ఆమె ప్రకృతి–సమతూకం ప్రవృత్తి

Dilip Reddy Writes Guest Column About Coronavirus - Sakshi

సమకాలీనం

‘‘పాడు అనుభవాన్ని వదిలించుకో, కానీ, పాఠాన్ని మాత్రం భద్రపరచుకో’’ అంటారు ప్రఖ్యాత అమెరికా రచయిత, బ్లాగర్‌ ఫ్రాంక్‌ సోనెన్‌బెర్గ్‌. ఇటీవలి కాలంలో... మానవ జాతి యావత్తు ఎదుర్కొంటున్న కఠిన పరీక్ష కరోనా! మానవేతిహాసంలో పెద్ద మారణ హోమాలనుకున్న ప్రపంచ యుద్దాల కన్నా ఇది పెద్ద కుదుపు. కొనసాగుతూనే ఉన్న ఈ ఉపద్రవం ఎందాకో తెలియని ఆందోళన! చైనాలో మొదలై... భూగోళం అన్ని కొసల దేశ దేశాల్లోకి వీసా, రాజ పత్రాలు లేకుండానే ఈ వైరస్‌ చొరబడింది. సురక్షిత ఆరోగ్య వ్యవస్థల్నీ ధ్వంసంచేసి జీవితాల్ని కకావికలం చేస్తోంది. విశ్వవ్యాప్తంగా దాదాపు పది లక్షల మందికి సోకి, సుమారు యాబైవేల మందిని ఇప్పటికే పొట్టన పెట్టుకుంది. మధ్య ప్రాచ్యంలో చిచ్చు రేగింది. వైరస్‌ దాడికి అభివృద్ధి చెందిన యూరప్‌ సమాజం అతలాకుతలమైంది. అగ్ర రాజ్యం అమెరికా రోజుకో రీతిన వణకుతోంది. భారత్‌ యుద్దమే ప్రకటించింది. భూమి మీద ఇప్పుడు.. అత్యవసరాలు తప్ప వ్యవస్థ లన్నీ నిలిచిపోయాయి. మనిషి క్రియాశీల మనుగడకు తాళం పడింది. వైరస్‌ సోకితే చికిత్సకు మందు, రానీకుండా నివారణకు వాక్సిన్‌.. కనుగొనే పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.
 
ప్రపంచమంతా నివ్వెరపోతోంది! ఏమిటీ? ఇన్నేళ్ల కృషిలో మనిషి సాధించిన శాస్త్రసాంకేతిక ప్రగతి ఇంతేనా? కనీసం జీవి కూడా కాని ఒక ప్రోటీన్‌ కణం ఇంత విధ్వంసం చేస్తే సమాధానం లేదా? సమ ర్థంగా ఎదుర్కోలేడా? నేలపై మనిషి తుది విజేత కాడా? ఇవి ఇప్పుడు జనం మెదళ్లలో మొలుస్తున్న ప్రశ్నలు. సహజ వనరుల నెలవు, జీవ వైవి«ధ్యానికి తల్లి అయిన సర్వసత్తాక ప్రకృతి ముందు మనిషి ఎప్పుడూ... అల్పజీవే! ఈ సత్యాన్ని రుజువు చేస్తోంది తాజా విపత్తు! ఏది, ఎప్పుడు హద్దు మీరినా దాన్ని నియంత్రిస్తూ సమస్త జీవరాశినీ సమతూకంలో ఉంచే ప్రకృతి స్వీయ నియంత్రణ ప్రక్రియలో భాగమేనా ఈ విలయం? అనే సందేహాన్ని మేధావి వర్గం వ్యక్తం చేస్తోంది. సరే, వైరస్‌పై పోరాటంలో మనిషి నెగ్గి, శాస్త్ర పరిశోధనలు ఫలించి, వీలయినంత తొందరగా ఈ విపత్తుకు పరిష్కారం లభిం చాలనే అందరూ కోరుకుంటున్నారు. ఈ చేదు అనుభవం మనిషికి ఓ గట్టి గుణపాఠం అవుతుందా? అయితే బాగుండు కద! మనిషి మళ్లీ పాతరోజుల్లోకి జారి.. ప్రకృతితో మమేకమై, జీవవైవిధ్యంతో సహ జీవనం చేస్తూ, మంచి మానవ సంబంధాలతో, పేరాశ వీడి జీవితాన్ని సరళం చేసుకుంటే ఎంత బాగుండు! అనే సనసన్నని కోర్కెలు ఆశావ హుల మదిలో రేగుతున్నాయి. ప్రస్తుత ‘లాక్‌డౌన్‌’ కాలంలో బలవం తంగానైనా స్వీయనియంత్రణతో సంక్రమించే మంచి అలవాట్లను జనం మానకుండా కొనసాగిస్తే బాగుంటుందనేది ఆశ!

