‘గ్రేటర్‌’లో కుంభవృష్టి

The highest rainfall in Madapur

మాదాపూర్‌లో అత్యధికంగా 8.1 సెంటీమీటర్ల వర్షపాతం

రాగల 24 గంటల్లో భారీవర్షాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో శుక్రవారం కుంభవృష్టి కురిసింది. దట్టమైన క్యుములోనింబస్, నింబోస్ట్రేటస్‌ మేఘాలు భూ ఉపరితలానికి కేవలం 0.9 కిలోమీటర్ల సమీపానికి రావడంతో పలు ప్రాంతాల్లో సాయంత్రం ఐదింటికే కారుచీకట్లు అలుముకున్నాయి. అనంతరం పలుచోట్ల రాత్రి పొద్దుపోయే వరకు జడివాన కురిసింది. దాంతో నాలాలు ఉప్పొంగాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు లోతట్టు ప్రాంతాలవాసులు అవస్థలు పడ్డారు.

వర్ష బీభత్సానికి ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై నడుములోతున వరదనీరు పోటెత్తింది. రాత్రి 7 గంటల వరకు మాదాపూర్‌లో అత్యధికంగా 8.1 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. భారీవర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్‌ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలిచ్చింది.

మాదాపూర్, గచ్చి బౌలి, రాయదుర్గం, అబిడ్స్, కోఠి, గోషామహల్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్‌పురా, బహదూ ర్‌పురా, గండిపేట, నార్సింగి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయ దుర్గం ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. పండగవేళ ఊళ్లకు వెళ్లేందుకు బయలుదేరిన వేలాది మంది గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. హైవేలపై వాన నీటిలో వాహనాలు భారంగా ముందుకు కదిలాయి.

Read latest Hyderabad City News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top