‘యుద్ధోన్మాదానికే’ విజయమా?

Shekhar Gupta Article On BJP Election Campaign - Sakshi

జాతిహితం 

దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ భారత్‌ అత్యంత సురక్షితంగా ఉన్నదని భావించాల్సిన తరుణంలో ఓటర్లలోని అతిపెద్ద శ్రేణులను ఏమార్చడంలో మోదీ, షా జంట విజయం సాధించినట్లే కనబడుతోంది. అంధకార యుగం నుంచి భారత్‌ బయటపడిందని, కోట్లాది మన యువత విశ్వసిస్తున్న తరుణంలో, గతంలో దేశం ఎదుర్కొన్న ప్రమాదాలు ఇప్పుడు మళ్లీ చోటుచేసుకుంటున్నాయని అదే యువత నమ్మేలా చేయడంలో మోదీ షా ద్వయం విజయం సాధించినట్లే ఉంది. దేశం పాకిస్తాన్, ఉగ్రవాదం వంటి భయంకర ప్రమాదాలను ఎదుర్కొంటూండగా.. దేశాన్ని మీరు ఎవరి చేతుల్లో పెట్టదలిచారు? ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న, శక్తివంతుడైన నాయకుడి చేతుల్లోనా లేక ‘పప్పు’ చేతుల్లోనా? మీరే తేల్చుకోండి అంటూ మోదీ–షా ద్వయం చేస్తున్న ప్రచారం హిందీప్రాంత ప్రజలపై బలంగా ప్రభావం చూపుతున్నట్లుంది.

హిందీ మీడియాతో నా పయనం కొనసాగుతున్న క్రమంలో సుదూర గతానికి చెందిన పాటలు నన్ను కట్టిపడేసేవి. కవి ప్రదీప్‌ అప్పట్లో రాసిన ఒక పాట దేశంలోపలి నుంచి విద్రోహుల వల్ల కలిగే ప్రమాదాన్ని గమనించాలంటూ భారత్‌ను హెచ్చరించింది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ రాజేంద్ర కుమార్‌పై చిత్రించగా మన్నా డే కలత చెందించే స్వరంతో పాడిన ఆ పాట మన ఇళ్లలోనే ప్రమాదకరమైన శత్రువులు దాగి ఉన్నారని, మన గోడలపైనే మన గురించి దాష్టీకం చలాయిస్తున్నారని పేర్కొంది. ఆ పాట మనలోని దేశభక్తిపరులను హెచ్చరించింది కూడా: (మేలుకో మిత్రమా, నీ కశ్మీర్‌ని కూడా నీవు రక్షించుకోవాల్సి ఉంది). మహేష్‌ కౌల్‌ నిర్మించిన తలాఖ్‌ సినిమాకోసం ఈ పాటను చిత్రించారు. ఈ సినిమా 1958లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులకు నామినేట్‌ అయింది. ఆనాటి ఆ పాట హిందీ ప్రాబల్య ప్రాంతంలో అందరి నోళ్లలో ఇప్పుడెందుకు మళ్లీ నానుతున్నట్లు?

ఈ పాటను నెహ్రూ ఇష్టపడలేదని మీరు గుర్తించాలి. ఎందుకంటే చాలామంది తోటి భారతీయులను అది దూషిస్తోంది. అందుకే ఆ పాటను ఆయన నిషేధించారు. అయితే 1965లో యుద్ధాన్ని ఎదుర్కొన్న లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ఆనాటి పాట ఈరోజు ఎంత సందర్భోచితంగా ఉంటుందో చూడండి. శత్రువు మన ముంగిట ఉన్నప్పుడు, మన ఇళ్లలోనే లక్షలాది మంది విద్రోహులు దాగి ఉన్నప్పుడు.. అంటూ సాగే ఆ పాట వెనుక వాస్తవాలను మాత్రం పట్టించుకోవద్దు. గత 60 ఏళ్లలో రెండున్నర యుద్ధాల్లో గెలుపొందాక, పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేశాక, 2.7 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందాక, మనం ఎంతో సురక్షిత స్థితిలో ఉన్నామనీ, సౌభాగ్యంతో ఉన్నామని గతంలోని అనుమానాలనుంచి బయటపడగలమనే ఆశావాదంతో ఉంటామని మీరు భావించవచ్చు. 

