ఆ పిలుపు ఆప్యాయత మేలుకొలుపు

Special Story On YS Rajasekhar Reddy By AP Vittal - Sakshi

విశ్లేషణ

ప్రతి బహిరంగ సభలోనూ రాజశేఖరరెడ్డి, ‘‘నమస్తే అన్నా, నమస్తే అక్కా, నమస్తే తమ్ముడూ–నమస్తే చెల్లెమ్మా’’ అని గాలిలో చేయి ఊపుతూ సంబోధిస్తే, ఆ పిలుపులో ఆప్యాయత, అభిమానం కళ్లారా చూసే జనమంతా సంతోషంతో చప్పట్లు కొట్టేవారు. ప్రత్యేకించి ఆ పిలుపు వైఎస్‌ హృదయం నుంచి వచ్చినట్లుండేది! చంద్రబాబు అలా సహజంగా ఓ మామూలు మనిషిలా స్పందించడం చూశామా? వైఎస్సార్‌ నూటికి నూరు పాళ్లు మనలాంటి మనిషి . ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ‘మనీషి’గా ఎదిగారు. చంద్రబాబు అందుకు పూర్తి వ్యతిరేకం. ఆయనలో ఒక ‘రోబో’ కనిపిస్తాడు. అక్కడ మానవ సహజ ఆత్మీయతలకు తావు లేదు. కృత్రిమత్వమే ఆయన ధోరణి!

‘‘ఇలలోన ఏది కష్ట సాధ్యమ్ము సుమ్ము? మనిషి మనిషగుట కన్న’’ అన్నాడు గాలీబ్‌! ‘మనిషి’ కాలేనివాడు మంత్రి కాలేడు! మహా నేత కాలేడు. మార్క్సిస్టు కార్యకర్త కాలేడు. ఆ నిర్వ చనానికి అర్హుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని నాకనిపిం చిన సందర్భం ఇది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ ఓ రోజు ఆదివాసీ బాలికల హాస్టల్‌ చూసేందుకు తన పర్యటనలో భాగంగా భద్రాచలం వెళ్లారు. నాటి పత్రి కల్లో ఫోటో సహా ఈ వార్త వచ్చింది. హాస్టల్లో ఏడె నిమిదేళ్ల పాప వైఎస్‌ఆర్‌ దగ్గరకు వచ్చి, ‘అంకుల్‌’ అంటూ ఏదో చెప్పబోయింది. వెంటనే ఆయన కుర్చీ లోంచి లేచి ‘అమ్మా! అంకుల్‌ కాదు, తాత. తాత అను నన్ను’’ అని ఆ అమ్మాయిని ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఆ దృశ్యం ఎంతో హృద్యంగా ఉండడమే కాదు, వైఎస్‌ మనీషి అని కూడా చెబుతోంది.

నేటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నుంచి ఇలాంటì  మాటలు అసలు ఊహించగలమా? సింగపూర్‌లో సూటూ బూటూ వేసుకున్న పెద్ద పారిశ్రామికవేత్తలతో నవ్వుతూ మాట్లాడుతున్న చంద్రబాబును మీడియాలో చూస్తు న్నాం! ఆయన దృష్టిలో వారే గౌరవాభిమానాలు చూపదగిన, తన హోదాకు సరితూగగల వ్యక్తులు. ‘ఆఫ్ట్రాల్‌! చేపలు పట్టుకునే మత్స్యకారులేం మనుషులు? వారితో ఏం మాట్లాడినా ఏమవు తుంది?’ అనే అభిప్రాయంతో చంద్రబాబు ఇటీవ ల–తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారిని అంత దూరానే నిలబెట్టారు. అంతేకాదు, ‘‘నాకు అన్నీ తెలుసు. మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టి పంపారో కూడా తెలుసు. ఏంటి మీరు చెప్పేది? మీ హద్దులు దాటి మాట్లాడితే తాట తీస్తాను’’ అని ఆగ్రహంతో అన్నారు చంద్రబాబు.

