ఆకలి భారతావనికి అన్నం పెట్టేదెలా?

KR Venugopal Article On Lockdown - Sakshi

విశ్లేషణ

ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మే 3 వరకు లాక్‌డౌన్‌ రెండో దశను కూడా ప్రకటించినందున పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఉన్న కోట్లాది మంది వలస కూలీలకు, ఇతరులకు ఆహారధాన్యాలు సమర్థంగా పంపిణీ చేయడం ప్రభుత్వాల ముఖ్య బాధ్యత. రేషన్‌ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం ఇచ్చిన ఇతర కార్డులు లేని వారికి కూడా తాత్కాలిక రేషన్‌ కూపన్లు జారీ చేస్తే, ఈ విధానాన్ని జాగ్రత్తగా మనం అమలు చేయగలిగితే వలస జీవుల్లో, నిరుపేద వర్గాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితులు రావు. సమృద్ధిగా ఆహార నిల్వలున్నందున జనం ఆకలి తీర్చడం సమస్యేకాదు. కాకపోతే ఇందుకోసం, అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటూ, మనల్నీ, ప్రజా సేవల విభాగాల పనితీరునూ మరింత నిర్మాణాత్మకంగా మలుచుకోవలసి ఉంటుంది.

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల మన దేశానికి ఎదురైన విపత్కర పరిస్థితులనుంచి బయటపడటం ఎలా అన్న భయాందోళనలు అందరిలోనూ ఉన్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇదేమంత కష్టం కాదు. మనకు కావాల్సినన్ని ఆహార నిల్వలు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) గోదాముల్లో ఇప్పటికే ఉన్నాయి. మరో భారీ పంట చేతికి రాబోతూవుంది, అనంతరం అది కూడా గోదాముల్లో నిల్వ చేస్తారు. కాబట్టి, ఈ కరోనా వైరస్‌ వల్ల వచ్చిపడిన ఈ సంక్షోభ సమయంలో జనం ఆకలి తీర్చడం ఎలా అన్న ఆందోళన అవసరం లేదు. ఎంతకాలమైనా మన ప్రజలకు ఆహారపదార్థాలు అందించడం సాధ్యమే.  కాకపోతే ఇందుకోసం, అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటూ, మనల్నీ, ప్రజా సేవల విభాగాల పనితీరునూ మరింత నిర్మాణాత్మకంగా మలుచుకోవలసిఉంటుంది. గత కొంతకాలంగా మనం నిర్మించుకుంటూ పౌర సరఫరాల వ్యవస్థ(పీడీఎస్‌–పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌), సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌) కార్యక్రమాల మౌలిక సదుపాయాలు, వాటిని నిర్వర్తించే సిబ్బంది ఈ సమయంలో మనకు చాలా ఉపయుక్తం. దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఈ అంగన్‌వాడీ సిబ్బంది ఉన్నారు. వీరి సంఖ్య, దేశ త్రివిధ దళాల్లోని సైన్యం సంఖ్య కంటే ఎక్కువ.

అచ్చమైన సమాఖ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గౌరవిస్తూ– రంగంలోకి దిగడానికి అవసరమైన ఈ చర్యల అమలు కోసం పీడీఎస్, ఐసీడీఎస్‌ సిబ్బం దిని సమీకరించడంలోనూ, తగిన మౌలిక వసతులు కల్పించడంలోనూ; అవసరమైన మనుషుల, రవాణా వాహనాల కదలికలను కొన్ని పరిమితులతో అనుమతించడంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ  ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలి.

1. దేశంలో కరువు, క్షామ పరిస్థితులు తలెత్తినప్పుడల్లా ప్రజాపనులు చేపట్టి బాధితులను ఆదుకున్నట్టే ఇప్పుడు నగరాల్లోని పేదల బస్తీల్లోనూ, గ్రామాల్లోనూ విస్తృతంగా ఉచిత వంటశాలలను ఏర్పాటుచేయాలి. వలస జీవులూ, ఆకలిగొన్నవారూ ఎక్కడున్నారో త్వరతగతి తెలుసుకోగలగాలి. ఇలా చేస్తే పేదలకు ఒకవైపు ఆశావహ పరిస్థితిని కల్పించినట్టవుతుంది. మరోవైపు అది ఆకలి తీర్చే నిర్మాణాత్మక కార్యశీలత కాగలదు. ఇది అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముందు నీటి ఎద్దడి ప్రాంతాలతో మొదలుపెట్టి, కొండ ప్రాంతాలు, తరచూ కరువు బారినపడే ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లోనూ అమలు చేయాలి. ఈ విధానంలో దేశంలోని సుమారు 20 కోట్ల మంది ఆకలిగొన్నవారిని చేరవచ్చు. వీటిని ప్రారంభించడానికి అంగన్‌వాడీ కేంద్రాలు బ్రహ్మాండంగా సరిపోతాయి. ఇలాంటి కేంద్రాలు ఇంచుమించు ప్రతిచోటా ఉన్నాయి. అది ఎంత చిన్న నిర్మాణమైనా కావొచ్చు... ఒక ప్రదేశమంటూ ఉంది మనకు. ఈ పనులను అమలు చేయడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు ఉండనే ఉన్నారు. గ్రామాల్లోని, బస్తీల్లోని ప్రతి ఒక్కరికీ కూడా వీళ్లు తెలుసు.