కానీ, భారతదేశ సువిశాల ప్రాంతాల్లో అంటే హిందీ ప్రాబల్య ప్రాంతంలోనూ, దక్షిణ భారత్‌లోనూ పయనించిన తర్వాత, నేను ఎంతో నమ్రతగా నివేదించాల్సిన అంశం ఏమిటంటే, అలాంటి సురక్షిత పరిస్థితులకు భిన్నంగా నరేంద్రమోదీ, అమిత్‌ షాల నేతృత్వంలో బీజేపీ పూర్తిగా ప్రతికూల పరిస్థితులను దేశంపై మోపిందన్నదే. భారత్‌ ఇప్పుడు అత్యంత సురక్షితంగా ఉన్నదని భావించాల్సిన తరుణంలో ఓటర్లలోని అతిపెద్ద విభాగాలను ఈ మోదీ, షా జంట నచ్చచెప్పగలిగారు. 2014లో అంధకార యుగం నుంచి భారత్‌ బయటపడిందని, వాట్సాప్‌ నుంచి చరిత్రను నేర్చుకుంటున్న కోట్లాది మన యువత విశ్వసిస్తున్న తరుణంలో తమ పూర్వీకుల కాలంలో దేశం ఎదుర్కొన్న ప్రమాదాలు ఇప్పుడు మళ్లీ చోటుచేసుకుంటున్నాయని అదే యువత నమ్మేలా చేయడంలో మోదీ షా ద్వయం విజయం సాధించారనే చెప్పాలి. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ కోసం కమాండోలను, శత్రుభూభాగంపై బాంబులదాడికి యుద్ధవిమానాలను పంపించడానికి వెనకా ముందూ ఆలోచించని, బలమైన నేతను కాకుండా మీరు మరొకరిని ఎలా నమ్మగలరు? 

ఆర్థిక వ్యవస్థ దుస్థితి, ఉద్యోగాలు లేకపోవడం, ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే వీటిని ప్రచారం ద్వారా పరిష్కరించలేరు. అందుకే మోదీ, షా ద్వయం దీన్ని జాతీయ భద్రతపై జరుగుతున్న ఎన్నికలుగా మలిచేశారు. వారు విజయం పొందారని కూడా మనం ఇప్పుడు చెప్పవచ్చు. జాతీయ భద్రతపై ఎన్నికల దిశను మార్చడానికి మూడు ముందస్తు షరతులు అవసరం. ఒకటి. దూకుడైన జాతీయ ప్రయోజనాలను పునర్విర్వచించగల పరిస్థితి. రెండు. నిజమైన జాతీయవాది అసహ్యించుకోవలసిన, ద్వేషించాల్సిన క్రూరుడైన విదేశీ శత్రువు ఆవిర్భవించడం. మూడవది ముఖ్యమైన అంశమేదంటే అదే శత్రువుతో కుమ్మక్కయ్యే, సానుభూతి ప్రదర్శించే పంచమాంగదళం. ఈ మూడు పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరూ నైతికంగా, రాజకీయంగా మద్దతు తెలుపలేని అలాంటి శత్రువుపై వ్యతిరేక ప్రచారం ప్రారంభించి మీరు ఓట్లు అడగవచ్చు. దీన్ని విభజన రాజకీయాలు అనే ఒక్క పదంతో పిలువలేము. ఇది మరింత దుర్మార్గమైంది. ప్రభావశీలమైంది.
 
