బివేర్‌ ఆఫ్‌ ఫిల్టర్‌ న్యూస్‌!

Vardhelli Murali Guest Column - Sakshi

బహుపరాక్‌!
ఇందుమూలముగా యావన్మంది తెలుగు ప్రజ లకు, మిక్కిలి విశేషించి ఆంధ్రప్రదేశ్‌ వాస్తవ్యులకు చేయంగల విన్నపముతో కూడిన హెచ్చరిక. పూర్వ కాలములో కలరా, మశూచి, ప్లేగు వంటి వ్యాధులు ప్రబలిన చందంగా, ఇప్పుడు డెంగీ, చికున్‌గున్యా వగైరా గాలిరోగాలు, అంటురోగాలు వ్యాపిస్తున్న తీరుగా, వాటి కంటే వేగంగా, ప్రమాదకరంగా ఇప్పుడు ‘ఫిల్టర్‌ వార్తల’ మహమ్మారి దేశాన్ని చుట్టబెడుతున్నది. మిగతా దేశంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలకు సంబంధించి ఈ వ్యాధి ప్రమాదకర స్థాయిలో ప్రయాణిస్తున్నది. సుప్ర సిద్ధ అమెరికన్‌ తత్వవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి నోమ్‌ చామ్‌స్కీ దాదాపు మూడు దశాబ్దాలకు పూర్వం ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. అదే మాన్యుఫ్యాక్చ రింగ్‌ ఆఫ్‌ కన్సెంట్‌ (manufacturing of consent). అప్పటి ప్రసార సాధనాలు ప్రభుత్వాలకు అనుకూలం గానో, లేదా కొన్ని వ్యవస్థలకు అనుకూలంగానో ప్రజా భిప్రాయాన్ని మలచడానికి వ్యవహరిస్తున్న తీరును వర్ణిస్తూ ‘ప్రసార మాధ్యమాలు ప్రజల అంగీకారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయ’నే నిర్ధారణకు ఆయన వచ్చారు. వార్తలనూ విశేషాలనూ ఐదు రకాల ఫిల్టర్ల ద్వారా వడ బోసి ప్రజలకు అందజేస్తున్నాయని ఆయన నిరూపిం చారు. ఇప్పుడా విద్యను గొప్ప కళాత్మకంగా ఆంధ్రప్రదే శ్‌లో అభివృద్ధి చేసిన ఘనత మాత్రం తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అమెరికాలో ఫిల్టర్‌ న్యూస్‌ బండా రాన్ని నోమ్‌ చామ్‌స్కీ బయటపెట్టే నాటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ దానిని ఆచరణలో పెట్టింది. బీజేపీ వంటి జాతీయ పార్టీ కూడా తెలుగుదేశం స్ఫూర్తి తోనే ఆ విద్య నేర్చుకుని ఇప్పుడు జాతీయ స్థాయిలో తనదైన శైలిలో జనసమ్మతిని ఉత్పత్తి చేసే కార్యక్రమం అమలు చేస్తున్నదని అభిజ్ఞులు చెబుతారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటినుంచీ ప్రసార మాధ్యమాలు తెలుగుదేశం పార్టీ రంగును అది పుట్టినప్పటినుంచీ పులుముకున్నాయి. తెలుగు పత్రికల సంఖ్యలోనూ, వార్తా చానళ్లలోనూ, ఇంటర్నెట్‌ ఎడిషన్లలోనూ భీముని వాటా తెలుగుదేశం పార్టీదే. ప్రసార సాధనాలు ఉత్పత్తి చేసిన ప్రజాభిప్రాయం ఆధారంగానే మనుగడ సాగిం చిన