భయపెడుతున్న ఎన్నికలు | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న ఎన్నికలు

Published Sun, May 6 2018 12:26 AM

Karnataka Assembly Elections Fear To Parties - Sakshi

‘ఒక దేశం, ఒకేసారి ఎన్నికలు’ అనే నినాదం ఆచరణ సాధ్యమో కాదో ఎవ్వరూ అధ్యయనం చేసి నిర్ధారించలేదు. ఎన్నికల సంఘం సరేనన్నది. రాజ కీయ పక్షాలు ఆమోదించాలి. తక్కిన విషయాలు ఎట్లా ఉన్నప్పటికీ ఈ విధానం ఒకందుకు చాలా అవసరం అనిపిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఐదు సంవత్సరాల పొడవునా అసెంబీ ఎన్నికలో, స్థానిక సంస్థల ఎన్నికలో జరుగుతూ ఉంటే ఎంత రాద్ధాంతం జరుగుతుందో, ఎన్ని అవాంఛనీయ ఘటనలు జరుగుతాయో, ఎంత అనర్థం జరుగుతుందో 66 సంవత్సరాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా గత నాలుగేళ్ళుగా ఇటువంటి అనారోగ్యకరమైన ధోరణులు ముమ్మరమైనాయి. ఏ మూలన ఎన్నికల ప్రచారం జరిగినా సదరు దృశ్యాలను దేశ ప్రజలందరి ముంగిట్లోకి టీవీ చానళ్ళు చేరవేస్తున్నాయి.

నాయకుల భాష ఎంత హింసాత్మకంగా ఉంటుందో, శరీరభాష ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో, వాగ్దానాలు ఆచరణలో ఎంత అసాధ్యంగా కనిపిస్తాయో, ప్రత్యర్థులపైన చేస్తున్న ఆరోపణలు ఎంత కంపరం కలిగిస్తాయో గుండె చిక్కబట్టుకొని గమనిస్తున్నాం. ఈ ధోరణికి ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం పరాకాష్ఠ. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ సాటిలేని మేటి. ప్రభావవంతంగా ప్రసంగించగల సామర్థ్యం, ప్రత్యర్థిపైన నిరంతరం శరసంధానం చేయగల నైపుణ్యం, సత్యాసత్య విభజన రేఖపైన విన్యాసాలు చేయగల లాఘవం ఆయన సొంతం. అయినప్పటికీ, 2014లో మోదీ మాటల తూటాలు పేలినట్టుగా ఇప్పుడు పేలడం లేదు. పదేళ్ళపాటు అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌ని గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రధాని పదవికి బీజేపీ అభ్యర్థిగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ వందలాది సభలలో తూర్పారపట్టారు. ఎన్నికలలో ఘనవిజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్ళు గడిచిపోయాయి.

ఆయన ఆధ్వర్యంలో అనేక పరిణామాలు జరిగాయి. కొన్ని గర్వించదగినవీ, గొప్పగా చెప్పుకోదగినవీ అయితే మరికొన్ని చింతించవలసినవీ, సిగ్గుపడవలసినవీ. నాలుగేళ్ళ కిందట జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ కాంగ్రెస్‌ పార్టీని అన్ని విధాలుగా వేధించారు. కాంగ్రెస్‌ లేని భారతదేశం (కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌) తన లక్ష్యం అంటూ చాటారు. అప్పుడు చావు దెబ్బ తిన్న కాంగ్రెస్‌ నాలుగేళ్ళలో ఒకింత కోలుకున్నది. మొన్న గుజరాత్‌లో బీజేపీకి చెమటలు పట్టిం చింది. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ వెన్నులో చలి పుట్టిస్తున్నది. కర్ణాటక సమరం జరుగుతున్నది కేవలం మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మధ్య కాదు. మోదీ–అమిత్‌షా జంటకూ రాహుల్‌ గాంధీ–సిద్ధరామయ్య జోడీకి మధ్య. 

