ఒక వసంత మేఘం!

Vardhelli Murali Article On TDP Behavior In AP Assembly - Sakshi

జనతంత్రం

అలవిమాలిన అసూయ ఎల్లప్పుడూ స్వీయ విధ్వంసానికే దారి తీస్తుంది. యుగాలు మారినా, కాలాలు మారినా ఈ సత్యం ఎప్పటికప్పుడు నిరూపణ అవుతూనే వుంది. సందర్భం... ధర్మరాజు నిర్వహించిన రాజసూయం కావచ్చు, నేటి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కావచ్చు. మనసంతా అసూయతో ముప్పిరి గొన్నప్పుడు ప్రత్యర్థి ఔన్నత్యాన్ని గుర్తించడం సాధ్యం కాదు. నిప్పులాంటి నిజాలు కనిపించవు. హితోక్తులు చెవికెక్కవు. ధర్మాధర్మ వివేచన పనిచేయదు. ప్రజాస్వామ్య పరంపరలో ప్రజలు ఒక పార్టీకి అధికారాన్ని అప్పగిస్తారు. ఒక పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెడతారు. అధికారంలో వున్న పార్టీ చట్టాలను చేయడానికి కొన్ని అంశాలను బిల్లుల రూపంలో సభ ముందుకు తెస్తుంది. వాటిని ప్రతిపక్షం వ్యతిరేకించవచ్చు. సమర్థించనూవచ్చు. సవరణలు ప్రతిపాదించవచ్చు. కానీ, ఆ బిల్లుల గురించి మాట్లాడటానికే ఇష్టపడకుండా అసందర్భ విషయాల ప్రస్తావనతో అడ్డుకునే ప్రయత్నాలను ఏమనాలి? నిలువెల్లా దహించుకుపోయే అసూయకు నిదర్శనంగా ఈ వైఖరి కనిపించదా?

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అధికారంలో వుంది. ఎన్నికలకు ముందు ప్రజలకు కొన్ని వాగ్దానాలను చేస్తూ ఆ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఈ మేనిఫెస్టో తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లతో సమానమని ఎన్నికల సభల్లో స్వయంగా వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపించారు. ఈ విజయం తమ ‘పవిత్ర గ్రంథమైన’ మేనిఫెస్టోలోని హామీలకు లభించిన విజయమని వినమ్రంగా ప్రకటించుకొని జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారాన్ని చేపట్టారు. చేసిన బాసలు ‘పవిత్రమైనవి’ కనుక, వాటిని వేగంగా అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. అధికారం చేపట్టిన నెల రోజులకే శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గణాంకాల్లోనూ, సభ ఆమోదించిన బిల్లుల సారాంశంలోనూ ‘పవిత్ర గ్రంథం’ ప్రవచనాల కార్యా చరణ ప్రతిఫలించింది. ఇది స్వాగతించవలసిన విషయం. మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం కాదనీ, అది ప్రజలకు రాసిచ్చిన ప్రామిసరీ నోటు అని, ప్రజలకు బాకీ పడిన హామీలను వడ్డీతో సహా తీర్చాల్సిందేననీ సంకల్పం చెప్పుకున్నందుకూ, ఆచరణ మొదలు పెట్టుకున్నందుకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రజా స్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ అభినందించాలి.

ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో చరిత్రాత్మకమైనవీ. గేమ్‌ ఛేంజర్స్‌ అనదగ్గవీ ఉన్నాయి. మన నిచ్చెనమెట్ల సామాజిక – ఆర్థిక వ్యవస్థలో కింది మెట్లపైనున్న కోట్లాదిమంది కష్టజీవులను కొన్ని మెట్లు పైకెక్కించి వారికి ఆర్థిక కవచాన్ని, ఆత్మగౌరవ కిరీటాన్ని తొడిగేందుకు దోహదపడే అద్భుతమైన బిల్లులను ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదించింది. సభకు జేజేలు. అవినీతిని అరికట్టి ప్రజాధనం ఖర్చు పెట్టడంలో పారదర్శకత కోసం, సమాజాన్ని కేన్సర్‌లా కబళిస్తున్న మద్యపాన వ్యసనంపై పోరాటం కోసం, లక్షలాది మంది కౌలు రైతుల కన్నీరు తుడవడం కోసం ఉద్దేశించిన బిల్లులను సభ ఆమోదించింది. ఇంత గొప్ప క్రతువులో ప్రతిపక్షం చురుగ్గా పాల్గొని వుండాల్సింది. కొన్ని ఆచరణాత్మకమైన సూచనలు ఇచ్చి వుండాల్సింది. నలభయ్యేళ్ల అనుభవాన్ని కొంచెమైనా వాడి ఉండాల్సింది. ప్రతిపక్షం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. విచక్షణా జ్ఞానాన్ని ఈర్ష్య మింగేసిందో, విప్లవాత్మకమైన మార్పులు తమ విధానాలకు వ్యతిరేకమనుకున్నారో కానీ, బిల్లులపై తమ వైఖరేమిటో మాటమాత్రంగానైనా చెప్పకపోవడం, శిఖండి పాత్ర పోషణకు సిద్ధపడటం ఆ పార్టీ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుంది. సూర్యుని తొలి కిరణం లేత బాహువులతో చీకటి గుండెల్ని చీల్చే దృశ్యాన్ని కళ్లుండీ చూడలేని అంధత్వాన్ని చరిత్ర క్షమించదు. రానున్న వర్షరుతు సంరంభాన్ని ఒక వసంత మేఘం పెనుగర్జనతో ప్రకటిస్తున్నప్పుడు చెవులుండీ వినలేని బధిరత్వానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. 

ఈ శాసనసభ 14 బిల్లులను ఆమోదించింది. అన్ని బిల్లులూ కీలకమైనవే. సామాజికంగా, ఆర్థికంగా విప్లవాత్మకమైన మార్పులకు బాటలు వేసే బిల్లులు వీటిలో వున్నాయి. ఉదాహరణకు నామినేషన్‌పై ఇచ్చే పనుల్లో 50 శాతం బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వాలన్న బిల్లుకు ఆమోదం లభించింది. అలాగే అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం పనులు ఇవ్వాలన్న మరో బిల్లును సభ ఆమోదించింది. సాధారణంగా 5 లక్షల రూపాయల్లోపు జరిగే పనులను నామినేషన్‌ పద్ధతిపై ఇస్తారు. కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవుకానీ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ. 8 వేల కోట్ల నుండి 10 వేల కోట్ల వరకు ఈ పనులు జరుగుతాయని ఒక అంచనా వుంది. పంచాయతీల్లో, మునిసిపాలిటీల్లో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులతో రోడ్లు వేసే పనుల్లో, మైనర్‌ ఇరిగేషన్‌ కింద నిర్మించే చెక్‌ డ్యామ్‌లు, కల్వర్టుల పనుల్లో ఎక్కువగా ఈ నామినేషన్‌ పనులుంటాయి. ఏటేటా ఈ పద్ధతిన వెచ్చించే మొత్తం పెరుగుతూనే వస్తోంది.

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏటా రూ. 750 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల మేరకు నామినేషన్‌ పనుల ద్వారా బలహీన వర్గాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఈ రంగంలో అనుభవం వున్నవారి అంచనా. అది వెయ్యి కోట్లయినా, అంతకు తక్కువైనా సరే ఆ మొత్తం సొమ్ము దాదాపు నూటికి నూరు శాతం అదే ప్రాంతంలో చలామణిలోకి వచ్చి మరిన్ని వస్తు, సేవల క్రయవిక్రయాలకు దోహదం చేసి మరింతమంది జీవనోపాధిని మెరుగుపర్చుతుంది. కొంచెం పెద్దస్థాయి వున్న వాళ్లు ఈ పనుల్లో ఆర్జించే మొత్తం పూర్తిగా అక్కడే చలామణిలోకి వచ్చే అవకాశం తక్కువ. చేతిలో మిగులు వున్నప్పుడు పట్టణాల రియల్‌ ఎస్టేట్‌లోకి కొంత వెళ్తుంది. లేదా వ్యవసాయ భూములను కొని నిరుపయోగంగా పెట్టడానికి ఉపకరిస్తుంది.

నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బలహీన వర్గాలకూ, ఈ పదవుల్లోని అన్ని కేటగిరీల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ మరొక బిల్లునూ, దేవాలయ పాలక మండళ్లలో 50 శాతం పదవులను బలహీన వర్గాలకు కేటాయిస్తూ ఇంకో బిల్లునూ శాసనసభ ఆమోదించింది. సుమారు 5 వేల దేవాలయాలకు పాలక  మండళ్లను నియమిస్తారు. ఒక్కో దేవాలయానికి పదిమంది చొప్పున 50 వేల మందికి అవకాశం లభిస్తే అందులో 25 వేల మంది బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీలే వుంటారు. విశ్వవిద్యాలయాల పాలకమండళ్లు, మార్క్‌ఫెడ్‌ ఆగ్రోస్‌ లాంటి అనేక రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీలు వగైరాల్లో మరికొన్ని వేల నామినేటెడ్‌ పదవులు లభిస్తాయి. ఈ పదవుల వల్ల ఒక సామాజిక గుర్తింపు, గౌరవం పేదవర్గాల ప్రజలకు దక్కుతుంది. ఆర్థిక ఆలంబనతో పాటు ఆత్మగౌరవంతో కూడిన జీవిక! మహాత్మా ఫూలే, బాబాసాహెబ్‌ అంబేద్కర్, శ్రీనారాయణగురుల ఆలోచనలకు ఈ బిల్లులు అద్దం పట్టాయి.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు దశలవారీ మద్య నిషేధంలో భాగంగా మద్యనియంత్రణ చట్టసవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. మద్యం దుకాణాలు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో వున్న కారణంగా విచ్చలవిడి లాభాల కోసం యథేచ్ఛగా బెల్టు షాపులు నిర్వహించి, ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయించి పేదప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఇకమీదట ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తుంది. ఫలితంగా బెల్టు షాపులు ఉండే అవకాశం వుండదు. వేళాపాళా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించే వీలుండదు. మద్యం డోర్‌ డెలివరీలు ఇక మీదట కుదరవు. మద్యపానం కొంత మేర నియంత్రణలోకి వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం మద్యపాన మహమ్మారి ప్రమాదకర స్థాయిని దాటి నర్తిస్తోంది. మద్యానికి బానిసలై, ఆరోగ్యం క్షీణించి లక్షలాదిమంది జీవచ్ఛవాలుగా ఏ పనీ చేయలేకుండా మహిళల కష్టార్జితం మీద గడిపేస్తున్నారు. అకాల వైధవ్యం ప్రాప్తించి సంసారభారం మోయలేక తల్లడిల్లుతున్న ఆడబిడ్డలు ఏ పల్లెకు వెళ్లినా కనిపిస్తున్నారు.

గడిచిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం విక్రయాల ద్వారా ఆర్జించిన మొత్తం రూ. 20 వేల కోట్లు. ఎక్కువ రేట్లకు అమ్మడం, కల్తీ వంటి కారణాల రీత్యా ఈ మద్యం కొనుగోలుకు యాభై శాతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కనీసం రూ.30 వేల కోట్లు మద్యంపై ఈ ఒక్క సంవత్సరం ప్రజలు వెచ్చించారు. ఇందులో చీప్‌ లిక్కర్‌ వాటా 40 శాతం. అంటే 12 వేల కోట్లు కేవలం రెక్కల కష్టంపై బతికే బడుగుజీవులు మద్యంపై ఖర్చుపెట్టారు. లోకల్‌ మేడ్‌ నాటు సరుకు కోసం వెచ్చిస్తున్న సొమ్ము అదనంగా మరో వెయ్యి కోట్లయినా వుంటుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అదే సంవత్సరం రాష్ట్రం మొత్తంగా కూలీలకు ప్రభుత్వం చెల్లించిన సొమ్ము 4900 కోట్లు. ఇంతకు దాదాపు మూడు రెట్లు పేదప్రజలు తాగుడుపై తగలేస్తున్నారు. మద్యం అందుబాటులో లేకుండా చేయడం వలన ఆ మేరకు వారి కుటుంబాల ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. అభివృద్ధిని కాంక్షించే ప్రజలందరూ ముక్తకంఠంతో మద్దతు తెలిపి స్వాగతిం చాల్సిన బిల్లు ఇది.

రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. పరిశ్రమల్లో స్థానిక ఉద్యోగావకాశాలు కల్పించాలనేది న్యాయమైన డిమాండ్‌. ఒక పరిశ్రమకవసరమైన భూమిని స్థానికులు త్యాగం చేస్తారు. పరిశ్రమ స్వభావాన్ని బట్టి అది వెదజల్లే జల వాయుకాలుష్యాలనూ భరిస్తారు. ‘ప్రాణ వాయువు’ను కోల్పోతున్న వాడికి ఉపాధి కల్పించడం కనీస ధర్మం. వలసలను అరికట్టి పట్టణాల మీద భారాన్ని తగ్గించడంలో ఈ రిజర్వేషన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. ఏపీ మౌలిక సదుపాయాలు (ముందస్తు న్యాయపరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లు – 2019ని కూడా అసెంబ్లీ ఆమోదించింది. అవినీతికి కళ్లెం వేసి సమాజంలో గుణాత్మక మార్పునకు దోహదం చేసే బిల్లు ఇది. వేలకోట్ల రూపాయల వ్యయంతో జరిగే కాంట్రాక్టు పనుల్లో సగానికి సగం ప్రజాధనం అవినీతిపరుల జేబుల్లోకి వెళ్తున్న విషయం ఇప్పుడు జగమెరిగిన సత్యం. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ పూర్తి పారదర్శకతను ఈ బిల్లు తీసుకొస్తుంది. వందకోట్లు, అంతకంటే ఎక్కువ విలువైన పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడానికంటే ముందుగానే సంబంధిత డాక్యుమెంట్‌ను న్యాయపరిశీలన కోసం న్యాయమూర్తికి పంపిస్తారు. ప్రజల నుంచి కూడా సలహాలూ, సూచనలు స్వీకరించిన అనంతరం నిపుణుల బృందం సాయంతో న్యాయమూర్తి సమీక్షించి అవసరమైన మార్పులు సూచిస్తారు. వారు సూచించిన మార్పులతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. ఇంతటి పారదర్శక విధానం దేశచరిత్రలోనే ఇది మొదటిసారి.

విప్లవాత్మక బిల్లులు శాసనసభలో పురుడుపోసుకుంటున్న సమయంలోనే గ్రామ సెక్రటేరియట్‌లలో నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అంతకు ముందే విలేజ్‌ వలంటీర్ల నోటిఫికేషన్‌ వెలువడింది. రెండూ కలిపి రమారమి నాలుగు లక్షల ఉద్యోగాలు. గ్రామాల్లో సందడే సందడి. ఇప్పటికే ప్రజలను విశేషంగా ఆకర్షించిన నవరత్న పథకాల అమలుకు సంబంధించిన తేదీలు కూడా విడుదలయ్యాయి. కేవలం రెండు మాసాలలోపు వయసున్న ప్రభుత్వం సాధించిన ఘనత ఇది. రాబోయే రోజుల్లో ఒక కొత్త క్రాంతి ఉద్యమం రాష్ట్రాన్ని చుట్టివేయబోతోంది. ఊరూరా తోరణాలు కట్టి కొత్త చట్టాలను స్వాగతించండి. శరన్నవరాత్రులను ‘నవరత్న’ దీపాలతో వెలిగించండి. చేయిచేయి కలిపితే సాధించే విజయానికి ఆకాశమే హద్దు. ఇప్పటికైనా ప్రతిపక్షం మనసు మార్చుకుని సామాజిక పురోగతికి సహకరించాలి. పాండునందనుల ‘రాజసూయ’ వైభవాన్ని చూసి అసూయగ్రస్థుడైన సుయోధనుడు ఏం సాధించగలిగాడు? తాత్కాలికంగా ‘పాచికలు’ విసిరి కొంతకాలంపాటు పాండవులను అడవికి పంపగలిగాడు. కానీ, అంతిమంగా కురువంశం వినాశనానికి తానే కారకుడయ్యాడు. ఏ యుగానికైనా, ఏ కాలానికైనా ఇదే కథ వర్తిస్తుంది.

వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top