‘హోదా’ సాధనలో మరో అడుగు

Imam Writes On Andhra Pradesh Special Status - Sakshi

సందర్భం
వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటం మీద నిందలు వేయడానికో, లేదా ఆ పోరాటంతో వైఎస్సా ర్‌సీపీకి రాజకీయంగా ఏర్పడుతున్న సానుకూలమైన వాతావరణాన్ని నిరోధించడానికో పవన్, వామపక్షాలు పాదయాత్రలు చేపట్టారని భావించడం తొందరపాటు కాదు. చారిత్రక తప్పిదాలకు అలవాటుపడ్డ వామపక్షాలు వైఎస్సార్‌సీపీ చేస్తున్న న్యాయబద్ధ పోరాటం విలువను తగ్గించే కుట్రలో భాగస్వాములు కావడం శోచనీయం. హోదా సాధనలో మరో సారి చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు భవిష్యత్తులో మిగిలేవి ఛీత్కారాలే.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడానికి ఐదారేళ్ల క్రితం జరిగిన ఉద్యమాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నాడు కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఆ ఉద్యమాన్ని నీరు గార్చడానికి జరిగిన కుట్రలు, కుతంత్రాలు, మోసపు ఎత్తుగడలు తక్కువేమీ కాదు. ఉద్యమాన్ని చీల్చడానికీ, ప్రజలను తప్పుదోవ పట్టించడానికీ కాంగ్రెస్, తెలుగుదేశం తమ వంతు ప్రయత్నం చేశాయి. మరోవైపు రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్, తెలుగుదేశంతో కలసి బీజేపీ కూడా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించింది. నేడు మళ్లీ అవే కుట్రలు, కుతంత్రాలు మరొక రూపంలో పునరావృతమవుతున్నాయి. 

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని కొంచెమైనా సరిదిద్దడానికి ప్రయత్నం చేయనందుకు, ప్రత్యేక హోదాను నిరాకరించినందుకు వైఎస్సా ర్‌సీపీ ఎంపీలు పదవులకు రాజీనామాలు సమర్పించాలని శుక్రవారం నిర్ణయించారు. ఆపై ఆంధ్రప్రదేశ్‌ భవనం ఎదుట ఆమరణ దీక్షను చేపట్ట బోతున్నారు. పార్లమెంటు చరిత్రలోనే కనీవినీ ఎరుగుని రీతిలో 14 సార్లు ఎన్డీయే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఏదో కారణంతో వాటిని పక్కన పెడుతూనే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీ ఎంపీలు సభ్యత్వాలకు రాజీనామా చేయాలన్న తీవ్ర నిర్ణయానికి రావలసి వచ్చింది.

ప్రత్యేక హోదా పోరుకు మద్దతు ఇస్తున్నవారికీ, ఆ పోరులో తోడుగా నిలిచినవారికీ ఇది శుభవార్త. ఐదుగురు ఎంపీలు పంచపాండవుల్లాగా ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంత పోరాటం చేశారు. ప్లకార్డులతో రోజుల తరబడి నినాదాలు చేశారు. వీరికి దాదాపు 100 మంది ఎంపీల మద్దతు కూడా ఉంది. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉద్యమిçస్తున్న రాజకీయ శక్తులకు ఆ పోరాట పటిమ ఉత్తేజాన్ని కలిగిస్తున్నది. బడ్జెట్‌ సమావేశాల చివరిరోజు, అంటే ఈ నెల 6వ తేదీ, శుక్రవారం అవిశ్వాస తీర్మానం చేపట్టకపోతే రాజీనామాలు చేస్తామని ఎంపీలూ, ప్రత్యేకించి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. 

పాదయాత్రల పరమార్థం ఏమిటి? 
ఈ నేపథ్యంలోనే సినీనటుడు పవన్‌కల్యాణ్‌ తెర మీదకు రావడం చర్చ నీయాంశంగా మారింది. అనూహ్యంగా ఈ నెల 6వ తేదీన, అంటే ఇవాళే ఆయన వామపక్షాలతో కలసి  ప్రతి జిల్లాలోనూ పాదయాత్రలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ ఆందోళన కార్యక్రమం పూర్తిగా ఏకపక్షమైనది. ప్రత్యేక హోదా కోసం పోరాడేశక్తుల మధ్య అనారోగ్యకరమైన వాతావరణం సృష్టించటానికి దోహదపడుతుంది.

