కరోనా అనంతరం సరికొత్త జీవితం

Psychiatrist Opinions On New Life After Corona - Sakshi

కరోనా అనంతర జీవితంపై చర్చకంటే ముందు అది మనకు నేర్పుతున్న పాఠాలేమిటి అనేది ప్రశ్న. కోట్లమంది ప్రజలు స్వీయక్రమశిక్షణ ప్రాధాన్యతను గుర్తించారు. మనిషి జీవించి ఉండటం,అంతకుమించి ఆరోగ్యంగా ఉండడం ఎంత గొప్పదో కరోనా సాక్షిగా అర్థం చేసుకుంటున్నారు. కుటుంబాలతో మళ్లీ కనెక్ట్‌ అవుతున్నారు. కరోనా విసురుతున్న సవాళ్లతో ఇంకా సతమవుతూ ఉన్నప్పటికీ, ఈ సంక్షోభం ముగిసిన తర్వాత మన జీవితాల్లో కలిగే మార్పులకు అలవాటు పడటానికి కూడా ఇది అవకాశం కల్పిస్తోంది. కోవిడ్‌–19 వైరస్‌ మానవజాతికి కలిగించిన నొప్పి అత్యంత వాస్తవికమైనది. కానీ గతంలో ఎన్నో వైరస్‌లకు పట్టినట్లుగానే కరోనా కూడా తన దారిన తాను వెళ్లిపోక తప్పదు. కొత్త ఉషోదయం రాక తప్పదు. ఈ ఆశాభావంతోనే మనం వర్షం వెలిసిపోయాక ఎండ వస్తుందనే సామెతను గుర్తుంచుకుందాం. ఒక కొత్త భవిష్యత్తు మన కనుచూపుమేరలోనే ఉంది.

కోవిడ్‌–19 సాంక్రమిక వ్యాధితో కలుగుతున్న అనుభవాలు నిస్సందేహంగా మనకు అనేక పాఠాలు నేర్పుతున్నాయి. వాటిలో అతి ప్రధానమైన పాఠం.. స్వీయ క్రమశిక్షణ ప్రాధాన్యతను మనలో అనేకమంది గుర్తించడమే. ప్రజలతో, కుటుంబాలతో తిరిగి కనెక్ట్‌ కావడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, వ్యాయామం చేయడం వంటి అంశాలపై అసంఖ్యాక సందేశాలు, చిట్కాలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. మనందరం ఇప్పటికే విసుగు పుట్టేంత స్థాయిలో వీటి గురించి విని ఉన్నాం కూడా. కరోనా వైరస్‌ గురించిన అనుభవం ఇప్పటికే చాలామందిలో స్వచ్ఛందసేవాతత్వం, నిగ్రహం, సహనం వంటి అంశాలకు సంబంధించి మానవ ప్రవర్తనలో అత్యుత్తమమైన అంశాన్ని, చింతనను బయటకు తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా.. జీవించి ఉండటం, ఆరోగ్యంగా ఉండటంపై ఒక లోతైన కృతజ్ఞతా భావాన్ని ఇది తీసుకొచ్చింది. శాశ్వత లక్షణం లేని జీవితానికి ఆడంబరాన్ని, దర్పాన్ని జోడించినప్పటికీ దానికి ఎలాంటి విలువా ఉండదన్న అపరిమితమైన అవగాహనని కరోనా కలిగించింది. అది నేర్పిన గుణపాఠాల్లో అన్నిటికంటే పెద్ద పాఠం ఇదే.  

తాత్వికపరమైన ఇష్టాలు, అభిలాషలు పెద్దగా లేని మనలోని కొందరికి కరోనా అందించిన అనుభవం మానవ ప్రవర్తనలోని అత్యంత చెడ్డగుణాన్ని బాహాటంగా ప్రదర్శించి చూపింది. ఇతరులకు అందవు అని తెలుస్తున్నప్పటికీ అదనపు ఆహార పదార్థాలు, తదితర సరుకులను పెద్ద ఎత్తున నిల్వ ఉంచుకోవడం, ప్రజలను గందరగోళ పర్చడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీ వార్తలను పంపి తమాషా చూడటం వంటివి మనుషుల్లోని చెడ్డగుణానికి ప్రతీకలు. లాక్‌డౌన్‌ కారణంగా కలుగుతున్న విసుగు, చిరాకు నుంచి బయటపడేందుకు కొందరు రోజు పొడవునా మొబైల్సే లోకంగా బతికేస్తున్నారు. బహుశా ఇలాంటివారు జాతివివక్ష, మతవివక్షాపూరితమైన సందేశాలను వరుసపెట్టి పంపుతూ ఉండవచ్చు. 

