వెన్నుపోటుకు ఓటమి తప్పదు

Article On How TDP And BJP Cheated Andhra Pradesh People - Sakshi

విశ్లేషణ

వెన్నుపోటు అంటే పార్టీలవాళ్లు తమలో తాము పొడుచుకోవడమే కాదు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలకు చేసిన వెన్నుపోటు అని కూడా చేరిస్తే సరిపోతుంది. ప్రత్యేక హోదా విషయంలో మోసం, ఆడ కూతుళ్ల అంగన్‌వాడీ, డ్వాక్రా రుణాల రద్దు– వీటి కథ ‘కంచికి చేర్చారని’ చూపిస్తే చాలు. ఇవన్నీ వాళ్లు అనుభవించినవే గనుక, తాము ఎట్లా వెన్నుపోటుకు గురైందీ చూస్తారు. మోదీగారి పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి సంస్కరణల గూర్చి గొప్పగా చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు ఆ ప్రశంసకు వెన్నుపోటు పొడిచారు. అందుకే కళ్లు తెరిచిన జనం వచ్చే ఎన్నికలలో బీజేపీ, టీడీపీలకు ఉద్వాసన చెప్తారు.

ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో రసవత్తర రాజ కీయం నడుస్తున్నది. రాజ కీయం రసవత్తరం అవడానికి ఇటు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, అటు తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల కూటమి, సరే కేసీఆర్‌ గూర్చి చెప్పనే అక్కరలేదు. ఇది మనకు కనిపిస్తున్న దృశ్యం. కానీ తెరపై ఈ బొమ్మలను ఆడిస్తున్నది మాత్రం, అవసరా న్నిబట్టి జుట్లు ముడేసి, ఐక్యం చేయగల లేదా జుట్టూ జుట్టూ పట్టకుని కొట్టుకునేట్టు నడిపింపజేయగల కేంద్రంలో అధికారంలో వున్న మోదీజీ! ఈ వాదన లలో ఏది సత్యం, ఏదసత్యం?  మహర్షీ, మహాప్రభో అన్నట్లు చూస్తూ ఎటూ తేల్చుకోలేక గందరగోళం, అయోమయంలో వున్నారు సామాన్య ప్రజానీకం. ఇక్కడే పొరబాటు పడుతున్నాం. ఇన్ని దశాబ్దాల ప్రజాస్వామ్య ఓట్లాటలో మన సామాన్య జనం కూడా బాగా తెలివిమీరారు. పైన పేర్కొన్న రాజ కీయ పార్టీలను అయోమయంలో ముంచి గందర గోళపరుస్తున్నది ఈ జనమే. వీళ్ల మాటేమిటో తెలి యక, పాపం చాలామంది రాజకీయనేతలు పడు తున్న పాట్లు అన్నీయిన్నీకావు. 

