హైదరాబాద్‌ హైకోర్టుకు వందేళ్లు

Hyderabad High Court Building Turns 100 Year Old - Sakshi

సందర్భం 

చరిత్రలో వందేళ్లు చాలా తక్కువ సమయం. వ్యవస్థల విషయంలోనూ అంతే! కానీ వ్యక్తి జీవితంలో అది ఓ సుదీర్ఘ ప్రయాణం. తెలంగాణ హైకోర్టు భవనం ఏర్పడి ఏప్రిల్‌ 20, 2019కి వందేళ్లవుతుంది. హైదరాబాద్‌ రాజరిక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏడవ నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఈ భవనాన్ని నిర్మింపజేశాడు. మొదట పథేర్‌ గట్టిలాంటి ప్రాంతాల్లో హైకోర్టు తన కార్యకలాపాలని నిర్వహించేది. దాంట్లోని ఇబ్బందులను గమనించి మూసీ నది ఒడ్డున హైకోర్టు భవన నిర్మాణం చేయాలని నిజాం రాజు 1915లో సంకల్పిం చాడు. జైపూర్‌కి చెందిన శంకర్‌లాల్‌ అనే ఆర్కిటెక్ట్‌ ఇంజనీర్‌ ఈ భవన నిర్మాణ ప్లాన్‌ని రచించారు. మెహర్‌ అలీ ఫజల్‌ అనే స్థానిక ఇంజనీర్‌ ఆ ప్లాన్‌ని అమలు చేశారు. విన్సెంట్‌ జె. ఎస్టీ ఈ భవన నిర్మాణానికి అవసరమైన సూచనలను అందించారు. భవన నిర్మాణం ఏప్రిల్‌ 15, 1915న మొదలై మార్చి 31, 1919కి పూర్తి అయింది. తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవనాన్ని నిజాం రాజు ఏప్రిల్‌ 20, 1920న ప్రారంభిం చాడు. న్యాయవ్యవస్థ పూర్తిగా 7వ నిజాం రాజు చేతిలో ఉండేది. కానీ ఆయన ఎప్పుడూ తన లబ్ధికోసం తన అధికారాలను వినియోగించుకోలేదు. తన వ్యక్తిగత ఆస్తుల విషయంలో కోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దాన్ని అప్పీలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశాడు. 

ఈ వందేళ్ల కాలంలో ఈ హైకోర్టు రకరకాల పేర్లతో చలామణి అయింది. ప్రధానంగా ఇది హైదరాబాద్‌ హైకోర్టుగా గుర్తింపు పొందింది. భారతదేశంలో విలీనం తర్వాత కూడా అదే పేరుతోనే కొనసాగింది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. వారి రాజధాని కర్నూల్‌. హైకోర్టుని గుంటూరులో ఏర్పాటు చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో హైదరాబాద్, ఆంధ్రా రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాలకు చెందిన రెండు హైకోర్టులను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఏర్పాటు చేశారు.

 1956 నవంబర్‌ 5న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పడిన నాటినుంచి తెలంగాణ న్యాయవాదులకు గాయాలు అవడం మొదలైంది. ఈ 62 ఏళ్లుగా తెలంగాణ న్యాయవాదులూ, న్యాయమూర్తులూ, సిబ్బందీ వివక్షకు గురవుతూనే ఉన్నారు. తెలంగాణ న్యాయవ్యవస్థ చరిత్ర తెలి యకుండా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పడగానే హైదరాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన పదవిని పోగొట్టుకుని మామూలు హైకోర్టు జడ్జిగా బొంబాయి హైకోర్టుకి బదిలీ అయ్యారు. తెలంగాణ న్యాయమూర్తులు ఆంధ్రా న్యాయమూర్తులకు జూనియర్లుగా మారిపోయారు. హైదరాబాద్‌ హైకోర్టు సిబ్బంది ఆంధ్రా హైకోర్టు సిబ్బంది చేతుల్లో అవమానాల పాలైనారు. ఆంధ్రప్రదేశ్‌ ఉనికిని ప్రశ్నించిన సీనియర్‌ న్యాయవాది కిషన్‌ ప్రసాద్‌ వాదనలను వినకుండానే హైకోర్టు తన పనిని ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనలో ఆంధ్రా వాళ్ల పెత్తనమే కొనసాగింది. న్యాయ పరిపాలనలో కూడా అదే జరిగింది. ఫలితంగా న్యాయవ్యవస్థలో తెలంగాణ ప్రాతానికి చెందిన న్యాయమూర్తుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. హైకోర్టు సిబ్బంది విషయంలో కూడా అదే జరిగింది. జిల్లాల్లో కూడా ఆ పరిస్థితి కొనసాగింది. 

ఈ దశలో రెండు రాష్ట్రాలకి అతి కష్టంగా రెండు హైకోర్టులు ఏర్పాటైనాయి. న్యాయమూర్తుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తెలంగాణకి 13 మంది న్యాయమూర్తులనూ, ఆంధ్రప్రదేశ్‌కు 11 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ఒక న్యాయమూర్తి పదవీ విరమణ చేశారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్‌ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. జనవరి 10, 2019న ఆయన  బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియమ్‌ సిఫార్సు చేసింది. ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన 10 రోజుల్లో బదిలీ చేయడంలోని ఔచిత్యం చాలామందికి బోధపడలేదు. ఈ సిఫార్సును పున:పరిశీలించాలని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. కానీ సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. చివరకు ఆయన్ని బదిలీ చేశారు. బదిలీ చేసిన తర్వాత తెలంగాణ హైకోర్టుకు మరో ప్రధాన న్యాయమూర్తిని నియమించలేదు. సీనియర్‌ న్యాయమూర్తి రాఘవేంద్ర చౌహాన్‌ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తుల విధానం దీర్ఘకాలం కొనసాగితే సత్ఫలితాలను ఇవ్వదు. రెండు రాష్ట్రాల్లో హైకోర్టుల న్యాయమూర్తుల సంఖ్య పరిమిత స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం.. పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తులు లేకపోవడమేనని చాలామంది న్యాయవాదుల అభిప్రాయం. 

న్యాయవ్యవస్థకి ఎవరూ అపకారం చేయలేరు. న్యాయవ్యవస్థే తనకు తాను అపకారం చేసుకుంటుం దని చాలామంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆలోచించాల్సిన విషయమేననిపిస్తుంది. హైకోర్టులలో న్యాయమూర్తుల ఆవశ్యకతని న్యాయవ్యవస్థ ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గుర్తిం చాలని ఆకాంక్ష. (తెలంగాణ హైకోర్టు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా)

- మంగారి రాజేందర్‌ (వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జీగా పనిచేశారు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top