నిరంకుశ పోకడకు ఇది నిదర్శనం

Mallepally Laxmaiah Writes Guest Column On  UAPA Act - Sakshi

లోక్‌సభలో తాజాగా ఆమోదం పొందిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) సరిగ్గా ఎమర్జెన్సీ చీకటి రాత్రులను తలపిస్తోంది. ఎమర్జెన్సీలో అకారణంగా అరెస్టుల పాలై నాటి జనసంఘ్, ఆరెస్సెస్‌లకు చెందిన వేలాది కార్యకర్తల జీవితాలు ఛిద్రమైన చరిత్ర మరవకముందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపా పేరిట నిరంకుశ చట్టానికి మరిన్ని కోరలు తొడిగి బిల్లుకు ఆమోదం పొందటం గర్హనీయం. వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు ఈ సవరణ చట్టం అవకాశం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నిందితులను అరెస్టు చేయడం, విచారించడం భారతదేశ ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీసే చర్య. ఇంత నిరంకుశ చట్టాన్ని తీసుకొచ్చినా దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అసాధ్యం. టెర్రరిజం, నక్సలిజం మూలాలను పట్టించుకోకుండా క్రూర చట్టాలతో వాటిని అంతం చేయడం అసంభవం, అసాధ్యం.

అది 1975. ఎమర్జెన్సీ ప్రకటించిన కాలం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఎస్‌.కే.బీ.ఆర్‌ కళాశాలలో నూకల రామచంద్రరావు హిందీ లెక్చరర్‌. ఆయన స్వతహాగా మంచి వ్యక్తి. తన పని తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకొనేవాడు కాదు. కాలేజీలో జరిగే సామాజిక, రాజకీయ అంశాల్లో కనీసం చర్చల్లో కూడా పాల్గొనే తత్వం కాదాయనది. అయితే అదే కళాశాలలో కొంత మంది లెక్చరర్లు సామాజిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. అందులో ఘనశ్యాంప్రసాద్, నిట్టల రామ దాస్‌లతో పాటు మరికొందరు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో క్రియాశీలకంగా పనిచేసేవారు. ఎస్‌.కే.బీ.ఆర్‌ కళాశాల మీద పోలీసులు నిఘా వేయడానికి అదే కారణం. ఇందులో ఘనశ్యాం ప్రసాద్, నేటి బీజేపీ కీలక నేత రాం మాధవ్‌కు గురువులాంటి వారని చెపుతుంటారు. అలాగే అమలాపురంలో నూకల రామచంద్రమూర్తి అనే ఆర్‌ఎస్‌ఎస్‌  కార్యకర్త ఉండేవారు. అయితే ఆయన లెక్చరర్‌ కాదు.

నూకల రామచంద్రమూర్తి పేరు పోలీసుల లిస్టులో ప్రముఖంగా ఉంది. నూకల రామచంద్రమూర్తి, ఎస్‌.కే.బీ.ఆర్‌ కళాశాలలో హిందీ లెక్చరర్‌గా పనిచేస్తోన్న నూకల రామచంద్రరావు ఒక్కరే అని పోలీసులు పొరపాటు పడ్డారు. హిందీ లెక్చరర్‌ నూకల రామచంద్రరావును ఆనాటికే అమ లులో ఉన్న ‘మీసా’ (ఆంతరంగిక భద్రతా చట్టం) కింద అరెస్టు చేశారు. ఆయనా, ఈయనా ఒకరు కాదని, ఎవ్వరు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా ప్రయోజనం లేకపోయింది. దాదాపు పది నెలలకు పైగా ఆ అమాయకుడైన హిందీ లెక్చరర్‌ని ఆరెస్సెస్‌ కార్యకర్త స్థానంలో జైల్లో పెట్టారు. ఆయనకు ఆరెస్సెస్‌తోగానీ, మరే ఇతర సంస్థలతోగానీ సంబంధంలేదు. పది నెలలు ఏ నేరం చేయకుండా, ఎటువంటి రాజ కీయాలతో సంబంధం లేకుండా అక్రమ నిర్బంధంలో ఉన్న రామచం ద్రరావు జైలు నుంచి విడుదలైన తర్వాత తన ఆరోగ్యాన్ని కోల్పోయారు. ఆయన కంటి చూపు పూర్తిగా మందగించింది. అరెస్టుతో పరువు పోయిందని భావించిన రామచంద్రరావు ఆ దిగులుతోనే కన్నుమూ శారు. ఎమర్జెన్సీలో నిర్బంధ చట్టాల ద్వారా అక్రమ నిర్బంధాలకు గురైన వేల మంది అమాయకుల్లో రామచంద్రరావు ఒకరు.  

