పంచాయతీ ఎన్నికలంటే బాబుకు వణుకు

BJP Leader Turaga Nagabhushanam Slams Chandrababu Naidu - Sakshi

అభిప్రాయం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ‘పంచాయతీ’ ఎన్నికలు నిర్వహించేంత ధైర్యం చంద్రబాబు సర్కార్‌కి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు పంచాయతీ నిధుల్ని ఇష్టానుసారంగా టీడీపీ ప్రభుత్వం భోంచేసింది. అందుకే, పంచాయతీల పదవీకాలం ముగిసినా, తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా తన మాటవినే స్పెషల్‌ ఆఫీసర్లతో పాలిస్తోంది. హైకోర్టు తీర్పుతో పంచాయతీ ఎన్నికల్ని మూడు నెలల్లోగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబు ఎన్నికలకు సిద్ధమంటూనే, రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించి, కోర్టుకెళ్లడం ద్వారా ఎన్నికల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు ఆరంభిస్తున్నారు. ఏదో సాకుతో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం ఆయనకు కొత్తకాదు. రాష్ట్రంలో అతి పెద్దదైన గ్రేటర్‌ విశాఖ నగర పాలక సంస్థ గడువు 2012 ఫిబ్రవరిలో ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు జరపలేదు. పంచాయతీ ఎన్నికలు జరిగితే టీడీపీ సంగతి తేలిపోతుంది. అందుకే ఆయన 2019 ఎన్నికల ముందర రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా లేరు.

2013 నాటి పరిస్థితే పునరావృతం : ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ మద్దతు ఇచ్చే సర్పంచ్‌ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే 2012– 13 నాటి పరిస్థితులే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో గడువు ముగిసి, తిరిగి ఎన్నికలు నిర్వహించనందున 2012 నుంచి కేంద్రం నిధులు నిలిపివేసింది. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చిన తరువాత ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 2013 జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించింది. మొత్తం రాష్ట్రంలో 12,918 పంచాయతీలుండగా అందులో ఎక్కువ స్థానాల్లో తెలుగుదేశం మద్దతు ఇచ్చినవారు గెలవగా, వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు రెండో స్థానంలో నిలి చారు.  ఆ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలయింది. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితే నెలకొంది. 

బాధ్యత మరచిన టీడీపీ ప్రభుత్వం : స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. 72, 73 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు, విధుల కేటాయిం పుతో సహా అనేక పాలనాపరమైన అంశాలపై నిబంధనలు  రూపొందించారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనను అమలు చేయదేమోనన్న సందేహంతోనే అలా ఎన్నికలు జరగని సంస్థలకు కొన్ని పద్దులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరును నిలిపివేయాలన్న నిబంధన కూడా ఉంది. దేశ ప్రధానికి కూడా లేని చెక్‌పై సంతకం చేసే అధికారం సర్పంచ్‌ సొంతమైంది. గ్రామీణాభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించే పథకాల్లో 70 శాతం పైగా నేరుగా గ్రామ పంచాయతీలే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మొత్తాన్ని విధిగా పంచాయతీలకు పంచాలి. గ్రామసభలు నిర్వహించడం ద్వారా ప్రాధాన్యతాంశాలను గుర్తించి అమలు చేయాలి. ఈ అంశాలన్నీ అమలైతే గ్రామసీమలు సర్వసత్తాకమవుతాయి. కాని చంద్రబాబు ఈ బాధ్యతలకు వ్యతిరేకంగా నడిచారు. 

అధ్వాన స్థితిలో పంచాయతీలు: రాష్ట్రంలో పంచాయతీల పరిస్థితి ఇప్పటికే అధ్వానంగా మారింది. గ్రామసభలు గాలికి కొట్టుకుపోయాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కూడిన జన్మభూమి కమిటీలు అన్ని అధికారాలను చలాయిస్తూ, రాజ్యాంగేతర శక్తులుగా మారాయి. ఒక్కో గ్రామానికి పదిమందితో కూడిన ఈ జన్మభూమి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే సంక్షేమ పథకాల అమలు, పింఛన్లు, రేషన్‌ కార్డుల మంజూరు తదితర వ్యవహారాలు సాగించారు. కమిటీ సభ్యుల చేయితడిపితేనే పథకాల్లో లబ్ధి చేకూరే పరిస్థితి ఏర్పడింది. 14వ ఆర్థిక సంఘం సూచనతో ప్రతి గ్రామ పంచాయతీకి నేరుగా కోట్ల రూపాయలు నిధులు కేంద్రం పంపితే వాటిని జన్మభూమి కమిటీలతో సహా టీడీపీ నాయకత్వం దోచేసింది. కేంద్రం నుంచి మనిషికి రూ.400 చొప్పున ఏడాదికి రెండు విడతలుగా వచ్చే మౌలిక సదుపాయాల నిధులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. తాత్కాలిక అధికారులు కావడంతో జవాబుదారీతనం లోపించింది. పంచాయతీ పని తీరు ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉంది. గ్రామాల్లో పారి శుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. 

పంచాయతీలకు నిర్ణీత కాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం, అన్ని పథకాలు, ప్రాజెక్టులతో పాటు స్థానిక నిధులను కూడా బొక్కేయడం, జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థల హక్కులను కాలరాసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించడం టీడీపీ ప్రభుత్వ అప్రజాస్వామికత్వానికి నిదర్శనం. ఎన్నికలు జరిగితే అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబుకుతుంది. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కచ్చితంగా పడుతుంది. అందుకే టీడీపీ వెనకడుగు వేస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు, ఉద్యమాలతో బాబు భయపడి ఎన్నికలంటేనే హడలిపోతున్నారు. కానీ హైకోర్టు తీర్పుతో బాబు ఎన్నికలు తప్పక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బాబు వణుకుకు కూడా కారణం ఇదే.
 
వ్యాసకర్త :తురగా నాగభూషణం, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top