మా ఇంటికి ఈమధ్య మా ఊరి పెద్దమనిషి ఒకాయన వచ్చాడు. నా దృష్టిలో ఆయన మామూలు గ్రామీణుడు. అప్పటికే చలన చిత్ర అనుభవమున్న ఓ మిత్రుడు వచ్చి కూర్చుని వున్నాడు. ఆయన ‘‘డాక్టరు గారూ మీరు పూర్వాశ్రమంలో కొంతకాలం ఆంధ్ర ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడట కదా, మీరు చెప్పండి ఒకాయన సాధారణ బడ్జెట్‌తో ‘వెన్ను పోటు’ అన్న టైటిల్‌తో ఒక సినిమా తీయదల్చు కున్నాను...’’ అన్న ఆయన వాక్యం పూర్తికాకుం డానే.. ఆ పల్లెటూరి పెద్దమనిషి ‘‘చంద్రబాబుగారి జీవిత చరిత్రా?’’ అని అడిగాడు. ‘‘అదేంటి? అలా అడిగావు’’ అన్నా. ‘‘జీవిత చరిత్రలు సినిమాలుగా తీస్తున్నారు కదండీ’’ అని ఆ పెద్దమనిషే అన్నాడు. ‘‘వెన్నుపోటు అనంగానే నాకు చంద్రబాబుగారి జీవిత చరిత్ర అనిపించింది. అది ప్రస్తుతం ఎవరూ తీస్తున్నట్లు లేదుగదా అనుకున్నాను లెండి’’ అని ఆయన అన్నాడు. ‘‘అబ్బే నేను 2014 ముందు వరకూ మీలాగానే వెన్నుపోటు అనగానే ఆయనే అని అనుకునేవాణ్నండి. ఇప్పుడయితే అలా అనుకోవ డం లేదండీ’’ అన్నాడు. ‘‘వెన్నుపోటు పొడిచిన వారి జీవితచరిత్రా, పొడిపించుకున్నవారి జీవితా చరిత్రా? అని అడగలేదేం’’ అని అడిగాను కుతూహలంగా. ‘‘అది స్పష్టంగా చెప్పలేవండీ. ప్రస్తుతం చూస్తుంటే మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వెన్నుపోటు పొడిచారని, ఆ పదానికి పేటెంట్‌గా మారిన చంద్రబాబుగారు అంటుంటే, అదేమిటి మా ఎన్‌డిఏ కూటమికి వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని బీజేపీ వాళ్లంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ, టీడీపీలు రెంటికీ వెన్నుపోటు పొడిచారని ఇద్దరూ భావిస్తు న్నారు’’ అన్నాడాయన. ‘‘కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి కుట్రపన్ని 2011లోనే దివంగతనేత వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని వెన్నుపోటు పొడవా లని చూడ్లేదా’’ అని నేనంటే ‘‘జగన్‌ తండ్రికి తగ్గ మొండిఘటం కదా–ఈ వెన్నుపోటుదార్ల కథ బహి రంగంగా జనంముందే తేల్చి, బాజాప్తా వారిని ఓడి స్తానని ఆయన జనం మధ్యే వుంటున్నాడు. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినట్లే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రా నికే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నాడని కేసీఆర్‌ అంటున్నారు. అయినా, కేసీఆర్‌ జగజ్జంత్రీ. ఆయన కోసం వెన్నుపోటు స్పెషలిస్టులు ఎంతమంది వచ్చినా ఏమీ పీకలేరు’’ అని కాసిని మంచి నీళ్లు తాగి, పైపంచతో ముఖం తుడుచుకున్నాడు. 

మేము ఈ వెన్నుపోటు విశ్లేషణకు కొంత విస్మయం చెందుతున్నాం. మళ్లీ పల్లెటూరి పెద్దమ నిషే అందుకున్నాడు. ‘‘తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తానని సోనియమ్మను నమ్మించి, ఆ తర్వాత కాంగ్రెస్‌ అంతు చూస్తానని కేసీఆర్‌ అనడం వెన్నుపోటు కాదా?’’ అని అడిగాడు. ‘‘అయితే ప్రస్తుతం పదవిలో వున్న రాజకీయ నేతలందరూ వెన్నుపోటుదారులేనంటావ్‌’’అన్నాను. ‘‘అబ్బే తప్పులేదండీ. ఎంతమంది ఉన్నప్పటికీ ఈళ్లందరిలో మన బాబుగారే మొనగాడండీ. అవ సరం అయితే తన పార్టీవారిని కూడా వదిలిపెట్ట డండీ. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని పిల్ల కాంగ్రెస్, ఎప్పటికైనా తల్లికాంగ్రెస్‌లో కలిసేదే అని చంద్ర బాబు అంటే, ఆయన అనుచరగణం కూడా అదే పల్లవి ఎత్తుకున్నారు. వాళ్లంతా అలా అనుకుంటుండ గానే, సడన్‌గా ప్లేటు ఫిరాయించి ఇప్పుడు కాంగ్రె స్‌తో కలిసి తానే పిల్ల కాంగ్రెస్‌గా మారాడు. పైగా అదే కాంగ్రెస్‌తోనే ఈ పిల్ల కాంగ్రెస్‌  కలవక తప్పదని మళ్లీ తానే తన తెలుగుదేశం నేతలకు బోధనలు చేస్తున్నాడు. ఇలా ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టు మాటలు మార్చడం, వెన్నుపోటేగా! మొనగాడు చంద్రబాబు కాదా?’’ అని అన్నాడా పల్లెటూరి రైతు.