2. ఆకలి తీర్చడానికి అమలు చేయాల్సిన కార్యక్రమాలలో పంపిణీ విధానం చాలా ప్రాముఖ్యత కలిగివుంటుంది. పీడీఎస్, ఐసీడీఎస్‌ సరుకులను గ్రామస్థాయిల్లో పంపిణీ చేయడంలో దక్షిణాది రాష్ట్రాలకు మంచి నమూనాలు ఉన్నాయి. కాబట్టి, ఈ విధానాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సులభంగా అమల్లోకి తేవొచ్చు. ఇక ఉత్తరాది రాష్ట్రాలకు వస్తే– సాధారణ ఎన్నికలు నిర్వహించడానికిగానూ దేశం లోని మూలమూలల్లోకీ ప్రవేశించడానికి మనం దారులు వెతుకుతూ, సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లి ఎలాగైతే పోలింగ్‌ కేంద్రాలు, బసలు ఏర్పాటు చేసుకుంటామో ఆ విధానమే ఇక్కడా పాటించాలి. ఇందుకోసం ప్రభుత్వోద్యోగుల సేవలను వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారికి అదనపు పారితోషికం ఇవ్వాలి. అయితే దీన్నంతటినీ అమలు చేయడంలో భౌతిక దూరాన్ని పాటిం చడం ఎలాగో తర్ఫీదు ఇవ్వాలి.

3. అందరికీ ఆహారం అందడం ముఖ్యం. వలస కూలీలకు, లేదా వారిలాగే ఆయా ప్రదేశాల్లో చిక్కుబడిపోయిన అందరికీ సుమారు 2, 3 నెలలకు వర్తించేట్టుగా తాత్కాలిక రేషన్‌ కూపన్లు జారీచేయాలి. ప్రస్తుతం దేశంలో ఆధార్‌ కార్డులు లేని వారు చాలా తక్కువ. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వలస జీవులు అందరూ వాళ్ల దగ్గర ఆధార్‌ కార్డులు ఉంచుకుంటారు. దానిమీద వారు వలస వచ్చినవారేనని ధ్రువీకరించుకోవడానికి అవసరమైన వారి స్వస్థల వివరాలు ఉంటాయి. తాత్కాలిక రేషన్‌ కూపన్లు ఇచ్చేందుకు ఈ ఆధార్‌ కార్డులను ప్రాతిపదికగా తీసుకోవచ్చు. వీటిద్వారా వాళ్లు సాధారణ రేషన్‌ దుకాణాల్లోంచి తమకు అవసరమైన తిండి గింజలు పొందవచ్చు. కాస్త విచారిస్తే మొత్తంగా ఆహారం కావాల్సిన వలసజీవులు,  పేదలు ఎక్కడున్నారో తెలుసుకోవడం కష్టం కాదు. ఈ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది.

4. ఒకసారి ప్రభుత్వం గనక ముందుకు అడుగువేస్తే, ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకువస్తారు. అన్ని మతాల్లోనూ, అన్ని ధార్మిక ఆలోచనాధారల్లోనూ అన్నదానం అనేదానికి ఉత్కృష్ట విలువ ఉంది. కాబట్టి అడగాలేగానీ, పేదల ఆకలి తీర్చడానికి ఎంతోమంది సంతోషంగా ముందుకు వస్తారు.

5. హైదరాబాద్‌లోని స్వచ్ఛంద సంస్థల సమాఖ్య(కోవా) అనే స్వచ్ఛంద సంస్థ గగన్‌ పహాడ్, కాటేదాన్‌ ప్రాంతాల్లోని జనాన్ని, ముఖ్యంగా వలస కార్మికులను సర్వే చేయడానికీ, వారిలో రేషన్‌ కార్డులేనివారెందరో గుర్తించడానికి, సాయం చేయడానికీ ఒక విధానం అవలంబిస్తోంది. దాని ప్రకారం–  పేరు/ ఫోన్‌ నంబర్‌/ ఇంటి నంబర్‌/ ఆధార్‌ కార్డు నంబర్‌/ ఆధార్‌ కార్డులో నమోదైన నివాసిత ప్రాంతం/ పనిచేస్తున్న కంపెనీ పేరు/ కంపెనీ చిరునామా/ కుటుంబ సభ్యుల సంఖ్య/ ప్రత్యేక విషయాలు (భర్త కోల్పోయిన స్త్రీలు, వృద్ధులు, అనాథలు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు తదితరుల వివరాలు) నమోదు చేసుకుంటారు. మిగతా ప్రాంతాల్లోనూ రేషన్‌ కూపన్లు అందచేయడానికి అవసరమైన వివరాలను తెలుసుకోవడానికి కూడా ఈ విధానాన్ని పాటించవచ్చు. అవసరమైతే ఆయా పరిస్థితులకు తగినట్టుగా ఈ నమూనాలో మార్పులు ఎట్లాగూ చేసుకోవచ్చు. ఇవన్నీ జాగ్రత్తగా మనం అమలు చేయగలిగితే వలస జీవుల్లో, నిరుపేద వర్గాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితులు రావు. 

కె.ఆర్‌. వేణుగోపాల్‌
వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్‌

(కె.ఆర్‌.వేణుగోపాల్‌ ప్రధానమంత్రి కార్య దర్శిగా, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రత్యేక ‘ప్రతినిధి’గా పనిచేశారు. 1980వ దశకంలో ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రారంభమైన రెండు రూపాయలకు కిలో బియ్యం పథక రూపశిల్పి. ‘డెలివరెన్స్‌ ఫ్రమ్‌ హంగర్, ది ఇండియన్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌’, ‘ది ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రోగ్రామ్‌– ఎ ఫ్లాగ్‌షిప్‌ అడ్రిఫ్ట్‌’ పుస్తకాల రచయిత)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top