అంతేనా? ఇటీవలే క్షురక వృత్తిలో ఉండే నాయీ బ్రాహ్మణులు తిరుమల తిరు పతి దేవస్థానంలో తమకు జరిగిన అన్యాయం చెప్పు కునేందుకు తన సచివాలయానికి వస్తే, అంత దూరం నుంచే వారిని చూసిన ముఖ్యమంత్రి ఆగ్రహోదగ్రులయ్యారు. వెంటనే ఆవేశంతో కారు దిగి వచ్చి, ‘‘ నా సచివాలయానికి, నా ఇంటికే వస్తారా? ఎన్ని గుండెలు మీకు? మీతో మాటలేమిటి? అధిక ప్రసంగం చేస్తే, మీ అంతు చూస్తాను. సచివాలయం దేవాలయం వంటిది. ఎక్కడ పడితే అక్కడకు రావడమేనా?’’ అని విసురుగా వెళ్లిపోయారు.

ముఖ్య మంత్రి చంద్రబాబే అలా ఉంటే ఇక మామూలు మంత్రుల సంగతి ఏం చెప్పుకోవాలి? తనకు అసెంబ్లీ టికెట్‌ ఇచ్చిన వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశంలో చేరి, నిర్లజ్జగా మంత్రి పదవి తీసుకున్న రాయలసీమ నేత సి.ఆదినారాయణరెడ్డి ఓ సందర్భంలో దళితుల గురించి మాట్లాడుతూ, ‘వారు చదువుకోరు. వారు శుభ్రంగా ఉండరు. స్నానాలు చేయరు’ అంటూ బహిరంగంగానే వారిని కించప రచడం చూశాం.

వైఎస్‌ పిలుపులో ఆప్యాయత, అభిమానం!
ప్రతి బహిరంగ సభలోనూ రాజశేఖరరెడ్డి, ‘‘నమస్తే అన్నా, నమస్తే అక్కా, నమస్తే తమ్ముడూ–నమస్తే చెల్లెమ్మా,’’ అని గాలిలో చేయి ఊపుతూ సంబోధిస్తే, ఆ పిలుపులో ఆప్యాయత, అభిమానం కళ్లారా చూసే జనమంతా సంతోషంతో చప్పట్లు కొట్టేవారు. ప్రత్యే కించి ఆ పిలుపు వైఎస్‌ హృదయం నుంచి వచ్చిన ట్లుండేది! ఇప్పటి సీఎం చంద్రబాబు తన సభల్లో మహిళలే లేనట్టు ప్రసంగంలో, ‘‘ ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించి, ఆయనకు ఎదురు నిలిచిన నేతను నేనే కదా! అవునా, కాదా? తమ్ముళ్లూ, గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి’’ అని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవడం మనం తరచు టెలివిజన్‌లో వీక్షి స్తున్న దృశ్యమే.

ఆయన ఎక్కడకు పోయినా అక్కలు, చెల్లెళ్ల ప్రస్తావన ఉండదు. అయినా, ‘కోడలు కొడుకును కంటానంటే ఏ అత్త వద్దంటుంది!’ అన్న సామె తను (అంటే కూతురును కనకూడదన్న ఆ అత్త మన స్తత్వానికి ప్రతిబింబమే ఈ సామెత) పత్రికా విలే ఖరుల ముందు ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్ప గల చంద్రబాబు వంటి పెద్ద మనిషికి ఆడవాళ్లంటే గౌరవాభిమానాలు సరే కనీసం మర్యాద మన్ననా అయినా ఉంటాయా? వైఎస్‌ ముఖ్యమంత్రి పదవిలో ఉండగా శాసన సభలో తన సహజ ధోరణితో మాట్లాడితే, సభ్యులందరూ ఆయన వ్యంగ్యానికి స్పందించి నవ్వేవారు.