ప్రకృతిని భంగపరిచినందుకే...
రకరకాల జీవుల్ని చైనా వాళ్లు ఆహారంగా తినడం కరోనా వ్యాప్తి తర్వాత పెద్ద చర్చనీయాంశమైంది. ఎలుకల్ని, తేళ్లని, పాముల్ని, గబ్బి లాలను తినడాన్ని చాలా సమాజాలు ఈసడించుకున్నాయి. కిక్కిరిసిన వారి మాంసాహార మార్కెట్ల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టాయి. ప్రకృతి విరుద్దమైన మనిషి నడతవల్లే ఇలాంటి ఉపద్రవాలొస్తాయని చాలా మంది భావించారు. విశ్వవ్యాప్త లాక్‌డౌన్‌ తర్వాత జనం ఇళ్లకే పరిమితమై... విమానాశ్రయాలు, నౌకా శ్రయాలు విశ్రాంతిలోకి జారినపుడు గమ్మత్తులే జరిగాయి. జాతీయ– స్థానిక రహదారులు వాహనాలు లేక బోసిపోయినపుడు, వీధులు సడి– సందడి లేని వాకిళ్లయినపుడు వన్యప్రాణులు స్వేచ్ఛగా జనావా సాల్లోకి రావడం ఎందరికో ఆనందం కలిగించింది. ఇటలీ నౌకాశ్రయ జలాల్లో డాల్ఫిన్లు స్వేచ్ఛగా ఆడటం, చాలా చోట్ల జింకలు, లేళ్లే కాకుండా సింహాలు, పులులు వంటి క్రూరమృగాలూ రోడ్లపైన, వీధుల్లో యథేచ్చగా తిరగడం ఆలోచనాపరుల్లో కొత్త భావాల్ని రేపింది.

వాటి స్వేచ్చా విహారమంటే అవి జనావాసాల్లోకి రావడం కాదని, మనిషి గృహ నిర్బంధంలో ఉండటంతో తమ స్వస్థలాలకు వచ్చినట్టని పర్యావర ణవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఫాక్టరీలు మూతపడి, వాహనాలు నిలిచి పోయి, వీధుల్లో జన సంచారం తగ్గి దాదాపు అన్ని రకాల కాలుష్యాలు రమారమి తగ్గిపోవడం ఓ కొత్త అనుభూతిచ్చింది. పిట్టల అరుపులూ ఇళ్లల్లోకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. సాయంకాలం పూట బాల్కనీల్లోకి వస్తే, ఎక్కడో వీధి చివర ఆరుబయట సాగే ముచ్చట్లూ లీలగా చెవికి సోకుతున్నాయి. ముఖ్యంగా నగర, పట్టణవాసులు వినూత్న జీవి తాన్నే చవిచూస్తున్నారు. అపరిమిత వస్తు వ్యామోహం, ధనాశతో మనిషి జీవితాన్ని ఎంత సంక్లిష్టం చేసుకున్నాడు! అలా కాక, నిరా డంబరపు సాధారణ జీవితమైతే ఎంత సరళంగా ఉంటుందో తెలిసి వస్తోంది. అందులోని మాధుర్యం ఎంతన్నది, అది మరచి ఒకట్రెండు తరాలు మారినా.. ఆధునికులకు స్వయంగా అనుభవంలోకి వస్తోంది.