ఎత్తులూ, పైఎత్తులూ
రణతంత్రంలోనూ, ఖడ్గచాలనంలోనూ మోదీకి సమ ఉజ్జీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. మోదీ వ్యూహాన్నే మోదీ కంటే ముందుగా అమలు చేయగల నేర్పు కర్ణాటక ముఖ్యమంత్రిది. గుజరాత్‌ ఎన్నికలలో ‘గుజరాతీ అస్మిత’ (ఆత్మగౌరవం)ను రగిలించి మోదీ గట్టెక్కారు. కర్ణాటకలో అదే సూత్రాన్ని సిద్ధరామయ్య అమలు చేస్తున్నారు. కర్ణాటక అస్తిత్వంపైన చర్చ పెట్టారు. కన్నడ భాషకు సర్వోన్నత స్థానం ఇవ్వాలంటూ ప్రబోధించారు. హిందీ భాష పెత్తనాన్నీ, ఢిల్లీ ఆధిపత్యాన్నీ ప్రశ్నించారు. కర్ణాటకకు ఒక ప్రత్యేక పతాకాన్ని సైతం ఆవిష్కరించారు. రాహుల్‌ గాంధీ కూడా వాగ్బాణాలు సంధించడం నేర్చుకున్నారు. మోదీ చేసిన సవాల్‌ను స్వీకరించి చేతిలో కాగితం ముక్క లేకుండా పదిహేను నిమిషాలకు మించి పునరుక్తి లేకుండా మాట్లాడుతున్నారు. మోదీ బ్యాటింగ్‌లో అగ్రగణ్యుడే. కానీ వికెట్టు సహకరించడం లేదు. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పను సమర్థిస్తూ మాట్లాడలేరు.

ఆయనపైన అవినీతి ఆరోపణలు ఉన్న సంగతి జగమెరిగిన సత్యం. బళ్ళారిలో రెడ్డి సోదరులను వేదికపైన కూర్చోబెట్టుకొని సిద్ధరామయ్య అవినీతి గురించి మాట్లాడితే, ముఖ్యమంత్రి పేరును ‘సిద్ధరూపయ్య’గా మార్చితే పండదు. తాను లోక్‌సభ ఎన్నికలలో రెండు స్థానాల నుంచి (వడోదర, కాశీ) పోటీ చేసి ఇప్పుడు సిద్ధరామయ్య పరాజయ భయం వల్లనే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారని విమర్శిస్తే అతకదు. రెండు సీట్లు తనకీ, మరో సీటు కుమారుడికీ అంటూ టూ ప్లస్‌ వన్‌ అని ఆక్షేపిస్తే, రెండు సీట్లు రెడ్డి సోదరులకీ, ఒక సీటు యెడ్డీకీ (యడ్యూరప్ప) అంటూ ‘టూ రెడ్డీ, వన్‌ ఎడ్డీ’ అని జవాబు చెప్పారు. సిద్ధరామయ్య హిందూ వ్యతిరేకి అంటూ మోదీ ప్రచారం చేస్తే తాను లౌకికవాదాన్ని అనుసరించే హిందువుననీ, మోదీ మతతత్వం పాటించే హిందూ అనీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా మాటకు మాట ఇంత టంచనుగా, ఇంత ఘాటుగా చెప్పిన కాంగ్రెస్‌ నాయకుడు ఇంతవరకూ మోదీకి తారసిల్లలేదు. 

కర్ణాటకకూ, దేశంలోని ఇతర రాష్ట్రాలకూ మధ్య కొంత వ్యత్యాసం ఉన్నది. అన్ని రాష్ట్రాలలోనూ ఉపప్రాంతాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్య ఉత్తరప్రదేశ్, బుందేల్‌ఖండ్‌ అంటూ వివిధ ప్రాంతాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ దక్షిణ కోస్తా జిల్లాలూ, ఉత్తరాంధ్ర, రాయలసీమ వేర్వేరుగా ఉన్నాయి. అన్ని ప్రాంతల ప్రజల ఓటింగ్‌ సరళి దాదాపు ఒకే రకంగా ఉంటుంది. కర్ణాటకలో ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక, బొంబాయి–కర్ణాటక (మరాఠా), హైదరాబాద్‌ కర్ణాటక (దక్కనీ) ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల ప్రజల ఆచారవ్యవహారాలలోనే కాకుండా రాజకీయ ప్రాథమ్యాలలోనూ భేదాలు ఉన్నాయి. సముద్రతీర ప్రాంతంలో, ఉత్తర కర్ణాటకలో హిందూ భావజాలానికి ఆదరణ కనిపిస్తోంది. ఇక్కడ లింగాయతుల, వీరశైవుల ప్రాబ ల్యం అధికం. యడ్యూరప్పకు పరపతి జాస్తి. దక్షిణ, మధ్య కర్ణాటక ప్రాంతాలలో వొక్కలిగల ఆధిక్యం ఎక్కువ. మాజీ ప్రధాని, జనతాదళ్‌ (సెక్యులర్‌) అధినేత హెచ్‌డి దేవెగౌడ పలుకుబడి ఈ ప్రాంతాలలో బలంగా ఉంటుంది.

