ప్రియాంకం రక్తి కట్టేనా?

Article On Priyanka Gandhi Entry Into Politics - Sakshi

సందర్భం

మన్మోహన్‌  సింగ్‌ 2004 వేసవిలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని ముఖ్యమంత్రులందరికీ ఉత్తరాలు రాశారు. దేశవ్యాప్తంగా పౌరపంపిణీ వ్యవస్థ అద్వానంగా ఉందని, కోట్లాది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, వారి సాంఘిక ఆర్థిక స్థితిగతుల్ని మార్చడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆ ఉత్తరంలో సూచించారు. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, స్త్రీలు అందరికీ సమాన అవకాశాలు కల్పించడాకి ప్రభుత్వాలు పూనుకోవాలని పేర్కొన్నారు. అంతకుముందు చంద్రబాబు పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనికి ఆహారం పథకంలో భాగంగా సాగిన బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగాయి. దాంతో అది అప్రతిష్ట పాలైంది. ఈ నేపథ్యంలో, ప్రధాని మన్మోహన్‌ సూచన వెలుగులో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో రెండు రూపాయలు కిలో బియ్యం పథకం లాంచనంగా ప్రారంభింప చేసారు. ఆ వెంటనే ఇది రాష్ట్రమంతా అమలులోకి వచ్చి విజయవంతమైంది పేదల సంక్షేమం పట్ల వై.ఎస్‌. ప్రతిస్పందన అంత వేగంగా ఉండేది. అందుకే ఆ సందర్భంగా సోనియా గాంధీ– ‘ఆంధ్రప్రదేశ్‌ నమునా ఆదర్శనీయమని, దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరించాల’ని సూచించారు

అంతకుముందు తన పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి, 20 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీని మళ్లీ జనం స్మృతిపథంలో నిలిపిన చరిత్ర వైఎస్‌ రాజశేఖరరెడ్డిది. ‘ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం’ అంటూ, పదేళ్ళ (1994–2004) వ్యవధిలో దక్షణాదిలో మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోసినవాడు వైస్సార్‌. దేశంలోకి కంప్యూటర్ల పాలన తెచ్చిన రాజీవ్‌ గాంధీని ‘అమ్మ’కు జోడించి ‘రాజీవ్‌ పల్లె బాట’ అన్నాడు. ఏమిటిదంతా అంటే– మన్మో హన్‌ చెబుతూ ఉండే ‘హ్యూమన్‌ ఫేస్‌’కు దేశవాళీ నమూనా ఇది! ఇదంతా ఒక పార్శ్వమైతే, ఆ కాలంలో పాలనా వ్యవస్థలో మళ్ళీ ఏర్పడిన స్థిమితం వల్ల మేలు కలిగింది. ‘పవర్‌ కారిడార్స్‌’లో వచ్చిన ‘రోల్‌ క్లారిటీ’ వల్ల పనిలో వాసి పెరిగింది, ఉద్యోగుల్లో అలజడి తగ్గి బాధ్యత పెరిగింది. అయితే ఆయన గతించాక, ఇదంతా ఆ పార్టీకి పైకి చెప్పుకోవడానికి లేని మంచి అయింది! అప్పట్లో దక్షణ కోస్తా, రాయలసీమ జిల్లాల కోసం గుంటూరు–ఒంగోలు సముద్రతీరాన 13 వేల ఎకరాల్లో వై.ఎస్‌. తలపెట్టిన ‘వాన్‌ పిక్‌’ (వాడరేవు అండ్‌ నిజాంపట్నం ఇండస్ట్రియల్‌ కారిడార్‌) పనులు, 2011 నాటి అదే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వివాదమై ఆగిపోయాయి. లేకపోతే, ఇప్పుడు రాజధానిగా ఏర్పడిన ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరమై ఉండేవి.

 ఇప్పుడైనా ఎందుకీ గతం తలపోత అంటే, ‘ప్రియాంకం’ అంటూ తెలుగునాట మళ్ళీ మరో ‘అమ్మ’ను ప్రతిష్టిస్తూ, మన ప్రసార మాధ్యమాలు కదిపిన తుట్టెను చూసి! అప్పట్లో, రాజశేఖరరెడ్డి ‘డ్వాక్రా’ మహిళల సభల్లో విధిగా ఈ మాట అనేవారు. ‘నా అక్కల చెల్లెమ్మల కంట కన్నీరు ఉండకూడదని, వాళ్ళ ముఖాల్లో ఎప్పుడు చిరునవ్వులు చూడాలని సోనియా గాంధీ గారు కోరుకుంటున్నారు’ అనేవారాయన. ఇలా ‘ఇందిరమ్మ’ చిత్రం మీద సోనియాను ఒక ‘మెథడాలజీ’తో రాజశేఖర రెడ్డి ‘సూపర్‌ ఇంపోజ్‌’ చేసేవారు. అయితే అదేమీ వృధా కాలేదు, 2009లో కూడా వాటి ప్రతిఫలం ఆ పార్టీకి దక్కింది. కానీ, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ప్రియాంక గాంధీని అటువంటి పునఃప్రతిష్ట చేయగలిగింది ఎవరు? 

గడచిన పదిహేనేళ్ళలో చాలా మార్పు వచ్చింది. వై.ఎస్‌. జనం మదిలో నిలిపిన ‘ఇందిరమ్మ’కు ఓటు వేసిన తరం బాగా తగ్గిపోయింది. ఆమె కోడల్ని అంగీకరించి ఆ పార్టీకి పునరాగమన అవకాశాన్ని ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని అది నిలుపుకోలేకపోయింది. మన తర్వాత వచ్చినవాళ్ళు కంగాళీ చేస్తే, దేశ ప్రజలు మళ్ళీ మనవైపు చూడరా? అనే ఒకే ఒక్క నమ్మకంతో కాంగ్రెస్‌ ఇప్పటికీ వుంది. కానీ ఇక్కడ మొదటినుంచి దానికి భరోసాగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు రెండుగా విడిపోయింది. రెండు చోట్లా క్రియాశీలంగా ఉన్న మూడు ప్రాంతీయ పార్టీల మధ్య, కాంగ్రెస్‌ది నాలుగవ స్థానం అయింది. ఇలా ఇప్పుడు జరుగనున్న ఎన్నిక తెలుగువారికి ‘ఉప ప్రాంతీయం’ అయింది. కనుక మన రాష్ట్ర–కేంద్ర ప్రయోజనాల వైరుధ్యాల మధ్య యువతరం ఇచ్చే తీర్పు ‘ఫెడరల్‌’ స్ఫూర్తికి కీలకం కావచ్చు.


జాన్‌సన్‌ చోరగుడి 
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక విశ్లేషకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top