కశ్మీర్‌ సుస్థిరత బాటలో తొలి అడుగు

Special Article  On Article 370 - Sakshi

అభిప్రాయం 

ఆర్టికల్‌ 370వ అధికరణాన్ని రద్దు చేసి కశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక అధికారాలను ప్రభుత్వం తొలగించింది, స్వాతంత్య్రం సిద్ధించిన కాలం నుంచి దేశం ఎదుర్కొంటున్న కశ్మీర్‌ సమస్య తొలిగిపోయింది అనుకోవడానికి లేదు. కానీ ఇదొక ముందడుగు అని చెప్పుకోవచ్చు. 370వ అధికరణని తొలగించడం ద్వారా కశ్మీర్‌ సమస్య అంతర్గత విషయమే నని భారత్‌ ప్రపంచానికి చెప్పకనే చెప్పింది. 370వ అధికరణ తొలగించిన వెంటనే దానికి కారణాల గురించి పి–5 దేశాలకి చెప్పిన భారత్‌ తనకు వ్యతిరేకంగా ఆ దేశాల నుంచి ఒక మాట కూడా రాకుండా జాగ్రత్తపడింది. ఇక నుంచి రెండు పౌరసత్వాలు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు పోయి ఒకటే పౌరసత్వం, ఒకటే జెండా, ఒకటే రాజ్యాంగం ఉంటాయి. 

జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం– 2019 ప్రకారం ఇక నుంచి జమ్మూ కశ్మీర్‌ ప్రాంతం విధాన సభతో కూడిన  కేంద్ర పాలితప్రాంతంగా, లడఖ్‌ ప్రాంతం కేవలం కేంద్రపాలిత ప్రాంతంగా ఉండబోతుంది. ఇకపోతే జమ్మూ కశ్మీర్‌లో కొత్తగా ఏర్పడపోయే ప్రభుత్వానికి ఇంతకు ముందున్న అధికారాలు కాదు కదా.. మిగతా రాష్ట్రాలకు ఉండే అధికారాలు కూడా ఉండవు. ఇప్పుడు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి ఏదయినా సమస్య తలెత్తితే లెఫ్టినెంట్‌ గవర్నర్‌దే ఆఖరి నిర్ణయం, దీనివలన కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం పాత్ర పెరిగిపోతుంది, ఇది మంచి పరిణామమే, కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతీయులు కశ్మీరీల మనసులు గెలవడానికి ఆస్కారం ఏర్పడింది. ఇంతకు ముందున్న రాష్ట్ర ప్రభుత్వాలు కశ్మీర్‌ యువత, స్థానికులు పాకిస్తాన్‌ నుండి వచ్చే ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు అని తెలిసినా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చూసీ చూడనట్టు వది లేసారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం –2005, చదువుకునే హక్కు చట్టం–2009 లాంటి మంచి చట్టాలు ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో అమలులో లేవు, ఇక నుండి ఆ చట్టాలు అమలులోకి రావడం వలన ప్రతి ఒక్కరూ చదువుకొని మంచి మార్గాన్ని ఎన్నికకు అవకాశమేర్పడుతుంది. 

కశ్మీరులో 370వ అధికరణ వలన బాగుపడింది రాజకీయనాయకులు, వేర్పాటువాదులు తప్ప సగటు సామాన్యులు అభివృద్ధికి, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు, కశ్మీర్‌ ప్రాంతానికి చెప్పుకోదగ్గ పెట్టుబడులు గత 70 ఏళ్లలో ఒకటి కూడా రాలేదు. 370వ అధికరణ రద్దు వలన ఇక నుండి భారతీయులు ఎవరైనా కశ్మీర్‌కి వెళ్లి అక్కడ వ్యాపారం, స్థలం కొనుక్కోవడం, అక్కడే స్థిరపడిపోవడం లాంటివి చేయవచ్చు. ఇకనుంచి వ్యాపార సంస్థలు అక్కడకి వెళ్లి స్థలాలుకొని కంపెనీ పెట్టుబడులు పెట్టడం వలన స్థలాల ధరలు పెరిగి రైతులకి ఆస్తులు పెరుగుతాయి. పైగా ఆ కంపెనీలో ఉద్యోగాలు రావడం వలన నిరుద్యోగం తగ్గుతుంది.

కశ్మీరీ మహిళలు వేరే రాష్ట్ర అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అక్కడ పౌరసత్వంతో పాటు, అక్కడ ఉన్న ఆస్తులను వదులుకోవడం లాంటి వివక్షను ఎప్పటి నుండో ఎదుర్కొంటున్నారు, దానితోపాటుగా 50 ఏళ్ల క్రితం నుంచి  జమ్మూ కశ్మీర్‌లో స్థిరపడిన లక్షల మంది ఇన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలకి అర్హత లేకపోవడం లాంటి వివక్షతని ఎదుర్కొన్నారు. ఈ అధికరణం రద్దుతో వారికి ఇప్పటినుంచి న్యాయం జరగడానికి ఆస్కారం ఏర్పడింది. 

కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి,  ఎప్పటి నుంచో ఉన్న స్థాని కులు ఇక నుంచి కొత్తగా వచ్చి  స్థిరపడే వారితో సఖ్యత పెంచుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాలలో కొత్తవారితో పోటీపడటం, ప్రభుత్వ పథకాలు కొత్తగా స్థిరపడే వారికి కూడా పంచడం లాంటి విషయాలలో ఎప్పటి నుంచో ఉన్న స్థానికులకి కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. దానిని పోగొట్టాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం మీద ఉంటుంది.

కశ్మీర్‌లో పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం పోయి సగటు మనిషి అక్షరాస్యత పెరగడం, ఆరోగ్యం, జీవన విధానంలో ప్రమాణతలు పెరిగి భారతీయులతో పాటుగా అధునాతన ప్రపంచంతో పోటీపడిన రోజున కశ్మీర్‌ సమస్య తీరిపోతుంది.  
- కె. వెంకట కృష్ణారావు , వ్యాసకర్త రీసెర్చ్‌ స్కాలర్, ఐఐటీ, వారణాసి
మొబైల్‌ : 97053 69773

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top