మస్కా కొడితే మర్యాదలా?

Devinder Writes on Neerav Modi - Sakshi

విశ్లేషణ
నీరవ్‌ మోదీ బ్యాంకులను మోసగించి తీసుకున్న మొత్తం రూ. 11,400 కోట్లు. దీనిని ఉపయోగించి రూ. 1.5 లక్షలు రుణం తీసుకున్న రైతులకు రుణ మాఫీ ప్రకటిస్తే మొత్తం 30 లక్షల మంది లబ్ధి పొందుతారు. ఈ లెక్క ఎలా చెబుతున్నానంటే, రూ. 34,000 కోట్ల మేరకు రుణ మాఫీ చేయాలని తాము చేసిన ప్రతిపాదనతో 89 లక్షల మంది రైతులు లబ్ధి పొందగలరని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఆధారంగానే. కాబట్టి రూ. 11,400 కోట్ల నీరవ్‌ మోదీ రుణాన్ని రైతుల రుణమాఫీకి ఉపయోగిస్తే 30 లక్షల మందికి మేలు జరుగుతుందని తేలింది.

హరియాణా రాష్ట్రంలోని కైథాల్‌ నివాసి రామ్‌దియా వయసు 96 సంవత్సరాలు. ఆయన నెలకు రూ. 1,600 వంతున వృద్ధాప్యపు పింఛను తీసుకుంటున్నారు. ఆయనకు ఉన్న సామాజిక భద్రత ఈ పింఛను. అదొక్కటే ఆయన జీవనాధారం. కానీ కొన్ని మాసాల నుంచి ఆ భద్రత, ఆ జీవనాధారం కూడా గాలికి ఎగిరిపోయాయి. ఈ వయసులో ఇదీ రామ్‌దియాకి వచ్చిన కష్టం. ఇంతకీ 2006లో రామ్‌దియా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. మొత్తం రూ. 50,000. ఆ రుణాన్ని వసూలు చేసుకోవడానికి ఈ పింఛను డబ్బులు మొత్తం బ్యాంకు అధికారులు రామ్‌దియా ఖాతా నుంచి రికవరీ పేరుతో నిర్దాక్షిణ్యంగా తీసేసుకుంటున్నారు.

అన్నీ కోల్పోయి, పింఛను ఒక్కటే ఆధారంగా బతుకుతున్న రామ్‌దియాకు మాత్రమే బ్యాంకులు ఇలాంటి గతి పట్టించలేదు. ఆ కాస్త ఆసరా కూడా హఠాత్తుగా కోతకు గురైనవారు ఇంకా ఎందరో! ఇలాంటి ధోరణి బ్యాంకు నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అయినప్పటికీ ఇలాంటి క్రూరత్వం బ్యాంకులు ప్రదర్శిస్తున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రదర్శిస్తున్న ఇలాంటి క్రూరత్వానికి సమాజంలోని బడుగు వర్గాలే ప్రధానంగా బలవుతున్నాయి. అలాగే రుణాలు తీసుకుని ఎగవేశారని ఆరోపిస్తూ రైతుల వివరాలను ఫొటోలు సహా తహశీల్‌ కార్యాలయాలలో బ్యాంకు అధికారులు ప్రకటిస్తూ ఉంటారు. తీసుకున్న రుణాలను తిరిగి కట్టించే క్రమంలో రికవరీ ఏజెంట్లు రైతాంగాన్ని వేధించడమే కాదు, వారి మీద చేయి చేసుకోవడం కూడా మామూలే.

రుణాలను తిరిగి చెల్లించలేని వారి స్థిరచరాస్తులను స్వాధీనం చేసుకోవడం, వేలానికి పెట్టడం కూడా జరుగుతుంది. ఇక్కడ నాది ఒక్కటే ప్రశ్న. ఇలాంటి విశిష్ట మర్యాదలు కార్పొరేట్‌ రంగంలో రుణాలు ఎగవేస్తున్న వారికి ఎందుకు ఇవ్వడం లేదు? ఇది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నిజానికి రైతులు గాని, పారిశ్రామికవేత్తలు గాని రుణాలు తీసుకునేది జాతీయ బ్యాంకుల నుంచే. కానీ రుణాలు తిరిగి చెల్లించనందుకు ఒకరి పట్ల ఒకరకమైన వైఖరి, ఇంకొకరి పట్ల మరొక రకమైన దృష్టి ఎందుకు?

బ్యాంకుల నియమాల కొరడా రైతుల మీదకే
సాపేక్షంగా చూసినప్పుడు కార్పొరేట్‌ రంగంలోని రుణ ఎగవేతదారులు బ్యాంకులను మోసం చేసి ధనం తీసుకుంటారు. మొండిబకాయిలను ఇంకాస్త పెంచుతారు. ఇలాంటి అకృత్యానికి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా చివరికి వారు ఉడాయిస్తారు. దీనిని బట్టి చూస్తే బ్యాంకింగ్‌ వ్యవస్థ మొత్తం దాని నిర్మాణం, పని విధానం అంతా ధనికుల కోసం, పలుకుబడి కలిగిన వారి కోసం రూపొందించనట్టే ఉంటుంది. వారి సేవలో తరించడానికే అన్నట్టు కనిపిస్తుంది. నీరవ్‌ మోదీ, ఆయన భాగస్వాములు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి అక్రమ పద్ధతులలో రూ. 11,400 కోట్ల రూపాయల రుణం దండుకున్నప్పటికీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఎంతో సౌకర్యంగా సుదూర ప్రాంతాలకు పలాయనం చిత్తగించారు.