పవన్‌కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేదని మొదట సరిపెట్టుకున్న వామపక్షాలే ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం శోచనీయం. ఎందుకంటే– పవన్‌కల్యాణ్‌ గత  ఆచరణ అంతా కూడా గందరగోళమే. గతంలో ఆయన అనంతపురం జిల్లాలో జరిపిన పర్యటన గురించి ఒకసారి ఆలోచిస్తే పవన్‌కల్యాణ్‌ ఆచరణ, అందులోని చిత్తశుద్ధి ఏమిటో సులభంగానే అర్థమవుతాయి.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కవచంలా నిలిచి, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్లో గందరగోళం సృష్టించడమే ఆయన ధ్యేయం. కరవు ప్రాంతాలలో పర్యటన పేరుతో పవన్‌ అనంతపురం జిల్లాలో మూడురోజులు ఉన్నారు. కానీ ఆ పర్యటన కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించిన వారు ఆయన కరవు పర్యటనకు వచ్చినట్టు భావించలేకపోయారు. ఎందుకంటే, జిల్లా స్థితిగతులు తెలుసుకోవాలంటే వామపక్షాల నాయకులు, రచయితలు, మేధావులు, కవులు, ప్రజా సంఘాల వారిని కలుసుకోవాలి. వారితో చర్చించాలి.

అప్పుడు వాస్తవాలు అవగతమవుతాయి. అయితే పవన్‌ కల్యాణ్‌ చేసినదేమిటి? కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను కలుసుకోవడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఈ ధోరణి మీద అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పవన్‌ తొలి రాజకీయ పర్యటన మీద ప్రజలు, రాజకీయపార్టీల్లో ఏర్పడిన ఆసక్తి కూడా నీరుగారింది. పవన్‌ అసలు స్వరూపం ఏమిటో సుస్పష్టమైందనీ, జనసేనను ఓ రాజకీయపార్టీగా పరి గణించవలసిన  అవసరం కూడా లేదనీ ప్రజలు అభిప్రాయానికి వచ్చారు. ఈ అనుభవంతోనైనా పవన్‌ తన వైఖరిని మార్చుకుని ఉండవలసింది. కానీ ఏదో ఒక సాకుతో టీడీపీకి కవచంలా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇదంతా చూసిన వారికి పవన్, చంద్రబాబుల ఎజెండా ఒక్కటే అని సుస్పష్టమైంది.

ఆత్మహత్యలు కన్పించలేదా?
అప్పుల బారిన పడి బలవన్మరణాల పాలైన రైతులు ఈ జిల్లాలో ఎందరో! తమవారిని పోగొట్టుకున్న రైతు కుటుంబాలు వందలాదిగా ఉన్నాయి. ఆ కుటుంబాలలో ఒక్క కుటుంబాన్ని కూడా పవన్‌ పరామర్శించలేదు. బల వన్మరణాలకు దారి తీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఆయా కుటుం బాల వారితో మాటామంతీ కూడా జరపలేదు. వలసలు కూడా ఈ జిల్లాలో ఎక్కువే. రైతులు, వ్యవసాయ కూలీలు లక్షలాదిగా తమిళనాడు, కేరళ, బెంగళూరు తదితర ప్రాంతాలకు పొట్టచేత పట్టుకొని వలసపోయారు. ఇలా వలసలు వెళ్లినవారి కుటుంబాలను కూడా పవన్‌ కలుసుకోలేదు.

గ్రామాల్లో మిగిలిన ముసలి, ముతకలను కలసి వలసలకు గల కారణాలను తెలుసు కోవడానికీ, వారి వాస్తవ పరిస్థితులను అవగతం చేసుకోవడానికీ ఏమాత్రం ప్రయత్నించలేదు. వందలాదిగా ఆడపడుచులు ముంబై, ఢిల్లీ, పుణే తదితర పట్టణాలలోని వేశ్యాగృహాలకు తరలివెళ్లడమో, లేదంటే ఎవరో తరలించ డమో జరిగిన పరిస్థితుల పైన కూడా ఆరా తీయడం గురించి కానీ, అధ్య యనం చేయడం పైన కానీ ఆయన ఆసక్తి చూపలేదు. ఆయన అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వర దాపురం సూరిలను కలిశారు. సునీత ఇంట విందు ఆరగించారు.

ధర్మవరంలో ఏకంగా టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. తాను కొన్ని విలువల కోసమే రాజకీయాలలో ప్రవేశించానని చెబుతున్న పవన్‌ నిర్వాకం మరొకటి ఉంది. తనను గెలిపించిన రాజకీయ పార్టీకీ, ప్రత్యేకించి జగన్‌ మోహన్‌రెడ్డికీ ద్రోహం చేసి అమ్ముడుపోయిన అత్తార్‌ చాంద్‌బాషా ఇంటికి వెళ్లారు. ఇది ఎలాంటి సంకేతాలను పంపుతుంది? తన అనంతపురం జిల్లా పర్యటన విఫలమైన సంగతి పవన్‌కల్యాణ్‌కు వెంటనే తెలిసివచ్చింది. 