ఆయన కుమారుడు కుమారస్వామికి కూడా విశేష ప్రాబల్యం ఉంది. అన్ని ప్రాంతాలలోని వెనుకబడిన కులాలవారూ, దళితులూ, ముస్లింలూ కాంగ్రెస్‌కు అండగా నిలుస్తారని అంచనా. సిద్ధరామయ్య జనతాదళ్‌ (ఎస్‌) నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ ‘అహిందా’(మైనారిటీలూ, దళితులూ, వెనుకబడిన కులాలవారూ) సూత్రాన్ని పాటించడం ప్రారంభించారు. ఈ లెక్క తప్పే అవకాశాలూ లేకపోలేదు. ఇటువంటి సూత్రాలను ఛేదించడంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా దిట్ట. 2013 ఎన్నికలలో మాత్రం కోస్తాతీరంలో ఉన్న 19 శాసనసభ స్థానాలలో 13 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. కన్నడిగులు కులాలవారీగా ఓట్లు వేస్తారనడానికి ఆధారాలు లేవు. పరిపాలనే ప్రాతిపదికగా నిర్ణయం తీసుకుంటారనడానికి నిదర్శనం ఉంది. ఇటీవలి కాలంలో ఒకే పార్టీని వరుసగా రెండు విడతల గెలిపించలేదు. ఏ పార్టీ కూడా సమర్థంగా, జనరంజకంగా పరిపాలించకపోవడమే ప్రధాన కారణం. అధికార పార్టీలో కలహాలు మరో కారణం.

పెరిగిన ఎన్నికల వేడి
వేసవితాపంతో పాటు ఎన్నికల వేడి తోడు కావడంతో కర్ణాటకలో వాతావరణం దుర్భరంగా పరిణమించింది. పరస్పర విమర్శలు ఆక్షేపణీయం కాదు. కానీ పార్టీలు హద్దు మీరుతున్నాయి. ఎన్నికల విన్యాసం ప్రమాదపుటంచుల్లో జరుగుతోంది. అందుకే ఆందోళన. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్‌ టిప్పు సుల్తాన్‌ను స్తుతించడం, అలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీలో జిన్నా చిత్రపటంపైన వివాదం చెలరేగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం విశేషం. ఈ రెండు పరిణామాల ప్రభావం కర్ణాటక ఓటర్లపైన పడుతుంది. ఇవి బుద్ధిపూర్వకంగా లేవనెత్తిన వివాదాలో లేక కాకతాళీయంగా తలెత్తినవో చెప్పడం కష్టం. కాంగ్రెస్‌ను ముస్లింలను మెప్పించే పార్టీగా, ఆ క్రమంలో హిందువులకు అపకారం చేసే పార్టీగా చిత్రించడం బీజేపీ ఎత్తుగడ. కర్ణాటక కోస్తా ప్రాంతంలో ప్రజలను మత ప్రాతిపదికపైన విభజించే ప్రయత్నం జరుగుతోంది. ముస్లింల చేతిలో హతులైన హిందూత్వవాదులంటూ 23 మంది మృతుల జాబితాను బీజేపీ నాయకులు బహిరంగ సభలలో చదివేస్తున్నారు.

ఆ జాబితాలో అశోక్‌పూజారి పేరు కూడా ఉంది. అతనిపైన హత్యాయత్నం జరిగిన మాట వాస్తవమే. కానీ బతికి బయటపడ్డాడు. ఆస్పత్రిలో కొన్ని రోజులు వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు టీవీ పెడితే బీజేపీ నాయకుడు ఒకరు మృతుల జాబితాలో తన పేరు చదవడం కనిపించింది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ ప్రాంతంలో జరిగిన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌కి జిహాదీ మనస్తత్వం ఉన్నదనీ, అది సమాజాన్ని చీల్చుతున్నదనీ ఆరోపించారు. ‘మేము వ్యాపారం చేయడానికి అనువైన వాతావరణం సృష్టించాలని కోరుకుంటుంటే వారు హత్యలు చేయడానికి వీలైన పరిస్థితులు కల్పిస్తున్నారు’ అంటూ మోదీ కటువైన విమర్శ చేసింది కూడా ఈ ప్రాంతంలోనే. వాస్తవానికి అక్కడ వైరం బీజేపీకీ, కొందరు ముస్లింలు ఏర్పాటు చేసుకున్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)కీ మధ్య. వారు వీరినీ, వీరు వారినీ హతమార్చుకుంటూ చంపుడు పందెం ఆడుతున్నారు. పీఎఫ్‌ఐ హత్యలకు కాంగ్రెస్‌ను నిందించాలన్నది బీజేపీ విధానం. ఆ జాబితాలో పేర్కొన్నవారిలో తొమ్మిదిమంది మాత్రమే మతకలహాలలో మరణించారనీ, తక్కినవారిది సహజ మరణమేననీ కాంగ్రెస్‌ వాదన. 

