ధిక్కార స్వరం గిరీష్‌

Guest Column By Narayana rao Over Girish Karnad - Sakshi

నాటక రచయిత, సినిమా నటుడు, ప్రముఖ సామాజికవేత్త గిరీష్‌ కర్నాడ్‌ దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యని ఎదుర్కొంటూ శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో సోమవారం ఉదయం బెంగళూరులోని ఆసుపత్రిలో మృతిచెందారు. మహారాష్ట్రలో మే 19, 1938లో జన్మించిన గిరీష్‌ కర్నాడ్‌ 1958లో కర్ణాటక యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు. 1963లో ఎం.ఏ విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం, పొలిటికల్‌ సైన్స్, అర్ధశాస్త్రాలను అభ్యసించారు. సామాజిక విలువల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తూ హిందుత్వవాదుల నుంచి నిర్భంధాన్ని ఎదుర్కొన్నారు.  

కన్నడ సినిమాలో రచయితగా, ఫిలింమేకర్‌గా, సామాజిక ఉద్యమకారుడిగా సమాజంలో తన బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించారు. 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 1998లో జ్ఞాన పీఠ అవార్డును స్వీకరించారు. 2017లో ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్‌ హత్య అనంతరం ఆ హింసను ఖండించడంలో  ముందు వరుసలో నిలబడ్డారు. ఒక గౌరీని హత్య చేస్తే మేమందరం గౌరీలుగా మారతామని ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చారు. గిరీష్‌ కర్నాడ్‌ చాలా నాటకాలు రాశారు. 1961లో యయాతి, 1972లో హయ వదన, 1988లో నాగమందాల రచించారు. తెలుగు, కన్నడ సహా పలు భాషల్లోని సినిమాల్లో నటించారు.  అంతేకాక పలు హిందీ సినిమాల్లో కూడా నటిం చాడు.  

దేశంలో 300 సంస్థలతో పుణేలో ఎల్గార్‌ పరిషత్‌ ఏర్పడి భీమాకొరేగాంలో దళితులు తమ ఉద్యమ ఆకాంక్షను ప్రకటిస్తే.. దాన్ని అణచివేయడం కోసం హిందుత్వ శక్తులు హింసకు పాల్పడి, ఇద్దరు దళితులను హత్య చేశాయి. హిందుత్వ శక్తులపై చట్టబద్ధ చర్యలు తీసుకోలేని ప్రభుత్వం, దోషులను విడిచిపెట్టి, ప్రజాస్వామిక వాదులైనటువంటి మేధావులను, ప్రొఫెసర్లను, న్యాయవాదులను అక్రమంగా అరెస్టు చేసి ఏడాది కాలంగా బెయిల్‌ రాకుండా పుణేలోని ఎరవాడ జైల్లో నిర్బంధించారు. ఈ నిర్బంధాల వెనుక ప్రధాన కారణంగా అర్బన్‌ నక్సల్‌ అనే పదాన్ని తీసుకువచ్చి అందరిమీద క్రూర నిర్బంధాన్ని అమలుచేస్తోంది.

దీన్ని నిరసిస్తూ తానూ అర్బన్‌ నక్సల్‌నేనని మెడలో బోర్డు వేసుకొని ప్రపంచానికి తెలియజేశారు, ప్రభుత్వాలను సవాల్‌ చేశారు. ప్రజాస్వామికవాదులపై జరుగుతున్న దాడులను నిలదీయడంలో తనవంతు బాధ్యతను నిర్వహించిన గిరీష్‌ కర్నాడ్‌ జీవితం చాలా విలువైనదని భావిస్తున్నాం. అలాగే హక్కుల కోసం పోరాడే ఏ ప్రజాస్వామిక గొంతుకలకైనా మద్దతుగా పౌరహక్కుల సంఘం నిలబడుతుందని తెలియ జేస్తూ గిరీష్‌ కర్నాడ్‌లాగా పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఆయన స్ఫూర్తితో ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.  

ఎన్‌. నారాయణరావు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌరహక్కులసంఘం 
మొబైల్‌ : 98667 34867  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top