ఇది సామాజిక దగ్గరితనమే!
కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వాలు పిలుపునిచ్చింది, మనమంతా పాటిస్తున్నది సామాజిక దూరం కానేకాదు! అది భౌతిక దూరం. ముందు తెలియక ఎవరో అలా ‘సోషల్‌ డిస్టాన్సింగ్‌’ అనే పదబంధం చలామణిలోకి తెచ్చినా, అది తప్పుడు ప్రయోగమే! ఒకరి నుంచి వేరొకరికి సంక్రమించే స్వభావం ద్వారా ఈ వైరస్‌ వ్యాధిని వ్యాపింప జేస్తుందని, మనిషికి మనిషి దూరంగా ఉండాలనేదే ఇందులో కీలకం. మనుషులు బృందాలుగా, సమూహాలుగా ఉండొ ద్దనేది పిలుపు. అందుకు కావాల్సింది భౌతిక దూరమే తప్ప సామాజిక దూరం కాదు. పైగా, ఇలా ఉండమనే ‘లాక్‌ డౌన్‌’ నిషేధాజ్ఞలతో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమౌతున్నారు. ఇళ్లనుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడో వేరే నగరాలు, పట్టణాలు, హాస్టళ్లలో ఉండే పిల్లల్ని కూడా  రప్పించుకొని, తగు జాగ్రత్తలతో అంతా ఇళ్లకే పరిమిత మౌతున్నారు. ఇంటర్‌నెట్‌ విస్తృతి పుణ్యమా అని, చదువులకు ఆటంకం కలుగకుండా ఆన్‌లైన్‌ తరగతులు కూడా పిల్లలకు లభిస్తు న్నాయి.

ఫలితంగా కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత పెరిగి సంబం ధాలు బలపడుతున్నాయి. విదేశాల్లో ఉన్నవారితో నిత్యం మాట్లాడు కుంటున్నారు. ఏదైనా విపత్తు వచ్చినపుడు, కలిసి ఉండటం వారిలో మరింత చనువుని, దైర్యాన్ని, సామ్యీప్యతను పెంచేదే! పరస్పర అవ గాహనా పెరుగుతుంది. కరోనా తర్వాతి తాజా పరిణామాలతో ఇప్పుడు కుటుంబంలోని వ్యక్తుల మధ్య, కుటుంబాలు, కాలనీలు, పల్లెలు, రాష్ట్రాలు, దేశాల మధ్య... ఇలా అవసరార్థం పెరిగిన సామా జిక సామ్యీప్యత మంచికే దారితీస్తోంది! సమాజంలో మనుషుల మధ్య అంతరాలు తగ్గించే క్రమంలో సామాజిక దూరం ఉండొద్దని, సామాజిక సామ్యీప్యతే మంచిదని ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు సాగాయి, ఇంకా సాగుతున్నాయి! ఈ మూడు వారాల నిర్బంధం మనుషుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచి, మానవ సంబంధాల్ని మెరు గుపరచాలని కోరుకోవడంలో తప్పులేదు.

మార్పును సుస్థిరం చేస్తేనే!
వ్యక్తులకే కాకుండా అది వ్యవస్థలకు, ప్రభుత్వాలకూ వర్తిస్తుంది. కరోనా విసిరిన పెనుసవాల్‌ను మనం ఎదుర్కొంటున్న క్రమంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటికనుగుణంగా ప్రజలు, ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలకు సిద్ధపడాలి. సమాజ భవిష్య త్తును తీర్చి దిద్దుద్దాలి. స్వీయ గృహ నిర్బంధ సమయంలో ఉన్న జనం ప్రశాంత చిత్తంతో ఆలోచించాలి. కనీసం మూడు వారాలు, అంటే 21 రోజులు... పాత అలవాట్లను వదిలించుకోవడానికి, కొత్త అలవాట్లను దృఢపరచుకోవడానికి ఇది సరిపోయే సమయమేనని మానసికశాస్త్ర నిపుణులూ అంగీకరిస్తున్నారు. తమలో వచ్చిన మంచి మార్పుల్ని ఎవ రికి వారు శాశ్వతీకరించుకోవాలి. అన్ని వేళలా శుభ్రత పాటించాలి. ఎంపిక చేసిన పౌష్టికాహారంతో ఆహార పద్ధతుల్ని మార్చుకోవాలి.