చంద్రబాబు మాత్రం తన జేబులో పర్సు ఎవరో కొట్టేసినట్టు ముఖం పెట్టుకుని కూర్చోవడం పాఠ కుల్లో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ‘‘చంద్ర బాబూ, కాస్త నవ్వవయ్యా! నవ్వడం భోగం. నవ్విం చడం యోగం. నవ్వలేకపోవడం ఒక రోగం’’ అని వైఎస్‌ నవ్వుతూ సరసమాడేవారు. ఎంతైనా వారి ద్దరూ పూర్వాశ్రమంలో అంటే కాంగ్రెస్‌ పార్టీలో మంచి మిత్రులే కదా! చంద్రబాబు అలా సహజంగా ఓ మామూలు మనిషిలా స్పందించడం చూశామా? వైఎస్‌ రాజశేఖరరెడ్డి నూటికి నూరు పాళ్లు మన లాంటి మనిషి . ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ‘మనీషి’గా ఎదిగారు. చంద్రబాబు అందుకు పూర్తి వ్యతిరేకం. ఆయనలో ఒక ‘రోబో’ కనిపిస్తాడు. అక్కడ మానవ సహజ ఆత్మీయతలకు తావు లేదు. కృత్రిమత్వమే ఆయన ధోరణి!

2009 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో నా దగ్గరకు వచ్చిన ఓ పేషెంట్‌ను నా కుతూహలం కొద్దీ, ‘‘ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?’ అని అడిగాను. ఆ పేషెంట్‌ నాకు మధుమేహ వ్యాధి గ్రస్తునిగా పరిచయం. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పాల బూతు కమిటీకో, దేనికో అధ్యక్షుడు కూడా. ‘‘ఇంకెవరు గెలుస్తారండీ! మావోడు (అంటే చంద్రబాబు నాయుడు) మహా మేధావి. ఎంత తెలి వైనవాడుగాకపోతే–ఆయన టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు లను కలుపుకుని మహా కూటమి కట్టగలడండీ! కాని, నేను ఈసారి మాత్రం వైఎస్సే గెలుస్తాడని చెబు తున్నానండీ. పేదలకు ఇళ్లు, ఆరోగ్యశ్రీ–ఇలా వైఎస్‌ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ఎంతో కొంత మేలు పొందని కుటుంబం ఏదీ మా ఊళ్లో లేదండీ.

ఆయన ఆధిపత్య కులానికి చెందినాగాని మామూలు జనం మాత్రం వైఎస్‌ను తమ ఇంట్లో మనిషిగానే అభిమానిస్తున్నారు. ఆయన మాట తప్పడు–మడమ తిప్పడు అని వాళ్ల నమ్మకం. అయితే, మా చంద్ర బాబు వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఎత్తుగడ వేసి గెలుస్తాడనే ఆశ లేకపోలేదండీ,’’ అని నిర్మొహమా టంగా చెప్పాడు.

తండ్రి సహజ లక్షణాల కలబోతే జగన్‌
వైఎస్‌ కుమారుడు జగన్‌మోహన్‌ రెడ్డి గురించి నాకంతగా తెలియదుగాని ఆయనలో తన∙తండ్రి సహజ లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆయన చేస్తున్న పాదయాత్ర గమనిస్తున్న నాలాంటి వృద్ధులకు సైతం జగన్‌పై వాత్సల్యం ఏర్పడుతోందంటే–అది వైఎస్‌ కుమారుడైనందువల్ల కాదు. వ్యక్తిగతంగా జగన్‌ ఎదుగుతున్న తీరు చూస్తుంటే గాలిబ్‌గారి ‘మనీషి’గా రూపొందుతా డన్న ఆత్మవిశ్వాసం కలుగుతోంది. వైఎస్‌ ముఖ్య మంత్రి అయ్యాక తనలో ఉన్న కోపనరం తెంచేసు కున్నట్టు చెప్పారు. ఈ  పాదయాత్ర కూడా జగన్‌ను ‘మనీషి’ స్థాయికి తీసుకెళుతోంది. ఆయన గురించి ‘మాట తప్పడు– మడమ తిప్పడు’ అన్న మాటలను ఆయన శత్రువులు సైతం కాదనలేని విషయం.

