కళ్లు చెదిరే ‘చంద్ర’భవనం

కళ్లు చెదిరే ‘చంద్ర’భవనం - Sakshi


నేడు హైదరాబాద్‌లో ఏపీ ముఖ్యమంత్రి గృహప్రవేశం

- అతి ఖరీదైన ప్రాంతంలో.. అర ఎకరం విస్తీర్ణంలో నివాసం సిద్ధం

- 20వేల చదరపు అడుగుల్లో విలాసవంత నిర్మాణం




సాక్షి, హైదరాబాద్‌/అమరావతి: వందలమంది పోలీసుల పహారా..చీమ చిటుక్కుమన్నా అలర్ట్‌ అయ్యేలా ఏర్పాట్లు..అటువైపు ఎవరూ రాకుండా కఠినమైన ఆంక్షలు..రెండేళ్లుగా ఆ రోడ్డులో ఇదే తంతు..ఎందుకంటే అక్కడ అత్యంత ‘విలువైన’ ఓ భారీ మహల్‌ నిర్మాణం జరుగుతోంది.. అది ఇవాళ పూర్తిచేసుకుని గృహప్రవేశానికి సిద్ధమయ్యింది.



హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు మాత్రమే నివసించే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 65లో ఇంద్రభవనాన్ని తలదన్నేలా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మించిన ‘చంద్ర’భవనం అది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అక్రమ నిర్మాణాన్ని అధికార నివాసంగా చేసుకున్న చంద్రబాబు నాయుడు... తన సొంత నివాసం కోసం హైదరాబాద్‌లో ఓ భారీ మహల్‌ను నిర్మించుకున్నారు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో అర ఎకరం విస్తీర్ణంలో కళ్లు చెదిరేలా నిర్మించిన సొంత ఇంటిలోకి ఆదివారం అర్ధరాత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లు గృహ ప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు ఎంపిక చేసిన అతి కొద్దిమంది సన్నిహితులు హాజరు కానున్నట్లు సమాచారం. సోమవారం సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.



అడుగడుగునా ఖరీదైన సామగ్రి..

చంద్రబాబు కుటుంబం నివసించే ఈ భారీ మహల్‌ను ఇరవై వేలకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతమైన నిర్మాణ సామగ్రితో నిర్మించారు. ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ఖరీదైన సామగ్రిని మాత్రమే ఎంచుకుని మరీ ఉపయోగించారని సమాచారం. జూబ్లీహిల్స్‌రోడ్‌ నంబర్‌ 65లో 2,479 గజాల విస్తీర్ణంలో స్టిల్ట్‌తోపాటు రెండు అంతస్తుల్లో ఈ భవనం నిర్మించారు. విదేశీ నిపుణుల సూచనల మేరకు అత్యంత విశాలమైన పడక, విశ్రాంతి గదులు, లాన్‌లతో ప్రత్యేకంగా రూపుదిద్దారు. ఈ సౌధం పునాదులు మొదలుకుని టెర్రస్‌ వరకు అన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత విలువైన సామగ్రినే ఉపయోగించినట్లు చెబుతున్నారు. అనేక యూరప్‌ దేశాల నుంచి తీసుకువచ్చిన ఖరీదైన కళాఖండాలు,  షాండ్లియర్లతో భవనం నిండిపోయింది.



విదేశాల నుంచి తీసుకొచ్చిన అనేక అరుదైన జాతి మొక్కలతో లాన్‌లను నింపేశారు. ఈ ప్యాలెస్‌లో ఉపయోగించిన ఇంటీరియర్‌ కోసమే చంద్రబాబు కుటుంబం ఇటలీకి నాలుగుసార్లు వెళ్లి వచ్చిందంటే ఈ ఇంటి నిర్మాణానికి వారు ఎంత ప్రాధాన్యమిచ్చారో అర్థం చేసుకోవచ్చు. మూడు అంతస్తుల్లో 20,383 చదరపు అడుగుల నిర్మాణం కోసం డబ్బు మంచినీళ్లలా ఖర్చుచేశారు. ఎక్కడా రాజీ లేకుండా అత్యంత ఖరీదైన మెటీరియల్‌ను ఎంచుకుని అన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. స్టిల్ట్‌ ఫ్లోర్‌లో ఏకంగా పందొమ్మిది కార్ల పార్కింగ్‌ కు ఏర్పాట్లున్నాయి. అత్యా«ధునికమైన లిఫ్ట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు వీఐపీ లాంజ్‌లు, డైనింగ్‌ హాళ్లు, స్టడీ–లైబ్రరీ, పడక గదుల కోసం ప్రత్యేక సామగ్రిని ఉపయోగించారని, అన్నీ విదేశీ నిపుణులు నిర్దేశించిన డిజైన్లనే వినియోగించారని అంటున్నారు.



ఆది నుంచీ వివాదమే..

చంద్రబాబు– లోకేష్‌ ఇంటి నిర్మాణ వ్యవహారం వివాదాలతోనే మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా పదమూడు మీటర్ల ఎత్తుతో నిర్మించిన డిజైన్లను జీహెచ్‌ఎంసీకి సమర్పించారు. అయితే జూబ్లీహిల్స్‌ ఏరియాలో అమల్లో ఉన్న నిబంధనల మేరకు 10 మీటర్లకు మించి ఎత్తయిన భవనాలకు అనుమతి లేకపోవటంతో  2015 జూన్‌ 16న చంద్రబాబు ఇంటి నిర్మాణ ప్లాన్‌ను జీహెచ్‌ఎంసీ తిరస్కరించింది. తిరిగి 9.95 మీటర్ల ఎత్తు, సెట్‌బ్యాక్‌లతో రూపొందించిన ప్లాన్‌ను సమర్పించటంతో అదే సంవత్సరం ఆగస్టు 17న నిర్మాణ అనుమతి మంజూరు చేశారు.



ఇక భవన నిర్మాణం పూర్తయ్యాక నివాసయోగ్యమని ధ్రువీకరిస్తూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ)ని జీహెచ్‌ఎంసీ నుంచి పొందాలి. అనుమతికి అనుగుణంగా నిర్మాణం జరిగిందీ, లేనిదీ పరిశీలించి అధికారులు ఓసీ జారీ చేస్తారు. ఎవరైనా అనుమతి పొందిన ప్లాన్‌కు భిన్నంగా నిర్మాణం జరిపితే ఓసీ ఇవ్వరు. 200 చ.మీ.లు మించిన విస్తీర్ణంలో నిర్మాణం జరిపేవారు బిల్టప్‌ ఏరియాలో 10 శాతం స్థలాన్ని జీహెచ్‌ఎంసీకి మార్టిగేజ్‌ చేయాలి. చంద్రబాబు నాయుడి భవనంలో మొదటి అంతస్తులో 195.52 చ.మీ.ల స్థలాన్ని మార్టిగేజ్‌ చేశారు. నిర్మాణం పూర్తయ్యాక ఓసీకి దరఖాస్తు చేస్తే..  ఓసీ జారీతో పాటు మార్టిగేజ్‌ స్థలాన్ని  విడుదల చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడి  భవనానికి  ఓసీ కోసం దరఖాస్తు చేయలేదని అధికారులు పేర్కొంటున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top