మతకలహాలలో ఓట్ల వేట
కోస్తా ప్రాంతంలో బీజేపీ పాతుకొని పోవడానికి ప్రయత్నిస్తోంది. హిందూత్వ భావజాలాన్ని ప్రచారం చేయడమే లక్ష్యంగా యోగి ఆదిత్యనాథ్‌ను రంగంలో దింపింది. 2013 ఎన్నికల ప్రచారంలో అప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండిన మోదీ వచ్చారు. ముస్లింల చేతిలో హతమైన వ్యాపారి దీపక్‌రావు ఇంటికి అమిత్‌షా ఫిబ్రవరి మొదటివారంలో వెళ్ళారు. దీపక్‌రావు కుటుంబానికి కర్ణాటక సర్కార్‌ రూ. 10 లక్షల పరిహారం అందజేసింది. బీజేపీ నాయకులు అంతకంటే అధిక మొత్తమే సేకరించి దీపక్‌రావు తల్లి ప్రేమలతకు ఇచ్చారు. స్థానిక శాసనసభ్యుడు మొహియుద్దీన్‌ బావా 5 లక్షల రూపాయలు ఇవ్వబోతే ప్రేమలత స్వీకరించలేదు. ‘ఇది హిందువుల ఇల్లు. అల్లా ఆశీస్సులతో గెలుపొందిన కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలకు ప్రవేశం లేదు’ అంటూ ఒక వ్యక్తి గట్టిగా శాసించారు. తన కుటుం బాన్ని బీజేపీ బాగా చూసుకున్నదని ప్రేమలత భావన. బషీర్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు.

అతని తండ్రి అబ్దుల్‌ని హిందువులు హత్య చేశారు. బషీర్‌ ఇంతవరకూ ఎన్నికలలో ఓటు వేయలేదు. ఈ సారి కాంగ్రెస్‌కు వేస్తానంటున్నాడు. తాను ఎన్నడూ మతం కోణంలో ఆలోచించలేదనీ, దుబాయ్‌లో తనకు ఆత్మీయ మిత్రుడు హిందువేననీ, మొన్ననే బెంగళూరులో ఒక హిందూ మిత్రుడి వివాహానికి హాజరై వచ్చాననీ బషీర్‌ చెప్పాడు. దీపక్‌రావును ఆస్పత్రికి హుటాహుటిన తరలించింది తన బాస్‌ మాజిద్‌. తన కుమారుడూ, మాజిద్‌ మంచి స్నేహితులని ప్రేమలతే అంటున్నారు. అశోక్‌పూజారిపై దాడి జరిగి చికిత్స చేయించుకున్న తర్వాత ఆస్పత్రి యాజమాన్యం భారీ బిల్లు చేతికి అందించినప్పుడు తన పరపతిని ఉపయోగించి బిల్లులో రూ. 20 వేల రూపాయలు తగ్గించిన వ్యక్తి స్థానిక క్రైస్తవ మతాధికారి. వివిధ మతాలకు చెందిన ప్రజలు సహజీవనానికి అలవాటు పడ్డారు. ఒకరి పట్ల ఒకరు మానవత్వంతో వ్యవహరించే సంస్కృతి ప్రజల హృదయాలలో బలంగా నాటుకున్నది.

వారి మానాన వారిని వదిలేస్తే వారు ప్రశాంతంగా జీవిస్తారు. మతాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించి ఓట్లు సంపాదించాలన్న దుర్బుద్ధి రాజకీయ పార్టీలది. అందుకని అయిదేళ్ళకు ఒక్కసారి ఎన్నికలు జరిగితే వాటి తాలూకు దుష్పరిణామాలు ఒక్కసారే ఉంటాయి. ఒకేసారి అన్ని రకాల (లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థలు వగైరా) ఎన్నికలూ పూర్తయితే అయిదేళ్ళ వరకూ కలహాలూ, కత్తులు దూసుకోడాలూ లేకుండా ప్రజలు కలిసిమెలిసి ఉంటారు. ఈ ఒక్క సౌలభ్యం కోసమైనా అన్ని ఎన్నికలనూ ఒకేసారి జరిపించడం అవసరం. కర్ణాటక ఎన్నికలు బీజేపీకీ, కాంగ్రెస్‌కీ ప్రతిష్ఠా త్మకమైనవి. జీవన్మరణ సదృశమైనవే. రెండు జాతీయ పార్టీలూ, జేడీ(ఎస్‌) శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నాయి. హోరాహోరీగా పోరాడుతున్నాయి. వచ్చే శనివారంనాడే పోలింగ్‌. ఈ సారి కన్నడిగులు ఏమి తీర్పు చెబుతారోనని దేశ ప్రజలందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

- కె. రామచంద్రమూర్తి

Advertisement
 
Advertisement