సరిగ్గా చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధం. ‘మాట మార్చడం, యూటర్న్‌లు తీసుకోవడం ఆయన స్వభావం. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం అంతా అవకాశవాదంతో, ఎప్పటికెయ్యది ప్రస్తుతమ న్నట్టు’ వ్యవహరించే సందర్భాలతో నిండిపోయింది. పదవీవ్యామోహంతో ఏదైనా చేస్తారు. 1983 జనవరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లోనే ఉండి స్వయానా మామ ఎన్‌.టి.రామారావుపైనే పోటీ చేసి గెలుస్తానని ప్రగల్భాలు పలికి, చంద్రగిరిలో తెలుగు దేశం అభ్యర్థిపై తలపడి ఓడిపోయిన నేత చంద్ర బాబు. ఓడిన తర్వాత రాత్రికి రాత్రే ప్లేటు ఫిరా యించి ఎన్టీఆర్‌కు దగ్గరయ్యారు. అప్పటి నుంచి కొంత కాలంపాటు, ‘ఎన్టీఆర్‌  దైవ సమానుడు’ అని పొగిడారు. పదవీవ్యామోహంతో 1995లో అదే ఎన్టీ ఆర్‌ను పదవి నుంచి చంద్రబాబు, ఆయన మిత్ర బృందం తొలగించిన విషయం మనకు తెలిసిన చరిత్రే.

1998 నుంచి ప్రధానిగా ఉన్న ఏబీ వాజ్‌ పాయ్‌కు మద్దతు ఇచ్చిన సమయంలో దేశానికి బీజేపీ అవసరమని చంద్రబాబు చెప్పేవారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీతో చేతులు కలపనని ఆయన బహిరంగంగా చెప్పారు. మళ్లీ 2014లో బీజే పీతోనే జత కట్టేందుకు ఆయన ఏమాత్రం వెనుకాడ లేదు. అలాగే 1990ల్లో వామపక్షాలతో కొంత కాలం కలిసి నడిచిన చంద్రబాబు తర్వాత, ‘అవి కాలం చెల్లిన పార్టీలు. నేడవి ఎందుకూ పనికిరావు,’ అని ఈసడిస్తూ మాట్లాడి తిరిగి 2009లో వారితోనే చేతులు కలిపారు. ఇలాంటి సందర్భాల్లోనే మాట మీద నిలబడలేని నేత ఇక మడమ తిప్పడమా? అంటే ఇక చెప్పనక్కర లేదు. ఏపీలో రైతులు, మహిళలు, దళితులు, మైనారిటీలు, నిరుద్యోగులకు తన తప్పుడు వాగ్దానాలతో అరచేతిలో తేనె చూపిం చారు గానీ చేసింది వాగ్దానభంగమే. రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఏపీకి ప్రత్యేక హోదాపై, ప్రత్యేక ప్యాకేజీపైనా, మోదీ గొప్పతనం గురించి కొన్నాళ్లకు మోదీ దుర్మార్గంపైనా బాబు మాట్లాడారు. పోల వరం ప్రాజెక్టుపై కూడా అనేక సందర్భాల్లో మాట మార్చారు. ఇలాంటి విన్యాసాలు ఆయన ఎన్ని చేశారో చెప్పాలంటే చర్విత చరణమే అవుతుంది.

రాబోయే ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపిస్తామని తెలుగుదేశం చెబుతోంది. రాష్ట్రంలో ఎప్పుడూ శక్తిగా లేని బీజేపీపై ఇలాంటి మాటలు విసరడం గాలిలో కత్తి తిప్పడం వంటిదే. నాలుగేళ్లు బీజేపీ నేతృత్వం లోని ఎన్డీఏతో కాపురం చేశాక బాబు దానితో తెలి విగా తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించారు. నేడు ఎన్ని కబుర్లు చెప్పినా ఆయన మళ్లీ బీజేపీతో చేతులు కలిపితే ఆశ్చర్యపోయేవారెవరూ ఉండరు. దురదృష్ట వశాత్తూ వామపక్షాలకు బలం లేదు. పవన్‌ కల్యాణ్‌ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం. వామపక్షాలు రాష్ట్రంలో బాబును ఓడించడంలోనే బీజేపీని ఓడిం చడం ఇమిడి ఉందని గ్రహిస్తే మంచిది.
వ్యాసకర్త: డాక్టర్‌ ఏపీ విఠల్‌ మార్క్సిస్టు విశ్లేషకులు

మొబైల్‌ : 98480 69720

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top