అనుభవం కారణంగా, సోషల్‌ మీడియా విప్లవాన్ని కూడా అందరికంటే ముందుగానే ఆ పార్టీ అందిపు చ్చుకుంది. వందలాదిమంది పనిచేసే ఒక కార్ఖానానే తెరిచి ‘ఫిల్టర్‌’ న్యూస్‌ ప్రచార కార్యక్రమాన్ని ఆ పార్టీ చేపట్టినట్టు భోగట్టా. మొన్నటి ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్‌సభ సీట్లు గెలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకీ – 23 అసెంబ్లీ సీట్లూ, 3 లోక్‌సభ సీట్లూ గెలిచిన తెలుగుదేశం పార్టీకి ఏ నిష్పత్తిలో ప్రసార సాధనాల్లో ప్రచారం లభిస్తుందో చూస్తే చాలు. యెల్లో ఫిల్టర్ల ప్రభావం మన మీడియా మీద ఎంతుందో చెప్పవచ్చు. జరిగింది జరగనట్టుగా, జరగనిది జరిగినట్టుగా చూప గలిగే ఫిల్టర్లనూ వాడుతున్నారు. వాస్తవాలను 180 డిగ్రీల కోణంలో చూపే ఫిల్టర్లు తెలుగు మీడియాలో సర్వసాధారణం. తొలిపొద్దు సిగలో పూచిన సిందూర వర్ణాన్ని ఆకాశంలో జరిగిన రక్తపాతంగా ఈ ఫిల్టర్లు చూపగలవు. చినుకు తడికి పులకించిన మృత్తిక వెలు వరించే సుగంధ పరిమళాన్ని దుర్గంధంగా వ్యాప్తి చేయ గల ప్రతిభ ఈ ఫిల్టర్ల సొంతం.

ఒకసారి నిన్నటి కరకట్ట సీన్‌ సంగతి చూద్దాం. హరిశ్చంద్ర నాటకంలో ‘కాటికాపరి’ సీన్‌ స్థాయిలో రక్తికట్టించేందుకు తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నం, అందుకు అవిశ్రాంతంగా తోడ్పాటునందించిన మీడియా ఫిల్టర్‌ న్యూస్‌ వల్ల అసలు దోషి అటకెక్కి దాక్కోగలి గాడు. హరిశ్చంద్ర నాటకంలోనే ఒక పద్యం ఉంటుంది. విధి ఎంత బలీయమైనదో వర్ణిస్తూ ‘రాజే కింకరుడ గున్‌... కింకరుడే రాజగున్‌’ అంటూ కొండంత రాగంతో హరిశ్చంద్రుడు ఆలపిస్తాడు. నిన్నటి కరకట్ట సీన్, అందులో మీడియా పోషించిన పాత్ర చూసిన తర్వాత ‘ఔరా... మీడియా ఎంత బలీయమైనది? రాజే కింకరు డాయెను... కింకరుడే రాజాయెను’ అనే రాగం అందుకో వలసిన పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ కనుమలతోపాటు, కర్ణాటక, మహారాష్ట్రలలో కురిసిన భారీ వర్షాల పుణ్యమా అని పదేళ్ల తర్వాత బిరబిరా కదిలేటి నిండైన కృష్ణవేణిని చూడగలిగాము. ఈ సందర్భంగా ప్రధాన వార్తాంశం కావలసిన విషయం మన ఇంజనీర్లు, అధికారులు పోషించిన అద్భుతమైన పాత్ర. రెండు రాష్ట్రాలూ సమ న్వయంతో వరదను నియంత్రించిన తీరు ప్రశంస నీయం. వరద కారణంగా ఎక్కడా భారీ నష్టాలు కలుగ కుండా ఒకపక్క జాగ్రత్త పడుతూనే, వరదనీటిని గరిష్ట స్థాయిలో ఒడిసిపట్టడంకోసం వ్యూహాత్మకంగా వ్యవహ రించారు.

శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ క్రస్ట్‌ లెవల్‌ 840 అడుగుల వద్ద ఉంది. 854 అడుగులకు నీరు చేరితేనే రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లివ్వడం కుదురు తుంది. ఆగస్టు ఆరో తేదీనాడు నీటిమట్టం ఆ ఎత్తుకు చేరింది. అదేరోజున హంద్రీ–నీవా కాలువకు మల్యాల లిఫ్ట్‌ ద్వారా నీరందించారు. ఏడో తేదీ నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా తెలుగుగంగ, ఎస్సార్‌బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 860 అడుగులకు చేరగానే విద్యుదుత్పత్తి చేస్తూ ఆరో తేదీనుంచే నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. నాగార్జునసాగర్‌ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. 510 అడుగుల మట్టాన్ని దాటితేనే కుడి, ఎడమ కాల్వలకు నీళ్లిచ్చే పరిస్థితి ఉంటుంది. ఆగస్టు ఎనిమిదో తేదీనాడు వరద అక్కడిదాకా వచ్చింది. ఎన్నో ఏళ్లుగా సాగర్‌ నీళ్లకోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న రైతులకోసం రెండు కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తూనే పైనుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని సాగర్‌ గేట్లను తెరిచారు. పులిచింతల దిగువన ముంపు సమస్య పెరగకుండా నియంత్రిస్తూనే తొలిసారిగా భవిష్యత్తు అవసరాలకోసం ఆ ప్రాజెక్టులో సుమారు 30 టీఎమ్‌సీలను నిలబెట్టే విధంగా చాక చక్యంగా వ్యవహరించారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రవాహం లెక్కలు తెప్పించుకుంటూ ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన వున్న పరిస్థితులను అంచనా వేసు కుని ముంపు ప్రాంత ప్రజలకు రక్షణ ఏర్పాట్లు చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు నిర్వహించిన చురుకైన పాత్ర మీడియాలో ప్రధానాంశం కావలసింది. కానీ ఈ కోణాన్ని పూర్తిగా విస్మరించిన మీడియా, వరద పరి స్థితిని చిత్రీకరిస్తున్న డ్రోన్‌ కెమెరాపై తెలుగుదేశం పార్టీ ప్రదర్శించిన కరకట్ట వీధి నాటకాన్ని రోజంతా అలుపు లేకుండా చూపెట్టింది. ఆ డ్రోన్‌ కెమెరా చంద్రబాబు ఇంటి సమీపంలో కూడా ఎగిరిందట. అదీ రాద్ధాంతం. నదిలో వరద పరిస్థితిని ఫోటోలు తీస్తున్న డ్రోన్, నది అంచున ఇళ్ల ముందు ఎగరదా మరి? చంద్రబాబు నివసించే ఇంటితోపాటు మరో 32 అక్రమ నిర్మాణాలు అక్కడున్నాయని చెబుతున్నారు. ఆ ఇళ్ల ముందునుంచి కూడా డ్రోన్‌ వెళ్లే వుంటుంది. ఈ ఒక్క సాకుతో చంద్ర బాబు ఇంటిపై దాడి చేసేందుకు కుట్ర జరుగుతోందనే స్థాయిలో ఓ దృశ్యమాలికను తెలుగుదేశం పార్టీ రచిం చడం, ‘నా భద్రతనే ప్రశ్నార్థకం చేస్తారా’ అని పార్టీ అధ్య క్షుడు చంద్రబాబు ఆక్రోశించడం మీడియాలో ప్రధానాం శాలయ్యాయి. ప్రభుత్వం కావాలనే తన ఇంటిపైకి వర దను పురికొల్పిందనే మరో విచిత్రమైన ఆరోపణను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేశారు. రెయిన్‌ గన్‌లతో కరువును జయించే సాంకేతిక సామర్థ్యం, తరుముకొచ్చే తుపానులను ఆగిపొమ్మని ఆదేశించే తపోబలం అంద రికీ ఉండదు. అలాగే, ఒక ఇంటిమీద దాడికోసం వర దను మళ్లించడం కూడా అందరికీ సాధ్యమయ్యే పని కాదు.

