శాతానికి తగ్గిన రుణాలు

    2011–12లో తెలంగాణలో పంట రుణాల లక్ష్యం రూ.10,233 కోట్లు కాగా.. బ్యాంకులు ఏకంగా రూ.11,787 కోట్లు (115%) రైతులకు ఇచ్చాయి. ఆ తర్వాత 2012–13లో లక్ష్యం రూ.11,624 కోట్లు కాగా.. ఏకంగా రూ.14,065 కోట్లు (121 శాతం) ఇచ్చాయి. 2013–14లో లక్ష్యం రూ.14,440 కోట్లు కాగా.. రూ.14,897 కోట్లు (103 శాతం) ఇచ్చాయి. కానీ ఆ తర్వాత నుంచి పరిస్థితి మారిపోయింది. 2014–15లో పంట రుణాల లక్ష్యం రూ.18,717.95 కోట్లు కాగా.. బ్యాంకులు కేవలం రూ.17,019.92 కోట్లే (91 శాతమే) ఇచ్చాయి. 2015–16లో లక్ష్యం రూ.27,800 కోట్లు కాగా.. కేవలం రూ.20,585.74 (74.05 శాతం) ఇచ్చాయి. ఇక 2016–17 ఖరీఫ్‌ పంట రుణాల లక్ష్యం రూ.17,460.83 కోట్లు కాగా.. ఇచ్చింది రూ.15,205.10 కోట్ల (87 శాతం)కే పరిమితం చేశారు. ఈ రబీలో రూ.11,640 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఇచ్చింది రూ.7 వేల కోట్లకు మించలేదని సమాచారం. అంటే ఈసారి కనీసం 60 శాతానికి మించి రుణాలు విదిల్చలేదని అర్థమవుతోంది.



    రుణమాఫీ కాకపోవడమే కారణమా?

    గతంలో పంట రుణాలను లక్ష్యానికి మించి ఇచ్చిన బ్యాంకులు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తగ్గించాయని అర్థమవుతోంది. దీనికి ప్రధాన కారణం రుణమాఫీ సొమ్మును సర్కారు సకాలంలో విడుదల చేయకపోవడమేనని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.17 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించింది. అయితే నాలుగు విడతల్లో చెల్లిస్తామని తెలిపింది. దీంతో బ్యాంకులు నీరుగారిపోయాయి. మరోవైపు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల పథకం కింద ఈ ఏడాది రూ.200 కోట్లు బ్యాంకులకు ప్రభుత్వం బకాయి పడింది.  దీంతో ప్రభుత్వానికి, బ్యాంకులకు మధ్య అగాధం పెరిగింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top