మిగిలింది 64 టీఎంసీలే!

మిగిలింది 64 టీఎంసీలే! - Sakshi


► ఈ నీటినే జూన్ వరకు సర్దుకోవాల్సిందే

► తెలంగాణ, ఏపీలకు స్పష్టం చేసిన కృష్ణా బోర్డు

► రెండో విడతలో 13 చోట్ల టెలీమెట్రీ ఏర్పాటుకు ప్రతిపాదనలు

►జనవరి తర్వాతి నీటి అవసరాలపై త్వరలో సమావేశం  




సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్ లోని నాగా ర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు వినియోగం పోగా మరో 64 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉందని కృష్ణా బోర్డు తేల్చింది. ఆ నీటినే ఇరు రాష్ట్రాలు వచ్చే జూన్  వరకు సర్దుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా లో గత నెల నుంచి జరిగిన వినియోగం, మిగిలిన నీటి లెక్కలను తెలుపుతూ.. బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. గత నెలలో సాగర్, శ్రీశైలంలలో కలిపి 129.96 టీఎంసీల మేర నీరుండగా.. తెలంగాణ 19.56 టీఎంసీ లు, ఏపీ 39.75 టీఎంసీలు వాడుకున్నాయని అందులో వివరించారు. అవి పోగా 70.64 టీఎంసీల నీరుండాల్సి ఉందని.. కానీ 64.53 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయని, మిగతా 6 టీఎంసీల నీరు లెక్కల్లోకి రాలేదని పేర్కొంది. మొత్తంగా మిగిలిన 64 టీఎంసీల లభ్యత నీటినే ఇరు రాష్ట్రాలు మళ్లీ వర్షాలు కురిసేదాకా తాగునీటి కోసం ఉపయోగించాల్సి ఉంటుందని వివరించింది.



మరో 13 చోట్ల టెలీమెట్రీ..

కృష్ణా జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేలా, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో తేడాలు రాకుండా టెలీమెట్రీ పరికరాలను అమర్చనున్న విషయం తెలిసిందే. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల సహా ప్రధాన ప్రాజెక్టుల వద్ద 18 చోట్ల టెలీమెట్రీ పరికరాలను అమర్చేందుకు ఇప్పటికే కసరత్తు చేస్తున్న కృష్ణా బోర్డు... రెండో విడతగా మరో 13 చోట్ల వాటిని అమర్చాలని ప్రతిపాదించింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, కృష్ణా డెల్టా కింద టెలీమెట్రీ పరికరాలను అమర్చాలని సూచిస్తూ మరో లేఖ రాసింది. ఇందులో పులిచింతల డ్యామ్, పులిచింతల డౌన్  స్ట్రీమ్, మున్నేరు పరీవాహకం, ప్రకాశం బ్యారేజీ, డౌన్ స్ట్రీమ్, కృష్ణా కుడి, ఎడమ కాల్వలు, గుంటూరు చానల్, పోలవరం రైట్‌ మెయిన్  కెనాల్, పాలేరు, మూసీ పరీవాహకం, నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ల కింద పరికరాలను అమర్చాలని భావిస్తున్నామని.. గత వారం కృష్ణా డెల్టా, ప్రకాశం బ్యారేజీ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపింది.



అధికంగా వాడుకున్నారు..

ఇక 2016–17లో ఇరు రాష్ట్రాల నీటి వినియోగంపైనా బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మరో లేఖ రాసినట్లు తెలిసింది. తాము చేసిన కేటాయింపుల కంటే సాగర్, శ్రీశైలంలో ఇరు రాష్ట్రాలు అధిక వాటా వినియోగించుకున్నాయని అందులో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు గతంలో కృష్ణాబోర్డు చేసిన నీటి కేటాయింపులు జనవరి 20 వరకే ఉన్న నేపథ్యంలో.. తర్వాతి నీటి అవసరాలను నిర్ణయించేందుకు, టెలీమెట్రీ నిధుల విడుదల అంశాలను చర్చించేందుకు సంక్రాంతి తర్వాత బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top