జాతిహితానికి సంబంధించిన అలాంటి జనరంజక భావనను నిర్మించడంలో కీలకమైన అంశం ఏదంటే, అస్తిత్వానికి చెందిన పదునైన నిర్వచనం మీకు అవసరమౌతుంది. ‘జాతి ప్రయోజనం అనేది ఒక చపలచిత్తమైన భావన, అది మన విదేశీ విధానాన్ని నిర్ణయించేందుకు ఉపయోగపడుతుంద’ని అమెరికన్‌ వ్యూహకర్త, హార్వార్డ్‌ ప్రొఫెసర్‌ జోసెఫ్‌ నీ జూనియర్‌ ‘ఫారిన్‌ పాలసీ’ పత్రికలో పేర్కొన్నారు. ఈ వ్యాసంలో నేను ఏది కీలకంగా తీసుకున్నానో మీరు గుర్తించే ఉంటారని నేను పందెం కాయగలను. మీరు గుర్తించకపోతే వినండి. అస్తిత్వం అంటే ఇప్పడు హిందూ, భారత జాతీయవాదమే కీలకం అని అర్థం. హిందువులకు మంచిదైనది భారత్‌కీ మంచిది అవుతుంది. అలా కాకుంటే దాన్ని సరిదిద్దాల్సిందే. మరి హిందూయేతరుల మాటేంటి? వాళ్లుకూడా ఏకకాలంలోనే ప్రయోజనం పొందుతారు. కానీ వారు భారత జాతీయవాదంపై ఆరోపించినా, లేక దానికి తలొగ్గకున్నా, వెంటనే పంచమాగదళం వారి వెంటబడుతుంది. ఇది ఉదారవాదుల రక్తం పీల్చుతుంది. జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, ప్రజాభిప్రాయాన్ని ధిక్కరించేవారిని ప్రశ్నిస్తుంది. అర్బన్‌ నక్సల్స్‌ను వెంటాడుతుంది. ఈ సందర్భంలోనే మీ పడకగదుల్లో, వంటగదుల్లో దాక్కుని ఉన్న విద్రోహుల గురించి ఆనాడే హెచ్చరించిన కవి ప్రదీప్‌ పాటను గుర్తుచేసుకోండి మరి. 

మోదీ–షాలు ఈ ఎన్నికల ప్రచారాన్ని సరిగ్గా ఈ అంశంపైనే నిర్మిం చారు. ప్రతిపక్షం అదే సమయంలో నావీ, రఫేల్, లౌకికవాదం, సమానత్వం వంటి పూర్తిగా భిన్నమైన అంశాలను ప్రచారం చేస్తోంది. ఒక పక్షం యుద్ధ సంగీతాన్ని వినిపిస్తుంటే మరో పక్షం తంబురాను మీటుతున్నట్లుంది. ఈ అన్ని భావాలు ముఖ్యమైనవే కానీ, దేశం ఉనికిలో లేకపోతే ఇవన్నీ అసాధ్యమే అవుతాయి. దేశం ఇన్ని భయంకర ప్రమాదాలను ఎదుర్కొంటూండగా.. దేశాన్ని మీరు ఎవరి చేతుల్లో పెట్టదలిచారు? ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న, శక్తివంతుడైన నాయకుడినా లేక మీరు పెద్దగా చూసి ఉండని ‘పప్పు’నా? మీరే తేల్చుకోండి. అన్ని అంశాల్లో విజయాలు పొందిన తరహా జాతీయవాది ఇక్కడ లేరు. ఆర్థిక దుస్థితి, అసంతృప్తిని తటస్థం చేయగలగటం ఇప్పుడు అవసరం. దేశం లోతట్టు ప్రాంతాల్లో యువత, ఉపాధి లేనివారు, ఆశలు లేనివారు అవుననే చెబుతున్నారు. మనం చేయడానికి ఏ పనీ లేదు. పైగా సమస్యలతో సతమవుతూ బాధపడుతున్నాం. కానీ దేశం కోసం కాస్త బాధలను భరించగలం. ప్రభుత్వం పట్ల అసమ్మతిని ఈ రకంగా ప్రజానీకంలోని మెజారిటీ ఈ రకంగా ఉపశమింపచేసుకోవడం ఏ ప్రచార మేధావికైనా మింగుడుపడని విషయంగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం సమాజంలో ఏర్పడి ఉన్న వాస్తవికతను ఇది మార్చలేదు.