ఆరోగ్య సంబంధిత వస్తువులు, పరికరాల అమ్మకాలతో లాభాలు పండించుకోవడం అన్నిచోట్లా వ్యాపించి ఉండకపోవచ్చు. కాకుంటే అత్యంత ఖరీదైన వైద్య ఉత్పత్తులు, సామగ్రికి సంబంధించిన ధరల విషయంలో కపటత్వం రాజ్యమేలవచ్చు. ఇక ఇంటర్నెట్‌ స్కామర్లు రంగంలోకి దిగి రిటైర్‌ అయినవారి సేవింగ్స్‌ను లాక్కొనేందుకు జిత్తులు పన్నవచ్చు. అనిశ్చితకాలాల్లో మెదడు కూడా సాధారణ పరిస్థితుల్లో కలిగివుండే తన హేతుపూర్వకమైన తార్కికతను కోల్పోయి ఎరుకకు సంబంధించి పాక్షికతకు లోనుకావచ్చు. ప్రజల కదలికలపై నియంత్రణ విధించిన కాలంలో అన్నింటిపైనా నిర్దయాత్మకంగా కోతవేయడం అనేది దొంగల దోపిడీని రంగంలోకి దింపవచ్చు.

మన కదలికలను కూడా నియంత్రిస్తున్న కాలంలో కోవిడ్‌–19ని మనం ఎలా ఎదుర్కోగలం అనేది ప్రశ్న. ప్రధానంగా సామాజిక నిబంధనల్లో మార్పు వల్ల కొన్ని ప్రవర్తనా మార్పులు చోటు చేసుకోవచ్చు. సినిమాలు, స్టేడియంలు, చివరకు ప్రజారవాణా వ్యవస్థ వంటివి కొంతకాలంపాటు పూర్తిగా మూతపడిపోవచ్చు లేదా జనం గుమికూడకుండా వాటిని నియంత్రించవచ్చు కూడా. వారాంతపు రోజుల్లో బిడ్డలను చంకన పెట్టుకుని కిక్కిరిసిపోయిన మాల్స్‌లో సంచరించడం అనే అలవాటు స్థానంలో కుటుంబాలు ఇంటివద్దే గడుపుతూ తమ విలువైన సమయాన్ని ఆస్వాదించవచ్చు. భౌతిక దూరం పాటించడం వల్ల కచ్చితంగా క్యూను పాటించటడం అనేది వ్యవస్థీకృత షరతుగా అలవాటు కావచ్చు.

అన్నిటికంటే ముఖ్యంగా అంటు భయం వల్ల, స్నేహితులతో కలిసి మనం ఆరగించే తీరు పూర్తిగా మారిపోవచ్చు. ఆరగించే స్థలాలు మరింత శుభ్రంగా ఉంచేలా జాగరూకత పెరగవచ్చు. విదేశీ ఆహారం కంటే మన దేశీయ ఆహార రకాలే ప్రపంచంలో అత్యుత్తమమైనవని మనం ఎప్పుడు చెప్పుకోగలం? కాలుష్యంతో కూడిన ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంటులు, వాటిలో పారిశుధ్యం, భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా ఆహారాన్ని సరఫరా చేసేవారిని మనం గుడ్డిగా ఆమోదిస్తూ పోతున్నంత కాలం మన వంటలు, మన పద్ధతులు గొప్పవని మనం ఏరకంగానూ చెప్పుకోలేం. విదేశీయులు మన ఆహార రకాలపై అనురక్తిని పెంచుకునేలా చేయాలంటే విశిష్టమైన దేశీయ వంటల తయారీలో ప్రమాణాలను, పరిశుభ్రతను అమలు చేయడానికి ఇదే తగిన తరుణం. ఇక ఆహార పదార్థాలపై నిఘా అధికారులు అర్థమనస్కంతో పనిచేయకూడదు, రెస్టారెంట్‌ యాజమాన్యంతో లాలూచీ పడకూడదు. 

పాశ్చాత్య వంటకాలంటే అన్ని దేశాల్లోనూ క్రేజీ పెరిగిపోతోంది. అది ఎంత నిస్సారమైనదైనా, సరే, చెత్త ఆహారపు రకం అయినా సరే మనకు తెగ నచ్చేస్తుంటాయి. మనం కూడా నాగరికులం అని ప్రదర్శించుకోవాలి కదా మరి. కానీ కోవిడ్‌–19 మనకు గొప్ప అనుభవాన్ని అందించింది. ఇప్పుడు మనమంతా పోషకాహార విలువలు కలిగిన ప్యాక్‌ చేసిన లంచ్‌పై మక్కువ మరింత పెంచుకునేలా కరోనా మన ఆలోచనలనే మార్చిపడేస్తోంది. మన అలనాటి లంచ్‌ బాక్సులు మళ్లీ ఇప్పుడు వెలుగులోకి వస్తాయేమో.. ఎవరు చెప్పగలరు?