‘వెన్నుపోటు’ సినిమా తీస్తానన్న పెద్దమనిషి ‘‘అయ్యా విఠల్‌గారూ, మా సినిమా చూడబోతే పెద్ద తేనెతుట్టనే కదిలించేట్లు వుంది. అందరూ వెన్నుపో టుదార్లేనా? అయితే, అదే మా సినిమా వాళ్లకు కావలసింది. అప్పడుగానీ అందరూ చూడరు. కనక వర్షం కురవదు’’ అన్నారాయన. ఆ పల్లెటూరి పెద్ద మనిషి ‘‘ఏ పార్టీని వెన్నుపోటు పొడవనిది జగన్‌ మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ఉంది కదా. ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఏ పార్టీలతో పొత్తు లేదు. ప్రజలే ఆయన పార్టీ వెంట వున్నారు కదా!’’ అన్నాడు.

‘‘వెన్నుపోటు అంటే పార్టీలవాళ్లు తమలో తాము పొడుచుకోవడమే కాదు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలకు జరిగిన వెన్నుపోటు అని కూడా చేర్చి స్క్రిప్ట్‌ పెంచితే జనం అందరికీ సరి పోతుంది’’ అని ఆయన అన్నాడు. ‘‘అది భేషుగ్గా ఉంటుంది. అయితే ఆ ఊసరవెల్లి వ్యవహారాలు అన్నీ రావాలని 24 గంటలు తీయగలమా అన్నది ప్రశ్న’’. ‘‘అదేముంది లెండి, జనం తెలివి మీరా రుగా.. మచ్చుకు మూడు నాలుగు సందర్భాలలో ‘ప్రత్యేక హోదా విషయంలో మోసం, ఆడ కూతుళ్ల అంగన్‌వాడీ, డ్వాక్రా రుణాల రద్దు– వీటి కథ ‘కంచికి చేర్చారని’ చూపిస్తే చాలు. ఇవన్నీ వాళ్లు అను భవించినవే గనుక, తాము ఎట్లా వెన్నుపోటుకు గురైందీ  చూస్తారు. పైగా సినీ విమర్శకుల ప్రశం సలు సైతం వస్తాయి. ‘జనానికి కనెక్ట్‌ అయ్యింది. ఎవరికివారు తమ కథే ‘ఈ వెన్నుపోటు’ అని స్పందించారు’ అంటూ వాళ్లు 4/5  రేటింగ్‌ ఇస్తారు. ‘‘అవును ఇందులో కూడా వెన్నుపోటువల్ల బాగా కుమిలిపోయింది రైతాంగం. వాళ్లు బాబు మాటలు నమ్మారు. ఇప్పుడు ఆయన తన సహజ శైలిలో వారికీ వెన్నుపోటు పొడిచారు. అందువల్ల అప్పు పూర్తిగా తీరలేదు. వడ్డీలు తడిసి మోపెడయ్యాయి. బ్యాంకుల వాళ్లు అప్పులు ఇవ్వకపోగా, పాత బాకీ వడ్డీతో సహా కట్టి తీరాల్సిందేనని జప్తులకు సైతం సిద్ధపడుతు న్నారు. రైతుల్ని అవమానపరచడంతో కొందరు ఆత్మహత్యలకు కూడా వెనుకాడలేదు’’ అన్నాడు. 

