ఒకే రాజ్యాంగం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక నిజమేనా?

Madabhushi Sridhar Essay on One Tax and One Election in India - Sakshi

ఒకే దేశం ఒకే రాజ్యాం గం, ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నిక అని లాల్‌ఖిలా నుంచి ప్రధాని నినదించారు. ఒకే దేశం. మనది రాష్ట్రాల సమూహం, రాజ్యాల సంఘం. భిన్నత్వంలో ఏకత్వం మన లక్షణం కాని, వైవి ధ్యంలేని ఏకత్వం కాదు. మనమంతా ఒకటి కాదు అంటే నమ్మడం కష్టం కానీ.. విడివిడి సంస్కృతులు, భాషలతో జీవించే విభిన్న జీవన స్రవంతులన్నీ కలిసి ఒక దేశంగా ఉన్నాయనే వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం అవసరం. మన రాజ్యాంగం ఒకటే, మన ఐపీసీ ఒకటే, మన క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ కూడా ఒకటే కానీ, రాష్ట్రాలకు సంబంధించి నంత వరకు కొన్ని సవరణలు చేసుకునే అధికారాలు, చట్టాలు చేసుకునే స్వతంత్రత రాష్ట్రాలకు ఉన్నాయి. ప్రముఖ న్యాయశాస్త్రవేత్త ఉపేంద్ర బక్షీ, మనకు మూడు రాజ్యాంగాలు ఉన్నాయంటారు. ఒకటి 1950లో మనం రాసుకున్నది. మరొకటి వంద సవరణల ద్వారా మనం మార్చుకున్నది. మూడోది మన నియమాలు, సవరణల అసలు స్వరూపం ఏమిటో చెప్పే సుప్రీంకోర్టు తీర్పులలో వ్యక్తమైంది. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంది. అయినా ఆదేశం ఒకటి కాదనగలరా? అనేక రాజ్యాలు, చట్టాలు, సంప్రదాయాలు ఉండడం అవలక్షణం కాదు, అవసరమైన వైవిధ్య లక్షణం. 

ఇక ఒకదేశం ఒక పన్ను. పన్నులు కట్టేవాడికి తెలుస్తుంది ఎన్నిరకాల పన్నులు కడుతున్నాడో. అసలు ఒకే పన్ను అనే మాట ఒక ఫన్‌. ఒక పరి హాసం, ఒక అవాస్తవం. జీఎస్టీలే రెండు రకాలు, ఒకటి కేంద్రానిది మరొకటి రాష్ట్రానిది. అది కూడా అన్నిటికీ ఒకే రేటు కాదు. నానా రేట్లు ఉన్నాయి. ఆదాయం పన్ను, సంపద పన్ను, శిస్తులు వంటివి జీఎస్‌టీ కాకుండా, ముందునుంచే ఉన్నాయని అందరికీ తెలుసు. 

మరో చోద్యం, వింత ఏమిటంటే.. ఒకే దేశం, ఒకే ఎన్నిక. జమ్మూ కశ్మీర్లో శాసనసభకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నిక జరిపించడానికి అసలు ఏ అడ్డూ లేదు. రాజకీయ ప్రయోజనాలమీద ఆశలే ఎన్నికల్ని నిర్ణయిస్తాయి. ఆ ‘‘ఒకే ఎన్నిక’’ను జరపలేక చతికిలపడిన వారిదే ఈ నినాదం. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు 356వ అధికరణాన్ని, అందులో లభించే అత్యవసర అధికారాన్ని అకారణంగా, అక్రమ కారణంగా 90 సార్లకు పైగా దుర్వినియోగం వల్ల ఒకే ఎన్నికలు జరపడం సాధ్యం కాలేదు. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత 356 అధికరణాన్ని దుర్వినియోగం చేయడంలో పద్ధతులు, ప్రయత్నాలు, వ్యూహాలు మారాయి. టోకు ఫిరాయింపులు చేయించే ధనవ్యాపార రాజకీయం విజృంభిస్తున్నది. మూడింట రెండు వంతుల మంది సభ్యులు లేకపోతే, ఎంఎల్యేలను కొని, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో స్టాక్‌గా పారేస్తారు. ప్రభుత్వాలను పడగొట్టి, గద్దెనెక్కుతారు. వీలుకాకపోతే గందరగోళం సృష్టించి ఓటింగ్‌లో గెలిచి ప్రభుత్వాన్నో ప్రతిపక్షాన్నో కొని పడేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా లేకపోతే సర్కారును రద్దు చేస్తారు. అనుకూలంగా ఉంటే తమ పార్టీ తీర్థం పుచ్చుకోమంటారు. 