దీనిని బట్టి అర్థమయ్యేదేమిటంటే, బ్యాంకుల నిబంధనల కొరడా కేవలం ఆమ్‌ ఆద్మీలకే, అంటే సాధారణ ప్రజలకే. రైతులు తీసుకున్న రుణాలను వసూలు చేయడానికి సామ దాన భేద దండోపాయాలన్నీ వర్తింపచేస్తారు. ఆఖరికి చాలా అనాగరిక పంథాను కూడా అనుసరిస్తారు. కానీ రైతుల పట్ల ఇంత కఠినంగా ఉండే బ్యాంకులు కార్పొరేట్‌ రంగంలోని రుణ ఎగవేతదారుల పేర్లు వెల్లడి కాకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటాయి. ఇలాంటి వారి పేర్లు తొందరపడి బయటపెడితే, ఆ చర్య పెట్టుబడులు పెట్టేవారి ఆత్మ విశ్వాసాన్ని బాగా దెబ్బ తీస్తుందని ఆర్థికమంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకు సుప్రీంకోర్టు ముందు పదే పదే చెబుతూ ఉంటాయి.

రైతు రుణమాఫీకి ససేమిరా
ఇలాంటివారికి ఆర్థికమంత్రిత్వ శాఖ చడీచప్పుడు కాకుండా ఇస్తున్న మద్దతు పుణ్యమా అని బ్యాంకుల నిరర్థక ఆస్తుల భారం రూ. 9.5 లక్షల కోట్లకు చేరిపోయింది. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. మరొకవైపు వ్యవసాయ రంగం మీద 2016 సెప్టెంబర్‌ నాటికి ఉన్న పంట రుణాల భారం రూ. 7.75 లక్షల కోట్లు. ఈ భారీ రుణాలను మాఫీ చేయవలసిందని రైతులు ఎప్పుడైనా కోరితే, ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, ఆర్థిక సలహాదారులు, ఆర్థిక విధానాల రూపకర్తలు రంగంలోకి దిగిపోతారు. అలాంటి చర్య వేరొకరికి చేటు చేసే విధంగా పరిస్థితులను తయారు చేస్తుందని గంటల కొద్దీ విశ్లేషిస్తారు.

అలాగే ఆస్తులు, అప్పుల వ్యవహారంలో సమతుల్యత దెబ్బతింటుందని బల్ల గుద్ది వాదిస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, కార్పొరేట్‌ రంగానికి సంబంధించిన మొండిబకాయిలను రద్దు చేయడమే ఆర్థిక వృద్ధిగా ఆర్థిక సలహాదారు ఒకసారి భాష్యం కూడా చెప్పారు. కాబట్టి ఆర్థిక విధానాలు కూడా కార్పొరేట్‌ ఎగవేతదారులు తప్పించుకోవడానికి మార్గాలు చూపెడుతున్నాయి. అంటే ఆర్థిక రంగ వృద్ధి కోసం తమ తమ మొండిబకాయిలను ఎలాగూ రద్దు చేస్తారని కార్పొరేట్‌ రుణ ఎగవేతదారులకు స్పష్టంగా తెలుసు.

మార్చి, 2017 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు మోస్తున్న రుణ భారం గురించి పార్లమెంట్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ వెల్ల డించింది. ఆ మొత్తం రూ. 6.8 లక్షల కోట్లు. ఇందులో 70 శాతం కార్పొరేట్‌ రంగం తీసుకున్న రుణాలే. ఇక ఎగవేతదారులు ఎవరంటే ఒక్క శాతం రైతులే. గడచిన పదేళ్లలో బ్యాంకులు రద్దు చేసిన నిరర్థక ఆస్తుల విలువ రూ. 3.60 లక్షల కోట్లు. ఇక్కడే నాకు అర్థం కాని అంశం ఏమిటంటే, రుణాలు తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారన్న ఆరోపణతో రైతుల పట్ల చూపుతున్న క్రూరత్వాన్ని, అవే బ్యాంకులకు చెల్లించవలసిన రుణాలను ఎగ్గొట్టిన కార్పొరేట్‌ సంస్థల యజమానుల పట్ల ఎందుకు చూపించడం లేదు? రైతుల మీద తెస్తున్న ఒత్తిడి కార్పొరేట్‌ సంస్థల యజమానుల మీద ఎందుకు తేవడం లేదు?