అది కేరళ రాష్ట్రం. కాలికట్‌ పట్టణం. అక్కడి రీజనల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్న రాజన్‌ను 1976, మార్చి, 1వ తేదీన కేరళ పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల ముందు నక్సలైట్లు పోలీసు స్టేషన్‌ మీద దాడి చేశారని, అందులో రాజన్‌ పాల్గొన్నాడని పోలీసుల అభియోగం. నిజానికి ఫిబ్రవరి 28వ తేదీన కాలికట్‌ ఇంజ నీరింగ్‌ కాలేజీ విద్యార్థులు తమ కళాశాల ఉత్సవాల్లో ఉన్నారు. అంతే కాకుండా, నక్సలైట్‌ ఉద్యమంతోగానీ, ఆ దాడితోగానీ రాజన్‌కు ఎటు వంటి సంబంధమూ లేదు. కానీ పోలీసులు మాత్రం రాజన్‌ను తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేశారు. శవం కూడా దొరకకుండా మాయం చేశారు. ఆ తర్వాత రాజన్‌ తండ్రి ఎచ్చరవారియర్‌ హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ వేశారు. రాజన్‌తో పాటు అరెస్టయి, ఆయనతో పాటు చిత్ర హింసలు అనుభవించిన చంద్రన్‌ అనే వ్యక్తి ఆ తర్వాత ఈ విషయాలను బయటపెట్టారు. ఎమర్జెన్సీ తర్వాత కేసు విచారణకు వచ్చింది. రాజ న్‌ను పోలీసులు చిత్ర హింసలు పెట్టి చంపినట్టు రుజువైంది. ఈ మొత్తం వ్యవహారంలో కొంత మంది పోలీసులు నేరస్తులని చివరకు తేలింది. అయితే రాజన్‌ ప్రాణం మాత్రం తిరిగిరాలేదు. 

పై రెండు ఘటనలు 1975 నుంచి 1977 వరకు 19 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ చీకటి పాలనకు మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎటువంటి విచారణ లేకుండా అమాయకులను పట్టుకెళ్ళి జైళ్ళలో నిర్బంధించి పౌర హక్కులను కాలరాసిన ఆ దుర్భర రాత్రులను ఎవ్వరూ మరచిపోలేరు. ఆ రోజున అమలు జరిపిన నిర్బంధ చట్టాల వల్ల, పోలీసులకూ, భద్రతా బలగాలకూ ఇచ్చిన అపరిమితమైన అధి కారాల వల్లా జరిగిన ఘోరాలివి. ఎమర్జెన్సీలో దాదాపు లక్షమందికి పైగా జైళ్ళలో అక్రమ నిర్బంధాన్ని అనుభవించారు. అందులో ఈ రోజు అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకులు కూడా చాలా మంది ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఎల్‌.కే. అద్వానీ, వాజ్‌ పేయి, ప్రకాశ్‌ జవ్‌దేకర్, బంగారు లక్ష్మణ్, ప్రమోద్‌ మహాజన్, సిహెచ్‌ విద్యాసాగర్‌రావు, జంగారెడ్డిలు ఉన్నారు. అనేక మంది ఇతర పార్టీల నాయకులు సైతం జైళ్ళలో మగ్గారు.

ఎమర్జెన్సీలో నిర్బంధానికి గురైన వేలాది మంది నాయకులు ఈ రోజు ఇంకా బతికే ఉన్నారు. నిర్బంధ చట్టాలు దుర్వినియోగం జరిగితే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. ఎమర్జెన్సీ లాంటి నిర్బంధపాలన వస్తే ప్రతిపక్షాలూ, ఇతర సంఘాలు, సంస్థలు మాత్రమే కాదు. అధికార పార్టీవారు కూడా ఆ దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. వారం రోజుల క్రితం లోక్‌సభలో ఆమోదం పొందిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) సరిగ్గా ఎమర్జెన్సీ చీకటి రాత్రులను తలపిస్తోంది. పౌరులను అభద్రతాభావంలోకి నెడుతోంది. టెర్రరిజం, హింస ద్వారా హత్యాకాండ చేస్తున్న వ్యక్తులు, సంస్థలూ చట్టం ప్రకారం శిక్షార్హులే.

అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రజాస్వా మ్యాన్ని కాంక్షిస్తున్న వాళ్ళు, మానవత్వాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, సమాజంలో జరుగుతున్న తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళు, రక్త పాతంతో, హింసాకాండలతో ఎటువంటి సంబంధమూ లేనివాళ్లు రక్త పాతాన్ని సమర్థించేవాళ్ళూ, సమర్థించని వాళ్ళూ, కొన్ని భావజాలా లను సమర్థిస్తున్నవారు ఈ సమాజంలో ఉన్నారు. అయితే టెర్రరిజాన్ని అణచివేయడానికి ప్రభు త్వాలు తీసుకొచ్చిన చట్టాలు, ఆ చట్టాలకు మరిన్ని సవరణలు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువ లను పూర్తిగా విస్మరిస్తున్నాయి. ‘ఉపా’ చట్ట సవరణలలో ముఖ్యమైనవి, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌.ఐ.ఏ)కు విస్తృతమైన అధికారాలివ్వడం. అందులో రాష్ట్ర పోలీసులకు సమాచారం లేకుండా, అనుమతి లేకుండా నిందితులను అరెస్టు చేయడం, విచారించడం. ఇది భారత దేశ ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీస్తుందనడంలో సందేహం అక్కర్లేదు.

రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ హక్కులను కోల్పోక తప్పని పరిస్థితి. వ్యక్తులకు మాత్రమే కాదు, రాష్ట్రప్రభుత్వాల మనుగడను సైతం ఇది ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. అంతేకాకుండా, గతంలో కొన్ని సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రక టించేవారు. ఇప్పుడు దానితో పాటు, వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే ప్రమాదకర అవకాశాన్ని ఈ సవరణ ఇస్తున్నది. ఏ విచారణా జరగకుండానే, ఆ వ్యక్తి ఉగ్రవాది అనే విషయాన్ని చట్టపరంగా న్యాయ స్థానాలు నిర్ధారించక ముందే ఆస్తులను జప్తు చేయడం, ఇతర రకాలైన పౌరహక్కులన్నింటినీ లాగేసుకోవడం దీని ఉద్దేశ్యం. ఇది పూర్తిగా రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవు తుంది.

వాక్‌స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ, సమావేశ హక్కు సహా చివరకు జీవించే హక్కునే ఆ వ్యక్తి కోల్పోయే దారుణమైన పరిస్థితి. చాలావరకు అమాయకులు, రాజకీయ ప్రత్యర్థులు, స్థానిక నాయకులతో శతృత్వం ఉన్న వాళ్ళు అందరూ ఈ చట్టం వల్ల ఇబ్బంది పాలవుతారు. ఎమర్జెన్సీలో బాధితులుగా ఉన్న పార్టీ, సంస్థలు ఇలాంటి చట్టం తేవడం బాధాకరం. ఆ రోజుల్లో ఎన్నివేల మంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు ఇబ్బం దులు పడ్డారో ఇటీవల ఎమర్జెన్సీ దురాగతాల గురించి మాట్లాడిన బీజేపీ నేతలు వెల్లడించారు. ఆ అనుభవాలను గుణపాఠాలుగా తీసు కోవడానికి ఆనాటి బాధిత పక్షం, ఈనాటి అధికార పక్షం సిద్ధంగా లేదు.
టెర్రరిజం, నక్సలిజం అనే కార్యకలాపాలను అంతమొందించాలనే ఉద్దేశ్యం కోసమే ఈ చట్టం అవసరమైతే, ఇది సమగ్ర ఫలితాలను ఇవ్వదు. టెర్రరిజం దానికిగల కారణాలకు తగ్గట్టుగా చర్యలు తీసు కోవాలి. అందులో చట్టాలు కూడా భాగమే. కానీ అవి మాత్రమే సమ స్యను పరిష్కరించలేవు.

కశ్మీర్‌ సమస్యను పరిష్కరించడానికి ఇంతకన్నా ఘోరమైన నిర్బంధాన్ని అమలు జరిపారు. కానీ ఫలితం రాలేదు. అక్కడి ప్రజల అభిప్రాయాలకూ, వారి విశ్వాసాలకూ ప్రాధాన్యతనివ్వ కుండా, కశ్మీర్‌ని భౌగోళికంగా మాత్రమే పరిగణనలోనికి తీసుకోవడం వల్ల ఈనాటికీ అక్కడి ప్రజల మనసులను ఏ ప్రభుత్వం గెలుచుకోలేక పోయింది. అడుగడుగునా నిర్బంధం విధించి సైనిక పాలన చేస్తే సమస్య పరిష్కారమవుతుందా? లేక మరింత చిక్కనై, జటిలం అవుతుందా? అనే విషయాన్ని పాలకులు అర్థం చేసుకోవాలి.

నక్సలైట్‌ సమ స్యను కూడా శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నంత కాలం దానికి పరిష్కారం ఉండదు. ఈ రోజు భారతదేశంలో నక్సలైట్‌ సమస్య ఆయు ధాలు, బాంబుల సమస్యకాదు. అది అడవిలో ఆదివాసీల సమస్య. అక్కడి ఆదివాసులను భారతదేశంలో పౌరులుగానే మనం గుర్తించడం లేదు. వారి విద్య, ఆరోగ్యం, ప్రాథమిక సౌకర్యాలు మనకు ఏ మాత్రం పట్టవు. ఒక రకంగా అక్కడ ప్రభుత్వమే ఉనికిలో లేదు. 
ఇన్ని విషయాలను వదిలేసి, కేవలం చట్టాలు, పోలీసులు, సైన్యం, నిర్బంధం, అరెస్టులు, జైళ్ళు మాత్రమే టెర్రరిజానికీ, నక్సలిజానికీ పరి   ష్కారంగా భావిస్తే, గతంలో లాగానే మరో నిర్బంధ చీకటి భారతాన్ని ప్రభుత్వం కలగంటోందని భావించాల్సి వస్తుంది. పిల్లిని సైతం నిర్బంధంలో ఉంచి హింసిస్తే చావడం కన్నా తిరగబడటమే మేలనుకొంటుం దన్న విషయాన్ని మనం మరువకూడదు.


వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య; సామాజిక విశ్లేషకులు  మొబైల్‌ : 81063 22077 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top