భయపెట్టి భూములు సేకరిస్తారా?

భయపెట్టి భూములు సేకరిస్తారా?


టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం

సాక్షి, హైదరాబాద్‌: ప్రాజెక్టులు కట్టడానికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించకుండా రైతులను భయపెట్టి భూములను సేకరిస్తారా అని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం ప్రశ్నించారు. టీజేఏసీ నేతల అక్రమ అరెస్టులను సోమవారం ఇక్కడ జరిగిన జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ఖం డించింది. అనంతరం జేఏసీ నేతలు రఘు, పురుషోత్తం, రమేశ్‌ తదితరులతో కలసి కోదండరాం విలేకరులతో మాట్లాడారు. రిజర్వాయర్‌ కట్టాలనుకుంటే దాని నీటి నిల్వ సామర్థ్యం, ముంపు, సాగునీటి లభ్యత వంటి వివరాలను బయటకు చెప్పాలన్నారు.


భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇవ్వకుండా, రైతులకు పరిహారం ఎంత ఇస్తున్నారో చెప్పకుండా, పునరావాసానికి ఎలాంటి చర్యలను తీసుకుంటున్నారో చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారని విమర్శించారు. తుపాకులు ఉన్న పోలీసులను ముందుపెట్టి కొండపోచమ్మ రిజర్వాయర్‌ కోసం బహిలింపూర్‌ రైతుల భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారని కోదండరాం విమర్శించారు.ప్రాజెక్టు కోసం భూములను చట్ట ప్రకారం సేకరించకుండా కేవలం కొన్నట్టుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం అప్రజాస్వామికం, చట్ట వ్యతిరేకం కాదా అని ప్రశ్నిం చారు.


గ్రామంలో బహిరంగసభ పెట్టలేదని, ర్యాలీ నిర్వహించలేదని, రోడ్లపైకి వెళ్లలేదని, అయినా సెక్షన్‌ 30 అమలులో ఉందంటూ పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫాంహౌస్‌కు దగ్గరలోనే ఉన్న బహిలింపూర్‌లో ఇలా జరుగుతున్నదని, ఇది దురదృష్టకరమని అన్నారు. చట్ట ప్రకారమే ఆదుకుంటామని, భయపడాల్సిన అవసరంలేదని గ్రామస్తులకు భరోసాను ఇచ్చినట్టు చెప్పారు.


కోదండరాం అరెస్ట్‌.. విడుదల

గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా ములుగు మండలం బహిలింపూర్‌లో సోమవారం ‘కొండపో చమ్మ సాగర్‌’ రిజర్వాయర్‌ ముంపు బాధి తులను కలిసేందుకు వెళ్లిన టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం, హైకోర్టు న్యాయవాది రచనారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును అడ్డుకునేందుకు గ్రామస్తులు యత్నించడం తో ఉద్రిక్తతకు దారితీసింది.


గజ్వేల్‌ నియో జకవర్గం మర్కూక్‌–పాములపర్తి గ్రామాల మధ్య ప్రభుత్వం ‘కొండపోచమ్మ సాగర్‌’ రిజర్వాయర్‌ కోసం భూసేకరణ జరుగు తోంది.ముంపునకు గురవుతున్న ములుగు మండలం బహిలింపూర్, మామిడ్యాల, తానేదార్‌పల్లిల్లో రైతుల నుంచి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాగుతోంది.  కోదండరాం, రచనారెడ్డి, జేఏసీ నాయకుడు పురు షోత్తం బహిలింపూర్‌ చేరుకుని భూసేకర ణ, నష్టపరిహారంపై ఆరా తీస్తుండగా... పోలీసులు  వారిని అరెస్టు చేశారు. గజ్వేల్‌ బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో కొద్ది గంటలు ఉంచి అనంతరం విడుదల చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top