సంక్షోభ కాలాల్లో కుహనా వార్తలు మోతాదు మించి వ్యాపిస్తున్నందువల్ల ఇలాంటి అంశాలపై పెద్దగా అనుభవం లేని వారు భయాన్ని, ద్వేషాన్ని పెంచిపోషిస్తున్న వార్తలను కూడా ఆమోదిం చాల్సి రావచ్చు. భౌతిక దూరాన్ని తప్పక పాటించాల్సి రావడం అనే అవసరం కారణంగా మన రాజకీయనేతల చుట్టూ చేరే అభిమానుల గుంపులు ఇకపై తగ్గిపోయి తమ పని తాము చేసుకోవడానికి సిద్ధపడవచ్చు. భారీస్థాయిలో గుమికూడే శ్రేయోభిలాషులు, ఫాలోయర్ల గొడవ లేకుండానే మన నేతలు ప్రజా బాహుళ్యంలో తిరుగాడుతుండవచ్చు. ఇక ప్రయాణ రంగానికి వస్తే ప్రైవేట్‌ రంగం తన కార్యనిర్వాహక అధికారులు విమాన ప్రయాణాలను చేసే అవకాశాలను తగ్గించవచ్చు. ఉన్నట్లుండి ముఖాముఖిగా చేసుకునే కమ్యూనికేషన్‌ను పక్కకు నెట్టేసి ఈమెయిల్‌ కమ్యూనికేషన్‌ మాత్రమే ఉత్తమమైన భావవ్యక్తీకరణ విధానంగా వెలుగులోకి రావచ్చు. ప్రభుత్వ రంగం కూడా మెరుగైన వీడియో కాన్ఫరెన్సులు, వెబినార్స్‌ లను సాధారణంగా ఎంచుకోవచ్చు. 

ఈ–కామర్స్‌కు ప్రజాదరణ పెరగడంతోపాటు మన కదలికలే స్తంభించిపోయిన ప్రస్తుత తరుణంలో ఇ–లెర్నింగ్‌ పట్ల ఆసక్తి పెరిగి విద్యను డిజిటలైజ్‌ చేయడం వేగవంతంగా పూర్తికావచ్చు. రోజువారీ జీవితంలో డ్రోన్‌లు, రోబోల ఉపయోగం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక బృంద జీవితానికి ఇదే ఒక ప్రామాణిక లక్షణంగా మారిపోవచ్చు. భద్రతాపరమైన నిఘా, స్క్రీనింగ్‌ ప్రొసీజర్లు, చివరకు ఆహార సరఫరాలో కూడా డ్రోన్లు, రోబోలు కీలకపాత్ర పోషించే అవకాశం కూడా ఉంది. అన్నిటికంటే మించి వర్క్‌ ఫ్రం హోమ్‌ అనే సంస్కృతి అన్నిదేశాల్లోనూ సాధారణ అంశంగా మారిపోవచ్చు. దీంతో విదేశీ సహాయంపై ఆధారపడటం అనేది చాలావరకు తగ్గిపోవచ్చు.

కంటికి కనిపించని శత్రువుపై పోరాటమే ముఖ్యమైపోవడం కారణంగా రక్షణ బడ్జెట్‌లో కోత పడక తప్పదు కాబట్టి కొన్ని దేశాల్లో ఆరోగ్య బడ్జెట్‌ గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. అన్ని దేశాల్లోనూ ఆరోగ్య సంరక్షణను ఎలా అందిస్తారు అనే విధానం పూర్తిగా మారిపోవచ్చు. కొన్ని వైద్య రంగాల్లో ఈ–కన్సల్టేషన్లు పెరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా కరోనా వంటి వైరస్‌లు ప్రబలే అవకాశం ఉంటున్నందున సామాజిక, భౌతిక వాతావరణమే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందనే ఎరుకతో ప్రజారోగ్య వ్యవస్థ సమూలంగా మారిపోవచ్చు. ఆరోగ్యకరమైన గృహవసతి వ్యవస్థలు, పని స్థలంలో మంచి వాతావరణంతోపాటు ఉత్తమమైన ఆరోగ్యానికి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను కూడా ఉపయోగించుకునే క్రమంలో సాంస్కృతిక, మతపరమైన మద్దతు అవసరానికి బాగా గుర్తింపు కలగవచ్చు. 

కోవిడ్‌–19 అనుభవంతో మానసికంగా ప్రభావితమవుతున్న వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది కాబట్టి దేశదేశాల్లో స్పష్టమైన మానసిక ఆరోగ్యం నెలకొల్ప వలసిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించే అవకాశం ఉంది. కరోనా సాంక్రమిక వ్యాధి విసురుతున్న సవాళ్లతో ఇప్పటికీ సతమవుతూ ఉన్నప్పటికీ, ఈ సంక్షోభ సమయం ముగిసిన తర్వాత మన జీవితాల్లో కలిగే మార్పులకు అలవాటు పడటానికి కూడా ఈ అవకాశాన్ని మనం వినియోగించవచ్చు. కోవిడ్‌–19 వైరస్‌ కలిగించిన నొప్పి అత్యంత వాస్తవికమైనది. కానీ గతంలో ఎన్నో వైరస్‌లకు పట్టినట్లుగానే ఈ తాజా వైరస్‌ కూడా తన దారిన తాను వెళ్లిపోక తప్పదు. కొత్త ఉషోదయం రాక తప్పదు. ఈ ఆశాభావంతోనే మనం వర్షం వెలిసిపోయాక వెలుగు వస్తుందనే సామెతను గుర్తుంచుకుందాం. ఒక కొత్త భవిష్యత్తు మన కనుచూపు మేరలోనే ఉంది.
ఆండ్రూ మోహన్‌రాజ్, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top