మరో అంశం అస్తిత్వం. హిందూ విశ్వాసం కంటే రాజకీయ అస్తిత్వ భావం మన సమాజంలోని విస్తృత విభాగాలలో ఆవరించి ఉంది. కర్ణాటకలో వొక్కలిగలు, హిందీ ప్రాబల్య ప్రాంతంలో యాదవులు, దేశమంతటా దళితులు ఈ కోవకు చెందుతారు. తమిళనాడు, తెలుగు ప్రాంతాల్లో భాష, స్వజాతీయతలకు ప్రాధాన్యత ఉంటోంది. ఇక మతపరంగా ముస్లింలు, క్రైస్తవులు అనే విభజన ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యేకించి ఇలాంటి విడి అంశాలన్నీ ఒక్కటయ్యాయంటే ఈ జాతీయవాద ప్రభంజనం, మరొక ప్రభంజనం కుప్పగూలిపోవచ్చు కూడా. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అతిపెద్ద పరాజయం పొందవచ్చు. చాలా ప్రాంతీ యపార్టీలవలె కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ అస్తిత్వాల దన్ను లేదు. మిలి టెంట్‌ జాతీయవాదాన్ని అహింసావాదంతో గట్టిగానే ఎదుర్కోవచ్చు అనే వాదన ఇప్పటి పరిస్థితుల్లో జనాన్ని ఒప్పించకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్‌ గతంలో అత్యంత క్రూరమైన రాజ్య వ్యవస్థను నిర్వహించిన కళంక చరిత్రను మూటగట్టుకుని ఉంది. దేశానికి శత్రువులూ, విద్రోహులపై వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం చేస్తున్నప్పుడు దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాలని మీరు ప్రచారం చేస్తే మీరు ఏం చేస్తున్నారో మీకు ఏమాత్రం అర్థం కావడం లేదన్నమాట.

మోదీ–షాల బీజెపీ దేశయువతలోని అతి పెద్ద విభాగాల్లో అనుమానాస్పద జాతీయవాదాన్ని ప్రేరేపించడం ద్వారానే ఈ ఎన్నికల ప్రచారంలో విజయం సాధించింది. శత్రువులు ఎవరో తేల్చేశారు. ఆయుధాలు గురిపెట్టారు. పాక్‌పై యుద్ధవిమానాలు, కమాండోలు సిద్ధంగా ఉన్నారు. పంచమాగదళం, సోషల్‌ మీడియా దేశంలోని వ్యవస్థ వ్యతిరేకులను చితకబాదేస్తున్నాయి. కవి ప్రదీప్‌ ఆనాడు గుర్తించిన ప్రమాదాలు, శత్రువును ఇప్పుడు మనం జయించేశామని భావించాం. కానీ వాటిని ఇప్పుడు మళ్లీ పునరుత్తానం చెంది స్తున్నాం. ఈ ధోరణి మొదటగా హిందీ మీడియాలో బలంగా వ్యక్తమవుతోంది. 60 ఏళ్లతర్వాత దేశంలో నెలకొన్ని ప్రస్తుత మానసిక స్థితిని ఒక యువకవి పూర్తిగా భిన్నమైన తరంలో, శైలితో పట్టుకున్నారు: బలంగా బాదు అనేది దాని సారాంశం. ఈ కొత్త తరహా యుద్ధోన్మాదాన్ని ఇటీవలి రణ్‌వీర్‌ సింగ్‌– అలియా భట్‌ల గల్లీ భాయ్‌ సినిమాలో చూడవచ్చు. దాంట్లో ఒక పాట భావం ఇది.. ‘‘ఇది 2018, దేశం పతనం అంచుల్లో ఉంది. మనమంతా పెనుమంటల్లో చిక్కుకుని అరుస్తున్నాం, ఏడుస్తున్నాం, భీతిల్లుతున్నాం. మీ విషపూరితమైన ఫిడేల్‌ని వాయించండి. ప్రతి ఒక్కరి దృష్టినీ దారి మళ్లించండి’’.

శేఖర్‌ గుప్తా, వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top