లక్షలాది మంది రాయలసీమ రైతులకు నీళ్లివ్వ కుండా వారి కడుపుకొట్టి సాగర్‌ ఆయకట్టు రైతులను ఎండబెట్టి తన అక్రమ నివాసాన్ని కాపాడే చర్యలను ప్రభుత్వం చేపట్టి ఉండాలన్నది చంద్రబాబు ఆవేదన సారాంశంగా కనిపిస్తున్నది. ఆయన ఆవేదనను రాష్ట్ర ప్రజలందరూ పంచుకోవాలన్న రీతిలో మీడియా ఫిల్టర్లు పనిచేశాయి. కానీ, ఆయన వుంటున్నది అక్రమ నిర్మా ణమనీ, ఆమేరకు రివర్‌ కన్సర్వేషన్‌ అథారిటీ నోటీసులు కూడా ఇచ్చిందనీ, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌దీ అదే అభిప్రాయమనీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటు వంటి నివాసంలో ఉండటం తగదని ఏ మీడియాలోనూ పొర పాటున కూడా రాలేదు. ప్రకాశం బ్యారేజీ గుండా ఎని మిది లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళ్తున్న ఈ స్థితిలో రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురిసి వైరా, మున్నేరు, బుడమేరు, కొండవీటి వాగులు కూడా ఉగ్ర రూపం దాలిస్తే పరిస్థితేమిటి? కరకట్టే కాదు, ఆయన కట్టాల నుకున్న రాజధాని ప్రాంతం కూడా వరద ముంపులో ఉండేది. ఫిల్టర్‌ న్యూస్‌కు ఈ కరకట్ట సీన్‌ ఒక తాజా ఉదాహరణ మాత్రమే. రెండున్నర మాసాల వయసున్న కొత్త ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇలాంటివెన్నో ఫిల్టర్లను ఇప్పటికే మన మీడియా వాడేసింది. అందులో రాజధాని చుట్టుపక్కల భూముల ధరలు ఢమాల్‌మన్నా యని, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందనీ దీర్ఘాలు తీస్తూ ఈమధ్యనే ఒక వార్తను వదిలారు. ప్రపంచంలోనే కనీ వినీ ఎరుగని స్థాయి భారీ స్కామ్‌ బయటకు కనపడ కుండా దాచేసే కుట్ర ఈ కథనం వెనుక అసలు కథ. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలివ్వాలని చేసిన చట్టంపై కూడా చిత్తశుద్ధిలేని వ్యతిరేక ప్రచారం గుప్పించారు. ఆస్థాన రచయితలను ప్రయోగించి జాతీయ వార్తా పత్రికల్లో కూడా వ్యతిరేక చర్చకు తెరలే పారు. కానీ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని మాత్రం సౌకర్యవంతంగా మరిచిపోతు న్నారు. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండని బొట్టు పెట్టి మరీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేదీ, సకల సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్రాలు పోటీపడి మరీ హామీలు ఇచ్చేదీ ఎందుకోసం? స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకా లేక ప్రభుత్వ పెద్దలు ముడుపులు మింగేం దుకా? ఈ ప్రశ్న మన మీడియాలో ఉత్పన్నం కాదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడొక కొత్తచరిత్ర చిగురు తొడు గుతున్నది. పేద బతుకుల్లో చిచ్చుపెడుతున్న మద్యం రక్కసిపై యుద్ధంలో తొలిఅడుగు పడింది. కనీవినీ ఎరు గని విధంగా ఒకేసారి నాలుగు లక్షల ఉద్యోగాలకు అభ్య ర్థుల ఎంపిక ప్రారంభమైంది. నిరుపేద కుటుంబాలకు కూడా విద్యకు, వైద్యానికి ధీమా ఏర్పడింది. ప్రైవేట్‌ పాఠశాలలను మించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగింది. రైతుకు భరోసా దొరికింది. 12 వేల ప్రభుత్వ పాఠశాలలు ఈ సంవత్సరం అన్ని హంగులతో కూడిన కొత్త రంగులను ధరించబోతున్నవి. ఇవేవీ కూడా మీడియా వార్తల్లో కాగడా వేసి చూసినా కనిపించే పరి స్థితి లేదు. ఫిల్టర్‌ న్యూస్‌ సమాజానికి హానికరం అనే అవగాహనకు ప్రజలు రావలసిన పరిస్థితి ఏర్పడింది. సత్యాన్వేషులు హంసల వలె నీర, క్షీర న్యాయ నేర్పరులు కావలసిన అగత్యం ఏర్పడింది.


వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top