చారిత్రక తప్పిదాలు వారి అలవాటు
గుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ల మీద పవన్‌కల్యాణ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సభలో మాట్లాడిన తీరునూ, ప్రస్తావించిన అంశాలనూ గమనించిన చంద్రబాబు వ్యతిరేక శిబిరంలోని రాజకీయ శక్తులకు పవన్‌ సరైన మార్గంలోనే పయని స్తున్నట్టు కనిపించింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్‌మోహన్‌రెడ్డి తమ ఎంపీలతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిస్తే, తాను దేశమంతా తిరిగి మద్దతు కూడగడతానని ఒక సందర్భంలో ఆయన వైఎస్సార్‌సీపీకి  సూచిం చారు. దీనికి వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు కూడా.

చంద్రబాబుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిస్తే తాము మద్దతు ఇస్తామనీ, లేదా మేము అందుకు నోటీసు ఇస్తామనీ, చంద్రబాబు పార్టనర్‌ పవన్‌ మాకు మద్దతు ఇవ్వాలనీ కోరారు. దీనితో కంగుతిన్న పవన్‌ చంద్ర బాబుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ వామపక్షాలతో కలసి రాజకీయ కార్యాచరణలను ప్రకటిస్తున్నారు. శుక్రవారం పవన్, వామపక్షాలు ఎటు వంటి రాజకీయ కార్యక్రమాన్ని చేపట్టినా చంద్రబాబుకు అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుంది.

ఏమైనా వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటం మీద నిందలు వేయడానికో, లేదా ఆ పోరాటంతో వైఎస్సార్‌సీపీకి రాజ కీయంగా ఏర్పడుతున్న సానుకూలమైన వాతావరణాన్ని నిరోధించడానికో పవన్, వామపక్షాలు పాదయాత్రలు  చేపట్టారని భావించడం తొందరపాటు కాదు. చారిత్రక తప్పిదాలకు అలవాటు పడ్డ వామపక్షాలు వైఎస్సార్‌సీపీ చేస్తున్న న్యాయబద్ధ పోరాటం విలువను తగ్గించే కుట్రలో భాగస్వాములు కావడం శోచనీయం. 

ప్రత్యేక హోదా సాధన సమితి తెలుగు ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఇటీవల తన రాజకీయ కార్యచరణను తీర్చిదిద్దుకుంటున్నది. మొన్న ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ప్రత్యేక హోదా సాధన పోరులో ఆయన జరుపుతున్న కృషిని సమితి నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు, ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేయడానికి దేశ రాజధానికి వెళుతున్నట్టు కూడా సాధన సమితి నేతలు ప్రకటించారు. ఇటువంటి కార్యా చరణకు కలసి రావడానికి పవన్‌కల్యాణ్‌కూ, వామపక్షాలకూ వచ్చిన ఇబ్బంది ఏమిటి?

పైగా పోటీగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉభయ గోదావరి జిల్లాల్లో వామపక్షాల మీద చంద్రబాబు ప్రభుత్వం పోలీ సులతో దమనకాండ జరిపితే వైఎస్‌ జగన్‌ హుటాహుటిన వెళ్లి వారి పోరా టానికి మద్దతు ప్రకటించారు కదా! ఒక సందర్భంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అక్రమంగా నిర్బంధించిన అంశాన్ని అసెంబ్లీలో లేవలెత్తి దాదాపు సభను స్తంభింపజేసి చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని విపక్షనేత ఇరకాటంలో పెట్టలేదా? విపక్షాలతో కలసి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వైఎస్సార్‌సీపీ చూపుతున్న చొరవ నిర్మాణాత్మకంగా కనిపిస్తుంది.

అలాంటి కృషిలో ఆ పార్టీ అధినేత చూపుతున్న నిబద్ధత ఎప్పుడో వెల్లడైంది. రాష్ట్రానికి చిత్తశుద్ధితో ప్రత్యేక హోదాను కోరుకునే వారందరూ చంద్ర బాబు ప్రభుత్వానికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా ఐక్యం కావాలి. నిజంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు కాంగ్రెస్‌తో మొదలుకొని అన్ని రాజకీయ పార్టీలను కలసి ప్రత్యేకహోదా సాధన కోసం మార్గదర్శకంగా నిలి చారు. అటువైపు వపన్‌కల్యాణ్, వామపక్షాలు కూడా ఇలాంటి ఐక్య కార్యా చరణకు దోహదపడితే రాష్ట్రానికి మంచిది. ఈ సందర్భంలో ప్రత్యేక హోదా కోసం చలసాని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ‘హోదా సాధన సమితి’ జరుపుతున్న కృషికి జేజేలు. హోదా సాధనలో మరోసారి చీలికలు తేవడానికి ప్రయత్ని స్తున్న శక్తులకు భవిష్యత్తులో మిగిలేవి ఛీత్కారాలే.

వ్యాసకర్త కదలిక సంపాదకులు

ఇమామ్‌

మొబైల్‌ : 99899 04389 
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top