అరవై లక్షల మంది కన్నీళ్లు తుడవరాదా!
జైలు ఖర్చులు గురించి కూడా ముందే మాట్లాడుకుని, రుణాలు చెల్లించలేదన్న పేరుతో రైతులను తరచూ అక్కడికే పంపిస్తున్నారు. కానీ కార్పొరేట్‌ సంస్థల యజమానులు మాత్రం బ్యాంకులకు శుద్ధ క్షవరం చేసి వెళ్లిపోతున్నారు. ఉదాహరణకి శ్రీమెటాలిక్‌ కంపెనీ. ఇది రూ. 13,000 కోట్లు ఇవ్వవలసి ఉండగా, అందులో ఏడు శాతం మాత్రం వసూలు చేశారు. అది కూడా దివాలా పిటిషన్‌ ద్వారా చేశారు. కానీ హరియాణాకు చెందిన రైతు ఒకరు తన పొలంలో నీటి పారుదల సౌకర్యం కోసం పైప్‌ లైన్‌ వేసుకోవడానికి రూ. 6 లక్షలు రుణం తీసుకున్నారు. కొన్ని వారాల క్రితమే ఆ రైతుకు జిల్లా కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంకా రూ. 9.80 లక్షలు డిపాజిట్‌గా చెల్లించమని ఆదేశించింది.

నీరవ్‌ మోదీ బ్యాంకులను మోసగించి తీసుకున్న మొత్తం రూ. 11,400 కోట్లు. దీనిని ఉపయోగించి రూ. 1.5 లక్షలు రుణం తీసుకున్న రైతులకు రుణ మాఫీ ప్రకటిస్తే మొత్తం 30 లక్షల మంది లబ్ధి పొందుతారు. ఈ లెక్క ఎలా చెబుతున్నానంటే, రూ. 34,000 కోట్ల మేరకు రుణ మాఫీ చేయాలని తాము చేసిన ప్రతిపాదనతో 89 లక్షల మంది రైతులు లబ్ధి పొందగలరని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఆధారంగానే. కాబట్టి రూ. 11,400 కోట్ల నీరవ్‌ మోదీ రుణాన్ని రైతుల రుణమాఫీకి ఉపయోగిస్తే 30 లక్షల మందికి మేలు జరుగుతుందని తేలింది.

దీనికి రొటోమ్యాక్‌ అధిపతి ఎగ్గొట్టిన రూ. 3,695 కోట్లని కలపండి. అలాగే విజయ్‌ మాల్యా తీసుకున్న రూ. 9,000 కోట్లు కూడా. ఈ మొత్తాల వల్ల మరో 30 లక్షల మంది రైతాంగ రుణ ఎగవేతదారులు ఆ బాధ నుంచి విముక్తి అవుతారు. దీనిని మరింత సరళంగా చెప్పవచ్చు. కేవలం ముగ్గురు భారత పారిశ్రామిక రంగ దిగ్గజాలు ప్రభుత్వ ఖజానాకు చేకూర్చిన నష్టం యావత్తు మొత్తం 60 లక్షల మంది రైతుల కన్నీళ్లు తుడుస్తుంది.

ఈ ప్రశ్నకు బదులేది?
కానీ, రైతుల రుణమాఫీ గురించి అధికార వర్గాల వైపు నుంచి ఒక నిరంతర నిరసన వ్యక్తమవుతూనే ఉంది. 2014 ఎన్నికల నుంచి చూస్తే మొదట తెలంగాణ, తరువాత ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆ తరువాత పంజాబ్‌ రైతు రుణమాఫీ పథకం గురించి సానుకూలంగా స్పందించాయి. ఈ చర్య పట్ల కొన్ని పత్రికలు కూడా వ్యతిరేకంగానే స్పందించాయి. ఇదొక ‘వైరస్‌’లా తయారవుతుందంటూ కొన్ని పత్రికల ఎడిట్‌ పేజీలు ఘోషించాయి.

ఇది రాజకీయ జిమ్మిక్‌ మాత్రమే అని, రుణమాఫీతోనే రైతు కష్టాలు తీరిపోతాయను కుంటే అది భ్రమ మాత్రమేనని బల్లగుద్ది చెప్పేవారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ముఖ్యంగా ఆర్థిక విధాన రూపశిల్పులు ఈ వాదనకు మద్దతు పలుకుతు న్నారు. అయితే రైతులను రుణబంధం నుంచి బయట పడ వేయడం ఎలా? ఇప్పుడు వినిపిస్తున్న మాట– సామా న్యుడు బ్యాంకులలో దాచుకున్నదంతా నీరవ్‌ మోదీ వంటి వారికి ధారాదత్తం చేసే ప్రక్రియే సాగుతోంది.

సామాన్యుడి కష్టార్జితాన్ని మాల్యా, నీరవ్‌ వంటి వారి బందిపోటుతనంతో కుదేలైన బ్యాంకులను కాపాడడా నికి కేటాయించే పరిస్థితి కనిపిస్తున్నదని కూడా మధ్య తరగతి ఆక్రోశిస్తున్నది. ఇలాంటి వాతావరణంలో రైతుల రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెన కాడుతోందని ప్రశ్న వినిపించడం సహజమే.

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
దేవిందర్‌శర్మ
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top