‘‘ఈ వెన్నుపోటు పార్టీల కేంద్ర రాష్ట్ర నేతల పర స్పర దూషణ భూషణాలను యథాతథంగా వాడు కుంటే,  వేరే ప్రత్యేకించి మాటల రచయితను పెట్టు కోనవసరం లేకుండా సరిపోతుంది కదా! మొన్నటి వరకు కేంద్ర పాలనను, మోదీగారినీ ఆకాశానికెత్తి ఆయన ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి సంస్కరణలను భారత ప్రజానీకం, డిజిటల్‌ దిశగా విప్లవించి వ్యాపార, వాణిజ్య బ్యాంకులలో లావాదే వీలలో ఆరి తేరిపోతారు అని సాంకేతికత గూర్చి గొప్పగా చెప్పి; ఆ కమిటీకి కూడా అధ్యక్షుడుగా వుండిన చంద్రబాబు మళ్లీ ఆ ప్రశంసకు వెన్నుపోటు పొడిచారు. అలాగే మోదీ కూడా ‘మీ చంద్రబాబు కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిణతి చెందిన నాయకుడని పార్లమెంటులోనే ప్రకటించి చంద్రబాబుని రెచ్చగొట్టలేదా? దానికి మన బాబు  గారు గింజుకుంటూ ప్రతి సభలోనూ ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అని, తనను అవమానిస్తే యావత్‌ తెలుగు ప్రజానీకాన్ని అవమానించడమేనని గుండెలు బాదుకోవడం చూడ డం లేదా? నిజానికి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మన బాబుగారు కంటే అవమానించిందెవరు? అయినా చెప్పాను కదండీ జనం కూడా ఈనేతల పుణ్యాన చాలా అనుభవం నేర్చుకున్నారు.

రాజధాని ప్రాంతంలో ఒక ఇల్లు, హైదరాబాద్‌లో మరో ఇల్లు వుండగా వీటిల్లో వుండకుండా తన కుటుంబాన్ని స్టార్‌ హోటల్‌ ఒక అంతస్తు మొత్తం అద్దెకు తీసుకుని కోట్లలో అద్దె చెల్లిస్తూ ఉండడంలా? కోట్ల విలువచేసే విలాసవంతమైన ఒక బస్సును రూపొందించుకుని, విదేశాలకు, ప్రత్యేక విమానాలలో ప్రయాణం చేస్తూ ఆ ఖర్చంతా మా నెత్తిన వేయడం లేదా? పైగా ఈ విలాసం అంతా మా కోసమే అంటూ గుత్తాధిపతుల ద్వారా  పరిశ్రమలు పెట్టించి, అందుకు వారికి ఎన్నో అయాచిత సదుపాయాలు కల్పించి ఆ కల్పనలో కమీషన్లు కొట్టేసి మన చంద్రన్న అండ్‌ కో దేశ విదేశాల్లో దాచుకోవడం లేదూ’’ ఇలా ఉన్నది ఉన్నట్లు జనరంజకంగా ఆ పల్లెటూరి రైతు చెప్తుంటే అలా నోరు తెరిచి విన్నాను. ‘‘మీలో ఇంత విషయ పరిజ్ఞానం, వాదనా పటిమ ఉందని నాకు తెలియ దండీ’’ అని ఆయనతో అనకుండా ఉండలేకపో యాను. ‘‘నేనేంటండీ, మా ఊరు రండి, ఎవర్ని కది లించినా ఇంతకంటే నగ్న సత్యాలు, ఇంకా రంజుగా చెప్పగలరండీ. అందుకే ఈసారి చంద్రబాబు తెలుగు దేశం పార్టీ ఓటమిపాలవ్వడం ఖాయం. ప్రస్తుతం జనాన్ని మోసం చేసి, పరస్పరం నిందించుకుంటూ, ఉమ్మడిగా చేసిన ద్రోహం నుంచి ప్రజల దృష్టి మర ల్చేందుకు మోదీ, బాబులు ఎంత నాటకం ఆడుతు న్నప్పటికీ ‘మాది ఫెవికాల్‌ బంధం’ అని అక్కడి నేతలే చెప్తున్నారు కదా. అందుకే కళ్లు తెరుచుకున్న జనం వచ్చే ఎన్నికలలో బీజేపీ, టీడీపీలకు ఉద్వాసన చెప్తారని’’ ఆ పల్లెటూరి పెద్దమనిషి చెప్పాడు. ఆయన మాటలలో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిం చింది. ‘వెన్నుపోటు’ ప్రస్తావన జనంలో ఎంత చైత   న్యాన్ని కలిగించింది!


డాక్టర్‌ ఏపీ విఠల్‌ 
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top