తెలంగాణ, ఆంధ్ర మరికొన్ని రాష్ట్రాలలో జమిలి ఎన్నికలు సహజంగా జరిగేవి.  తెలంగాణ ఎన్నికలను ముందుకు జరిపిందెవరు? అప్పుడు ఒకే ఎన్నిక విధానం ఏమైంది? ఆర్నెల్లలోనే రెండు ఎన్నికలకు రాష్ట్రం ఎందుకు సమాయత్తం కావలసి వచ్చింది? కాలం, చట్టం, ఆచారం అనుకూలంగా ఉన్నా ఒకే రాష్ట్రం రెండు ఎన్నికలను కనీసం రెండు రాష్ట్రాలలో అమలు చేయలేని ప్రభుత్వం దారి ఏమిటో దాని శుధ్ధి బుద్ధి ఏమిటో? అత్యధిక రాష్ట్రాలలో పాలిస్తున్న బీజేపీ, వేరే పార్టీల అధీనంలో ఉన్న రాష్ట్రాలలో కేంద్రాన్ని కాదని వ్యతిరేకించే ధైర్యమున్న ముఖ్యమంత్రులు తక్కువే. మూడింట రెండు వంతుల ఆధిక్యతతో, సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం పొందడం కూడా ఇప్పుడున్న పరిస్థితులతో కష్టం కాదని రుజువైంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి 2024 ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమేం కాదు. కానీ నిర్వహిస్తారా? తమకు గెలిచే అవకాశం ఉందనుకుంటేనే జరుగుతాయా? రాష్ట్రంలో లోక్‌సభకు, శాసనసభకు ఒకే ఎన్నిక జరిపించడానికి అడ్డొచ్చిన అవసరాలే జమిలి ఎన్నికలకూ ఏర్పడతాయి.నినాదాలు చేయడంవేరు, విధానాలు రచిం చడం వేరు. విధానాలను సక్రమంగా రచించడం కోసమే సంవిధానం ఉంది. సంవిధానాన్ని కాదనుకుంటే, లేదనుకుంటే, ఉన్నా అది వేరు పాలన వేరు అనుకుంటే వారికి ఏదీ చెప్పడం సాధ్యం కాదు. స్వేచ్ఛగా వ్యవహరించి, శాస్త్రీయంగా ఆలోచించి, సహేతుకంగా అభిప్రాయాన్ని ఏర్పరచుకుని, ధైర్యంగా చెప్పగలవాళ్లుంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది.

మూఢంగా నమ్మడం మతంలో కుదురుతుందేమో కానీ సమాజంలో, రాజకీయంలో సాగించకూడదు. అభివృద్ధిని అవసరమైన వస్తువులాగా చూపి, టెర్రరిజం ప్రమాదాన్ని భయానక వాతావరణం కల్పించడానికి అనువుగా వాడుకుని, స్వతంత్రతను, స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, అధికార వికేంద్రీకరణను దెబ్బతీస్తూ ఉంటే మౌనంగా ఉండడం నేరమవుతుంది. మోదీ వల్ల ప్రజాస్వామ్యానికి వచ్చే ప్రమాదం కన్నా గుడ్డిగా ఆమోదించేవారి వల్ల ప్రమాదం ఎక్కువ. అయితే ఎవరేమన్నా, అనుకున్నా, తిట్టినా లైక్‌ చేయకపోయినా, నిజానిజాలను హేతుబద్ధంగా విశ్లేషించడం రాజ్యాంగ విధి, చట్టపరమైన బాధ్యత, నైతిక బాధ్యత, దేశ భక్తుల బాధ్యత. భయపడకండి, ధైర్యంగా విమర్శించండి, ఆ విమర్శల జడివానలకు బ్రిటిష్‌ పాలకులే పారిపోయారు. విమర్శాస్త్రం ముందు స్వార్థపర అవకాశ వాద రాజకీయులేం నిలబడతారు?  స్వాతంత్య్ర దినోత్సవంలో దినం కాదు ప్రధానం, ఉత్సవం అంతకన్నా ప్రధానం కాదు. స్వతంత్రం ప్రధానం. దినాలు, ఉత్సవాలు మనకు స్వాతంత్య్రాన్ని గుర్తు చేయాలి.

 
వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్‌, బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top