చిన్నపాటి కసరత్తుతో శారీ రక శ్రమ చేయడం, సమయం వెచ్చించి కుటుంబ సభ్యులతో చనువు పెంచుకోవడం, మద్యానికి పూర్తిగా దూరమవడం, పరిమిత వస్తువు లతో నిరాడంబరంగా ఉంటూ జీవనశైలి మార్చుకోవడం.... ఇలా జన మంతా తమలో వచ్చిన ఎన్నో మంచి మార్పుల్ని సుస్థిరం చేయాలి. తద్వారా పాత రోజులు గుర్తొ చ్చేలా సరికొత్త సమాజాన్ని ఆవిష్కరించొచ్చు. పొట్ట చేతబట్టుకొని పట్టణాలు, నగరాలకు వలస వచ్చిన అల్పజీవులను కరోనా కొట్టిన దెబ్బ కోలుకోలేనిది! ఉన్న ఊరు వదిలి నాడు ఎంతోకొంత ఆశతో పట్టణాలు, నగరాలకొచ్చారు. కానీ, ఇప్పుడు ఏ ఆశా, ఆదెరువూ లేక బిక్కుబిక్కుమంటూ వెనక్కి తర లారు. దేశవ్యాప్తంగా దాదాపు అయిదున్నర నుంచి ఆరుకోట్ల మంది వలస కూలీల దీన స్థితి ఎవరికీ పట్టడం లేదు.

లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నపుడు గానీ, కంటతడితో వలస కూలీ ఇంటిల్లిపాదీ సొంతూరు బాట పట్టినపుడు గానీ ప్రభుత్వాలు వారి గురించి పెద్దగా ఆలోచించ లేదు. చిత్తశుద్దితో ఆలోచించాల్సిన సమయమొచ్చింది. గ్రామీణ భారతంలో ఉపాధి కరువై సాగిన అపరి మిత వలసలతో పట్టణాలు, నగరాలు పెను సవాల్‌నే ఎదుర్కొంటు న్నాయి. వసతులు, వనరులకు మించిన జనాభాతో అవి పెద్ద మురికి కూపాలవుతున్నాయి. 2050 నాటికి ఇదొక జఠిల సమస్య అవుతుం దని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌)హెచ్చరించింది. గ్రామీణ వలసల్ని నిలువరించాలని, పట్టణ పేదలు గ్రామాలకు వెనుతిరగడాన్ని (రివర్స్‌ మైగ్రేషన్‌) ప్రోత్స హించాలనీ సూచించింది. ఎదురు చూసిన తిరుగు వలసలను కరోనా కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్నొక అవకాశంగా మలచు కొని వారికి సొంతూళ్లలోనే ఉపాధి కల్పించాలి. అవసరమైతే ప్రత్యేక ఆర్థిక ఉద్దీపనల్ని ప్రకటించాలి. వ్యవసాయ, అనుబంధ రంగాలు, వ్యవసాయాధారిత పరిశ్రమల్ని ప్రోత్సహిం చాలి. ఏ దిక్కూలేక రెండు మార్లు భంగపడ్డ పేదలకు మార్గదర్శకత్వం నెరపాలి. అతిపెద్ద ప్రజా స్వామ్య వ్యవస్థలో తమవి సంక్షేమ రాజ్యా లని చెప్పుకునే ప్రభుత్వాలు ప్రతి విపత్తునుంచీ పాఠాలు నేర్చుకో వాలి. ప్రజలకు దన్నుగా నిలవాలి. సదరు ప్రజలూ ప్రకృతిని గౌర విస్తూ జీవవైవిధ్యంతో మమేకమై బతికితేనే మనుగడ!


దిలీప్‌ రెడ్డి 
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top